Top 5 Richest Persons in Hyderabad
ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే టక్కున ఎలన్ మస్క్, జెఫ్ బెజోన్, మార్క్ జుకన్ బర్గ్ పేర్లు వినిపిస్తాయి. ఇక భారతదేశంలో రిచ్చెస్ట్ పర్సన్స్ ఎవరంటే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ అని వెంటనే చెబుతారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరు? అంటే చాలామంది తడబడతారు... టక్కున చెప్పేందుకు ఒక్కపేరు కూడా గుర్తురాదు. కాబట్టి మన హైదరాబాద్ లో నివాసముండే అత్యంత ధనవంతులైన తెలుగువారి గురించి తెలుసుకుందాం.
Murali Divi
1. మురళీ దివి :
'దివీస్' ల్యాబ్స్ ఫౌండర్ మురళీ దివి హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనవంతుడు. ఫార్మా రంగంలో తనదైన ముద్రవేసిన మురళి రూ.64,290 కోట్ల ఆస్తులను కలిగివున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన మురళీ దివి స్వగ్రామం. ఆయన తండ్రి సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగి. మద్యతరగతి కుటుంబానికి చెందిన సత్యనారాయణకు 13మంది సంతానం. వీరిలో ఒకరే మురళి.
చిన్నప్పటి నుండి మురళి చదువులో సగటు విద్యార్థి. ఇంటర్మీడియట్ లో అతడు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతడు పట్టుదలతో చదివి బీఫార్మసి,ఎంఫార్మసీ పూర్తిచేసాడు. కొంతకాలం ఇక్కడే ఉద్యోగం చేసి అమెరికాకు వెళ్లాడు.... ఇదే అతని జీవితాన్ని మార్చింది. కొంతకాలం అమెరికాలో పనిచేసి డబ్బులు సంపాదించి ఇండియాకు తిరిగొచ్చిన మురళి 1990లో 'దివీస్' ల్యాబ్ ను ప్రారంభించారు.
Pitchi Reddy
2. పిచ్చిరెడ్డి :
తెలుగు రాష్ట్రాల్లో ఏ భారీ ప్రాజెక్ట్ చేపట్టిన ముందుగా వినిపించే పేరు మెఘా ఇంజనీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL). ఈ కంపనీ దేశవిదేశాల్లో అనేక ప్రాజెక్టులను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఈ కంపనీ ఛైర్మన్ పమిరెడ్డి పిచ్చిరెడ్డి హైదరాబాద్ లోని అత్యంత ధనికుల్లో రెండో స్థానంలో వున్నారు. రూ.37,300 కోట్ల ఆస్తులను పిచ్చిరెడ్డి, ఆయన కుటుంబం కలిగివుంది.
కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. 1989 లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో బాలానగర్ లో మెఘా ఇంజనీరింగ్ ఎంటర్ ప్రైసెస్ ను స్థాపించారు.
అయితే పిచ్చిరెడ్డి స్థాపించిన చిన్న కుటీర పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగా 2006 నాటికి పెద్ద కంపనీగా మారింది. దీంతో మెఘా ఇంజనీరింగ్ ఎంటర్ ప్రైసెస్ కాస్త మెఘా ఇంజనీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా మారింది.
ఇక తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'కాళేశ్వరం' ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ మెఘా కంపనీ పేరు మారుమోగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై అనేక విమర్శలున్నా మెఘా ఇంజనీరింగ్ కంపనీకి ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.
mega krishna reddy
3. కృష్ణా రెడ్డి :
మెఘా ఇంజనీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకులు పిచ్చిరెడ్డి మేనళ్లుడే పివి కృష్ణారెడ్డి. మామ స్థాపించిన కంపనీ రూపురేఖలు మార్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత కృష్ణారెడ్డిదే. ఇలా మెఘా కంపనీలో కీలక పాత్ర పోషించిన కృష్ణా రెడ్డి రూ.35,800 కోట్ల ఆస్తులతో మూడోస్థానంలో నిలిచారు.
1989లో చిన్నగా ప్రారంభమైన మెఘా సంస్థను ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన దిగ్గజ సంస్థగా మార్చారు కృష్ణారెడ్డి. చివరకు ఈ కంపనీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు మెఘా కృష్ణారెడ్డి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా మెఘా కంపనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. కువైట్, టాంజానియా, జాంబియా,బంగ్లాదేశ్ వంటి 10 దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది.
parthasarathi reddy
బి. పార్థసారధి రెడ్డి :
హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకులు బండి పార్థసారథి రెడ్డి హైదరాబాద్ లోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఈయన రూ.21,900 విలువైన ఆస్తులను కలిగివున్నారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో 1965లో జన్మించారు. సత్తుపల్లిలో డిగ్రీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత పిహెచ్డి పూర్తిచేసారు.
చదువు పూర్తికాగానే ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ హెటిరో సంస్థను స్థాపించారు. ఆ తర్వాత తన జాబ్ మానేసి హెటిరో సంస్థను అభివృద్ది చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కంపనీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
ప్రస్తుతం వ్యాపారవేత్తగానే కాదు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు పార్థసారథి. ఆయనను 2022లో ఆనాటి అధికార పార్టీ బిఆర్ఎస్ రాజ్యసభకు పంపింది. ప్రస్తుతం ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు.
Rameshwar Rao
జూపల్లి రామేశ్వరరావు :
రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్స్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హైదరాబాద్ లోని రిచ్చెస్ట్ పర్సన్స్ లో ఐదో స్థానంలో వున్నారు. ఆయన రూ.17,500 కోట్ల ఆస్తులను కలిగివున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కుడికిళ్ల గ్రామంలో సామాన్య మద్యతరగతి కుటుంబంలో రామేశ్వరరావు జన్మించారు. హోమియోపతి చదివిన ఆయన 1979 లో దిల్ సుఖ్ నగర్ లో ఓ క్లినిక్ ను కూడా నిర్వహించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు.
అప్పుడప్పుడే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుండగా రామేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. మైం హోం పేరు సంస్థను స్థాపించి అతి తక్కువ కాలంలోనే రియల్ ఎస్టేట్ దిగ్గజంగా మారారు. కేవలం హైదరాబాద్ లోనే అనేక ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టింది మై హోం.