ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి వుంది. ఇప్పుడే రాష్ట్రంలోని పలుప్రాంతాలు మరీముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 35 నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉక్కపోత మొదలయ్యింది. కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా వున్నాయి.
వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం, అనకాపల్లి, సత్యసాయి, కర్నూల్, అనంతపురం, తిరుపతి, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో ప్రస్తుతం 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగి ఈ ఏడాదిలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గతేడాది 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపుపొందింది. 1901 తర్వాత అత్యధిక వేడి ఈ ఏడాదే నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ఈసారి కూడా ఇదే పరిస్థితి వుంటుందనేది వాతావరణ శాఖ అధికారుల అంచనా. అందుకే ఇంకా వేసవి ప్రారంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయి.