weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. వేసవి ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు ప్రజలు పగటిపూట రోడ్డుపైకి వచ్చేందుకు జంకుతున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లగానే ఉండవచ్చని వాతావరణ విభాగం పేర్కొంది.
ఇప్పటికే తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ మంచు కురుస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది.
మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో మేఘాలతో నిండివుంటుందని సూచించారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మేఘాలు విస్తరించడంతో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు :
తెలంగాణలో మంగళవారం 34 నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదవతాయి. అంటే ఎండ నిరంతరాయంగా కాకుండా మేఘాలు అడ్డురానున్నాయి. దీంతో ఈ ఎండల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే నమోదు కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మేఘావృత వాతావరణం ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎండల తీవ్రత తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏపీలో 35 నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.