
Hyderabad Weather : మనిషులు అభివృద్ది పేరిట ప్రకృతిని నాశనం చేసుకుంటూ ముందుకువెళుతున్నారు. దీని పర్యావసానమే ఈ కాలుష్యం...ఇప్పటికే పంచభూతాలు కలుషితం అయ్యాయి. ముఖ్యంగా గాలి, నీటి కాలుష్యం మనిషి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అందుకు ఉదాహరణ దేశ రాజధాని డిల్లీ. అక్కడి ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ప్రతిరోజు డిల్లీ వాయుకాలుష్యం గురించి కథలు కథలుగా చెబుతున్నా మిగతా నగరాలు జాగ్రత్తపడటంలేదు. ఇప్పటి నుండి వాయు కాలుష్యాన్ని కట్టడిచేసే చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రోజురోజుకు దేశంలోని మిగతా ప్రధాన నగరాలు కూడా ఈ వాయుకాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి.
హైదరాబాద్ లో డిల్లీ స్థాయిలో వాయుకాలుష్యం :
వాయుకాలుష్యం అనగానే మనకు ముందుగా డిల్లీ గుర్తుకువస్తుంది. ఈ కాస్మోపాలిటిన్ సిటీ అన్నిరాష్ట్రాలవారికి ఆశ్రయం ఇస్తుంది... ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలామంది డిల్లీ వెళుతుంటారు. ఇక దేశ పరిపాలనా కేంద్రంగా డిల్లీ ఉంది... కాబట్టి నిత్యం రాజకీయ నాయకులు, అధికారుల సందడి ఉంటుంది. దీంతో వాహనాల రద్దీ ఎక్కువగా మారి వాయుకాలుష్యం పెరిగిపోయింది.
ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటినుండి వెలువడే ప్రమాదకర వాయువులు గాలిని మరింత కలుషితం చేస్తున్నారు.
అయితే మెల్లిగా డిల్లీ సరసన హైదరాబాద్ చేరుతున్నట్లు కనిపిస్తోంది... ఇటీవల కాలంలో ఇక్కడ కూడా వాయుకాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఫిబ్రవరి 24 హైదరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతం సనత్ నగర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 431 గా నమోదయ్యింది. ఇది డిల్లీలోని AQI తో సమానం.
ఈ స్థాయిలో వాయుకాలుష్యం మానవ జీవనానికి చాలా ప్రమాదకరమని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సనత్ నగర్ లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని...మిగతా ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగ్గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటు 108 గా ఉంది. సనత్ నగర్ తర్వాత కేవలం పటాన్ చెరు, జూపార్క్ ప్రాంతాల్లోనే వందకు మించి AQI నమోదయ్యింది... మిగతా ప్రాంతాల్లో తక్కువగానే ఉందని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని డిల్లీలో ప్రతిరోజు AQI 400 నుండి 500 నమోదవుతుంటుంది. కొన్నిసార్లు ఇది తారాస్థాయికి చేరుతుంది. అయితే హైదరాబాద్ లో కూడా ఇంతలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదవడం ప్రమాద ఘంటికలు మోగించడమే... కాబట్టి ఇప్పటికయినా జాగ్రత్తపడి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి.
ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ ఎంతుంటే సేఫ్... ఎంతుంటే ప్రమాదం?
గాలి నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిస్తుంది. ఇది తక్కువగా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్లు... ఎంత ఎక్కువగా ఉంటే అంతలా కాలుష్యం అయినట్లు. ఈ AQI ఓ ప్రాంతం నివాసానికి ఎంత సేఫ్, ఎంత ప్రమాదకమో సూచిస్తుంది.
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 లోపు ఉంటే గాలి చాలా స్వచ్చంగా ఉన్నట్లు. అదే 51 నుండి 100 మధ్య ఉంటే పరవాలేదని...101 నుండి 200 మధ్య ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని అర్థం. ఇక 200 నుండి 300 మధ్య ఉంటే గాలి కాలుష్యం అయినట్లే. 300 నుండి 500 వరకు ఉంటే ఆ గాలి అత్యంత ప్రమాదకరమని ... దీన్ని పీలిస్తే మనుషులు, జంతువుల ఆరోగ్యం దెబ్బతింటుందని అర్ధం.