గణపయ్యా... అలా గాల్లో కూర్చున్నావేంటయ్యా..!

First Published | Sep 9, 2024, 5:43 PM IST

మీరు చాలా వెరైటీ వినాయక విగ్రహాలను చూసివుంటారు... సరికొత్తగా ఏర్పాటుచేసిన మండపాలను చూసుంటారు... కానీ వినాయకుడు గాల్లో కూర్చోవడం చూసారా? 

Vinayaka Chavithi

వినాయక చవితి... యువత ఎంతగానో ఇష్టపడే పండగ. గణపతి చందాల నుండి నిమజ్జనం వరకు వారికి పండగే పండగ. గల్లీ గల్లీలో వినాయక మండపం వుంటుంది... ఊరువాడ సంబరాల్లో మునిగి తేలుతారు... తమ మండపాల వద్ద యువత సందడిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంస్కృతికి కార్యక్రమాలతో కొందరు, తీన్మార్ డ్యాన్సులతో మరికొందరు వినాయక మండపాల సందడి చేస్తుంటారు. ఇలా బొజ్జ గణపయ్యపై తీరొక్క విధాలుగా భక్తిని చాటుకుంటారు.

అయితే చందాలతో మొదలయ్యే సందడి నిమజ్జనం వరకు కొనసాగుతుంది... దాదాపు పదిపదిహేను రోజులు యువత సందడి మామూలుగా వుండదు. ఇలా ప్రతిఒక్కరు ఎంతో జోష్ తో జరుపుకునే పండగ వినాయక చవితి. ప్రస్తుతం యావత్ దేశం వినాయక చవితి సంబరాల్లో మునిగిపోయింది... తీరొక్క రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుడి విగ్రహాలు, సరికొత్తగా ఏర్పాటుచేసిన మండపాల్లో కొలువయ్యాయి. ఇలా తెలుగురాష్ట్రాల్లో కొన్నిచోట్ల చాలా స్పెషల్ గణనాథుడి విగ్రహాలు వెలిసాయి.  

తాము ఏం చేసినా స్పెషల్ గా వుండాలని నేటి యుువత కోరుకుంటున్నారు... ఇలా వినాయక చవితిని కూడా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. కొందరు సాధారణ రూపంలో కాకుండా సరికొత్తగా వినాయక విగ్రహాలను తయారుచేయించుకుంటున్నారు. ఇతర దేవతల రూపాల్లో అంటే వెంకటేశ్వరస్వామి, సాయిబాబా, కృష్ణుడు, రాముడి రూపాల్లో గణనాథుడి విగ్రహాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. సినీ,  క్రీడాప్రియులు మరో అడుగు ముందుకేసి తమకు నచ్చిన హీరోలు,క్రికెటర్ల రూపాల్లో వినాయక విగ్రహాలను తయారుచేయించుకుంటున్నారు. 

గణనాథుడి విగ్రహాలే వెరైటీగా వుండాలని కోరుకునేవారు మండపాలు మామూలుగా వుండనిస్తారా... ఎంతో ప్రత్యేకంగా, మరెంతో వినూత్నంగా వుండేలా చూసుకుంటారు. కొన్నిచోట్ల ఏర్పాటుచేసే వెరైటీ వినాయక మండపాలను చూసేందుకు ప్రజలు తరలివస్తుంటారు. ఇలా తెలంగాణలో ఏర్పాటుచేసిన ఓ వినాయక మండపం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

Vinayaka Chavithi

అలా ట్యాంక్ ఎక్కిన గణపయ్య : 

ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ,ఖమ్మం వంటి ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఇళ్లూవాకిలి వరదల్లో మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితే గతంలో వనపర్తి జిల్లా రేవల్లె ప్రజలకు ఎదురయ్యింది. 

 సరిగ్గా ఇరవైఏళ్ల కిందట రేవల్లేలోని వడ్లగేరి కాలనీవాసులు వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని భావించారు. ఈ ఏడాదిలాగే వినాయక చవితి పండగవేళ వర్షాలు దంచికొట్టడంతో ఊరంతా జలమయం అయ్యింది. కొన్నిచోట్ల వర్షపునీరు నిలవగా, మరికొన్ని ప్రాంతాలు బురదమయంగా మారాయి. దీంతో వినాయక మండపం ఏర్పాటుకు అనువైన స్థలం లేకుండాపోయింది. 

ఇలా ఈసారి వినాయక చవితి జరుపుకోవడం సాధ్యం కాదనే అందరూ అనుకున్నారు. కానీ ఎలాగయినా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాలనే పట్టుదలతో వున్న కొందరు యువతకు వెరైటీ ఆలోచన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆ ఊరిని ఇప్పుడు వార్తల్లో నిలిపింది. 

రేవల్లె గ్రామంలో నీటి సరఫరా కోసం అప్పుడే కొత్తగా ఓ ట్యాంక్ ను నిర్మించారు.  పూర్తిగా పైన నీటిని నిల్వ చేసే ట్యాంక్ వుంటుంది... కింద పిల్లర్లు మాత్రమే వుంటాయి. ఆ ఫిల్లర్ల మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలన్న ఆలోచన తట్టింది.  ఇలా ఆనాడు అనుకోని పరిస్థితుల్లో వినాయక మండపంగా మారిన నీటిట్యాంక్ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 

Latest Videos


Vinayaka Chavithi

గాల్లో గణపతి మండపం ఎలా నిర్మిస్తారబ్బా!  

ముందుగా నీటిట్యాంక్ మద్యలోని ఖాళీ ప్రదేశంలో సెంట్రింగ్ కోసం ఉపయోగించే కట్టెలను బలంగా వుండేలా పాతుతారు. ఆ తర్వాత స్లాబ్ పోయడానికి పరిచే చెక్కలను పరుస్తారు. దీనిపైన మండపం ఏర్పాటుచేస్తారు. 

గాల్లో ఏర్పాటుచేసిన మండపంలోకి గణనాథుడి విగ్రహాన్ని క్రేన్ సాయంతో చేరుస్తారు. ఇలా నేలపై కాకుండా గాల్లో ఏర్పాటుచేసిన మండపంలో గణనాథుడు పూజలు అంటుకుంటాడు. వినాయక మండపంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా నిచ్చెనను ఏర్పాటుచేస్తారు. 

ఇలా గత ఇరవై ఏళ్లనుండి రేవల్లి గ్రామంలో  వినాయక చవితి వచ్చిందంటే చాలు వాటర్ ట్యాంక్ ముస్తాబు అవుతుంది. ఆ పరమశివుడి తలపై గంగమ్మ వున్నట్లు రేవల్లె గణపయ్య తలపైనా గంగమ్మ కొలువై వుంటుంది. వరదల వేళ ప్రారంభమైన ఈ వెరైటీ గణపతి మండపం ఇప్పుడు మళ్ళీ వరదల వేళ వార్తల్లో నిలిచింది. 

Vinayajka Chavithi

ట్యాంక్ ఎక్కిన గణపయ్య సోషల్ మీడియా కామెంట్స్ : 

రేవల్లి గ్రామంలోని నీటిట్యాంక్ పై ఏర్పాటుచేసిన గణనాథుడి మండపం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలా ఎలా ఏర్పాటు చేసారయ్యా... మీరు ప్రతిష్టించిన గణనాథుడినే కాదు ఈ సరికొత్త ఆలోచనకూ దండం పెట్టాల్సిందే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏమయ్యా గణపయ్య... అలా ఏలా నీటి ట్యాంక్ ఎక్కావయ్యా! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక వెరైటీ విగ్రహాలు, మండపాలను ఏర్పాటుచేసారు. ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ను పోలిన వినాయకులు దర్శనమిస్తున్నారు. మరోచోట పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక స్టెప్ నే వినాయకుడి రూపంగా మలిచారు. ఇలా ఒక్కోచోట ఒక్కోరకమైన వినాయకులు దర్శనమిస్తున్నారు.  

click me!