Revanth Reddy
Asara Pensions : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ నూతన సంవత్సర కానుక అందించేందుకు సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎదురుచూస్తున్న ఓ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కొత్త సంవత్సరం వృద్దులు, ఒంటరి మహిళలు, బిడి కార్మికులు, వికలాంగులు శుభవార్త వింటారు. కాస్త ఆలస్యమైనా ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆసరా ఫించన్లను పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే జనవరి లేదంటే ఫిబ్రవరిలో ఫించన్ డబ్బులు డబుల్ చేసి అర్హుల ఖాతాలో వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
Asara Pensions
ఆసరా పించన్లు ఎంత పెరుగుతాయంటే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది... ఇందులో ప్రధానమైనవి ఆరు గ్యారంటీలు. ఈ గ్యారంటీ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి... వీటికి ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారనేది వాదన వుంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గ్యారంటీ హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను పూర్తిచేసింది.
అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు ఆసరా ఫించన్ల పెంపు హామీ మాత్రం అమలుకాలేదు. ఇప్పుడు అప్పుడు అంటూనే సంవత్సరం సాగదీసింది సర్కార్... దీంతో ఫించన్ పెంపుపై ఆశలు పెట్టుకున్న వృద్దులు,ఒంటరి మహిళలు, వికలాంగులు ప్రభుత్వంపై గుర్రుగా వున్నారు. ఇది సీఎం రేవంత్ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన ఫించన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నారని... ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ వృద్దులు, ఒంటరి మహిళలు, బిడి కార్మికుల ఇచ్చే పెన్షన్ ను రూ.2016 నుండి రూ.4000 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే దివ్యాంగుల ఫించన్ ను రూ.4000 నుండి రూ.6000 పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లను పెంచి 2025 జనవరి లేదా ఫిబ్రవరి నుండి ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
Revanth Reddy
ఫించన్ల పెంపు ఇప్పుడే ఎందుకు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా విజయోత్సవాల పేరిట రేవంత్ సర్కార్ సంబరాలకు సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే ప్రజలకు ఏదయినా శుభవార్త చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ ఫించన్ల పెంపు హామీని అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే రైతు భరోసా రాక, రైతు రుణమాఫీ సరిగ్గా జరక్కపోవడంతో రైతులు రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో హామీ మేరకు ఫించన్ల పెంపు చేపట్టకపోవడంతో వృద్దులు, వికలాంగులు కూడా ప్రభుత్వంపై అసహనంతో వున్నారు. అయితే త్వరలోనే పంచాయితీ సర్పంచ్ లు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో ప్రజాగ్రహం మంచిదికాదని భావించి అటు ఫించన్ల పెంపుతో పాటు ఇటు రైతు భరోసాను కూడా అందించే ఆలోచనలో సీఎం రేవంత్ వున్నట్లు తెలుస్తోంది.
రాబోయే సంక్రాంతి తర్వాత గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఆలోపే ఆసరా ఫించన్లను పెంచి వృద్దులు, మహిళలు, వికలాంగులకు దగ్గరవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. దీంతో కొత్త సంవత్సరంలో వృద్దులు,వికలాంగులు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుందని ఆశిస్తున్నారు.
Asara Pensions
కేసీఆర్ హయాంలో ఆసరా పించన్లు :
వృద్దులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఆసరా ఫించన్లను అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన ఈ ఫించన్ల పథకాన్ని రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుతర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పథకం ద్వారా అందించే డబ్బులను భారీగా పెంచారు. అంతకుముందు వృద్దులకు రూ.200 వుంటే రూ.1000, వికలాంగులకు రూ.500 వుంటే రూ.1500చేసారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి ఫించన్ల పెంపు హామీ ఇచ్చారు... అప్పుడు వృద్దాప్య ఫించన్ రూ.1000 నుండి రూ.2016, వికలాంగుల ఫించన్ రూ.1500 నుండి ర.3016 చేసారు. 2023 మరోసారి దివ్యాంగుల ఫించన్ ను రూ.3016 నుండి 4016కు పెంచారు కేసీఆర్.
అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పించన్లను డబుల్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా ఈ హామీ అమలుకాలేదు... కేసీఆర్ హయాంలో ఇచ్చిన పించన్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరంలో అయినా ఆసరా పించన్ల పెంపు వుంటుందో లేదో చూడాలి.