రేవంత్ రెడ్డికి వచ్చిన మార్కులెన్ని..! పాసైనట్లా, ఫెయిలైనట్లా?

First Published | Nov 28, 2024, 11:32 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా వుంది? ఆయన విజయాలు, అపజయాల గురించి తెలుసుకుందాం. 

revanth reddy

Revanth Reddy : సరిగ్గా ఏడాదిక్రితం నవంబర్ 30, 2023 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి పలితాలు వెలువడ్డాయి. ఇందులో వరుసగా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన బిఆర్ఎస్ ను ఓడించి మొదటిసారి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే రాజకీయ చాణక్యుడిగా పేరున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సామాన్య నాయకుడు రేవంత్ రెడ్డి ఓడించారని చెప్పాలి. 

కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. కనీసం మంత్రిగా కూడా పనిచేయని ఆయన సీఎం పీఠమెక్కారు. డిసెంబర్ 7 హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో 'రేవంత్ రెడ్డి అనే నేను' అంటూ ప్రమాణస్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా కాంగ్రెస్ పాలనాపగ్గాలు చేపట్టి... రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది.  

అయితే అసలు ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి లు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విజయోత్సవాలకు పోటీగా నిరసనలకు సిద్దమయ్యాయి ఈ రెండు పార్టీలు. ఇలా తాము ఎంతో చేసామని కాంగ్రెస్ సర్కార్ అంటుంటే... ఏమీ చేయలేరని బిఆర్ఎస్, బిజెపి అంటున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పాలన ఎలా సాగింది? సాధించిన విజయాలు? ఎదురైన అపజయాలు? ప్రజలు ఈ పాలన గురించి ఏమనుకుంటున్నారు? తదితర విషయాల గురించి తెలుసుకుందాం. 
 

Revanth Reddy

రేవంత్ సర్కార్ విజయాలు :  
 
1. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం :

గతేడాది 2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆరు గ్యారంటీ హామీలు బాగా పనిచేసాయి. మరీముఖ్యంగా మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహాలక్ష్మి పథకంలో  గృహిణులకు రూ.2500 ఆర్థిక సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టిసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వున్నాయి. 

అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలుచేసింది. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఇలా ఇచ్చినమాట నిలబెట్టుకుని మహిళలకు మరింత దగ్గరయ్యింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం లక్షలాదిమంది మహిళలు బస్సుల్లో డబ్బులు చెల్లించకుండానే ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇది రేవంత్ సర్కార్ సాధించిన మొదటి విజయమని చెప్పాలి. 

ఇక మహిళలు మరీముఖ్యంగా గ్రామీణ గృహిణులు కట్టెల పొయ్యితో కుస్తీ పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా వుండేందుకు రేవంత్ సర్కార్ సబ్సిడి ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. కేవలం రూ.500 కే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్న హామీని నెరవేర్చింది. ఇది కూడా రేవంత్ సర్కార్ సాధించిన విజయమే అని చెప్పాలి. 
 

Latest Videos


Revanth Reddy

2. గృహజ్యోతి పథకం అమలు : 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలో గృహ జ్యోతి ఒకటి. అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంట్ బిల్లు నుండి ఉపశమనం కలిగించేలా ఈ పథకాన్ని రూపొందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునేవారు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఈ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోపే అమలుచేసింది రేవంత్ సర్కార్. 

3. రైతు రుణమాఫీ : 

ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయం రైతు రుణాల మాఫీ. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు రేవంత్. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాపీ చేపట్టారు. 

రేవంత్ సర్కార్ అపజయాలు : 

1. రైతు భరోసా :

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 'రైతు బంధు' పేరిట ఎకరాకు రూ.10 వేలు (సీజన్ కు రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు) అందించేది కేసీఆర్ సర్కార్. అయితే రేవంత్ ఎన్నికల సమయంలో తాము ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల్లో ఇది ఒకటి. 

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఇప్పటివరకు రైతు భరోసా అమలుకాలేదు. రైతులను రూ.15 వేల ఆర్థికసాయం ఇప్పటివరకు అందలేదు. దీంతో రేవంత్ సర్కార్ పై రైతులు గుర్రుగా వున్నారు... ఈ విషయంలో కేసీఆర్ వుంటేనే బావుండనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. 

ఇక రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12 వేల ఆర్థిక సాయం కూడా అమలుకు నోచుకోవడంలేదు. ఇక ఎన్నికల్లో వడ్లకు రూ.500 బోనస్ కూడా అందరికి వర్తించడంలేదు... కేవలం సన్న రకం వడ్లను పండించినవారికే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

revanth reddy

2. చేయూత పెన్షన్లు : 

తెలంగాణలోని వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. కేసీఆర్ హయాంలో ఈ పెన్షన్ ను భారీగా పెంచారు. ఈ క్రమంలోనే వృద్దులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను రూ.2 నుండి రూ.4 వేలు చేస్తానని... వికలాంగులకు రూ.4 వేల నుండి రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ హామీ అమలుకు నోచుకోలేదు. 

ఇందిరమ్మ ఇళ్లు, విద్యా భరోసా వంటి హామీల విషయంలోనూ ఈ ఏడాది ముందడుగు పడలేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారుగా... ఏమయ్యింది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  

3. హైడ్రా,మూసీ ప్రక్షాలన  :

రాజధాని హైదరాబాద్ లో హైడ్రా, మూసీ ప్రక్షాళన వ్యవహారం కూడా రేవంత్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ రెండు కేవలం పేదలను టార్గెట్ చేసాయనే అపవాదు వచ్చింది. మరీముఖ్యంగా మూసీ ప్రక్షాళన,సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం, ఖాళీ చేయాలని ఒత్తిడితేవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వుంది. హైడ్రా,మూసీ ప్రక్షాళన కారణంగా నిరాశ్రయులవుతున్న పేదలు సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గా వున్నారు. 

రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తూతూ మంత్రంగా ఈ ప్రక్రియ జరిగిందని... ఇప్పటివరకు రుణమాఫీ జరిగిన రైతులకంటే జరగనివారే ఎక్కువగా వున్నారని అంటున్నారు. అన్ని అర్హతలు వున్నా చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదట.  

click me!