అయ్యో పాపం ... కన్నతండ్రి కోసం ఏడ్చిఏడ్చి ఆగిన చిన్నారి గుండె

First Published Aug 17, 2024, 3:50 PM IST

కళ్లముందే కన్నతండ్రిని దుండుగుల చితకబాదుతుంటే ఆ చిన్నారి గుండె తట్టుకోలేకపోయింది. ఆమెపై ఒక్కదెబ్బ పడకున్నా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.  

father daughter

కళ్లెదుటే తండ్రిని చితకబాదుతుంటే కాపాడుకునేందుకు ఆ బాలిక విశ్వప్రయత్నం చేసింది. తన తండ్రిని విడిచిపెట్టాలని కాళ్లపై పడి వేడుకుంది... అయినా కనికరంలేని ఆ కసాయి మనుషులు మనసు కరగలేదు. తండ్రిని కాపాడాలంటూ గ్రామస్తులను వేడుకుంది ... అయిన వాళ్లు ముందుకు రాలేదు. ఇలా తన కళ్లెదుటే కన్నతండ్రి రక్తం చిందడం చూసి తట్టుకోలేకపోయింది చిన్నారి హృదయం. తండ్రికోసం ఏడ్చిఏడ్చి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. 

father daughter

ఏం జరిగింది : 
  
సూర్యాపేట జిల్లా నాగారం మండల డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్య భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్య, సైదులు, కాసం కళింగం లతో చాలాకాలంగా సోమయ్యకు భూతగాదాలు వున్నాయి. ఇటీవల ఈ తగాదాలు మరింత ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే గత గురువారం సోమయ్య ఇంటికి ఇనుపరాడ్లు, కర్రలు తీసుకుని వెళ్లారు దాయాదులు. కుటుంబసభ్యుల ఎదుటే సోమయ్యను విచక్షణారహితంగా చితకబాదారు. 
 

Latest Videos


father daughter

అయితే తన కళ్లముందే తండ్రిని కొడుతుంటే చూసి తట్టుకోలేకపోయింది 14 ఏళ్ల పావని. తండ్రి సోమయ్యను కాపాడుకునేందుకు ప్రయత్నించింది...'మా నాన్నను వదిలిపెట్టండి' అంటూ ధీనంగా వేడుకుంది. అయినా దాయాదులు సోమయ్యను విడిచిపెట్టలేదు... అడ్డుకోబోయిన పావని తల్లి తల పగలగొట్టారు. ఇలా తనముందే తల్లిదండ్రులను కొడుతుంటే చూసి తట్టుకోలేక రోదించింది పావని... ఇలా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దుండగులు అక్కడినుండి వెళ్లిపోగా కుటుంబసభ్యులు పావని దగ్గరకు వెళ్లిచూడగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

father daughter

కూతురు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమపై దాడిచేసి కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి హాస్పిటల్ కు తరలించారు. బాలిక మృతికి కారణమైనవారికి కఠినంగా శిక్షించాలని ఈ ఘటనగురించి తెలిసిన ప్రతిఒక్కరు కోరుతున్నారు.  

ktr

కేటీఆర్ రియాక్ట్ : 

తండ్రికోసం బాలిక మృతిచెందిన ఘటనగురించి తెలిసి మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పటం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 
తండ్రిపై కళ్లెదుటే పాశవికంగా దాడి జరుగుతుంటే చూడలేక సాయంకోసం రోదించి రోదించి 14 ఏళ్ల పాప చనిపోయిందని తెలిసి తన గుండె పగిలిందని కేటీఆర్ అన్నారు. ఇంట్లోకి చొరబడి మరీ దుండగులు దాడిచేయడం దారుణమన్నారు. ఓ ఆడబిడ్డ తండ్రిగా తనకు ఈ ఘటన ఎంతగానో కలచివేసిందని ... చిన్నారి తల్లిని కాపాడుకోలేకపోయామని అన్నారు. ఆ కుటుంబానికి మరీ ముఖ్యంగా ఆ తండ్రికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు.  

click me!