మూడు విడతల్లోనూ మీకు రుణమాఫీ కాలేదా..? అయితే ఈ సమాచారం మీకోసమే...

First Published | Aug 17, 2024, 2:12 PM IST

అన్ని అర్హతలున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీకి మీకు వర్తించలేదా...? అయితే మీలాంటి వారి కోసమే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా..?

Rythu Runa Mafi

Rythu Runa Mafi : తెలంగాణలో రైతు  రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం మూడు విడతల్లో ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది తెలంగాణ సర్కార్. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున మూడోవిడత రూ.2 లక్షల వరకు రుణాలను కలిగిన రైతులకు కూడా మాఫీ వర్తించింది. 

Rythu Runa Mafi

అయితే కొందరు రైతులకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ జరగలేదు. ఇలా మూడు విడతల్లోనూ రుణమాఫీ జరగని రైతులు చాలామంది వున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలతో రైతు వ్యక్తిగత వివరాలు సరిపోకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, వ్యవసాయ,బ్యాంక్ అధికారుల సమన్వయ లోపం... ఇలా అనేక కారణాలతో కొందరు రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. ఇప్పటికే మూడు విడతల రుణమాఫీ ప్రక్రియ పూర్తవడంతో ఇక తమకు రుణమాఫీ కాదని ఈ రైతులు ఫిక్స్ అయ్యారు. 
 


Rythu Runa Mafi

అయితే ఇలా అన్ని అర్హతలుండి రుణమాఫీ జరక్క ఆందోళనకు గురవుతున్న రైతులకు రేవంత్ సర్కార్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇంతటితో రుణమాఫీ ప్రక్రియ పూర్తికాలేదు... ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులందరి రుణమాఫీ కోసం జూలై 15న జారీచేసిన జీవో నంబర్ 567కు అనుబంధంగా వ్యవసాయ శాఖ తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసింది. రుణాలు మాఫీకాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఈ సర్క్యులర్ ద్వారా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 
 

Rythu Runa Mafi

రాష్ట్రంలోని ప్రతి రైతు దగ్గరనుండి రుణమాఫీకి సంబంధించిన వివరాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మండల వ్యవసాయ అధికారులకు ఈ స్పెషల్ డ్రైవ్ బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో రైతులనుండి వివరాలు సేకరిస్తారు...అర్హులైన రైతుల సమస్యను పరిష్కరించి రుణమాఫీ జరిగేలా చూస్తారని వ్యవసాయ తెలిపింది. 

Rythu Runa Mafi

రుణమాఫీకి ఆధార్ కార్డులో తప్పులే కారణమైతే ఆ రైతుల ఇతర గుర్తింపు కార్డులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా  ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను కూడా అంగీకరించాలని సూచించారు. ఇక రేషన్ కార్డు లేని రైతుల కుటుంబ నిర్దారణకు సర్వే చేపట్టనున్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు వేరుగా వుంటే సరిచేసి పోర్టల్ లో నమోదు చేయనున్నారు. రుణం తీసుకున్న మొత్తం, వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్దారణ, దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. ఇంటింటికి వెళ్లి రైతు కుటుంబాల వివరాలను సేకరించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసారు.

Rythu Runa Mafi


ఆధార్ కార్డు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్ సమస్య, భూమికి సంబంధించిన పాస్ బుక్ లో తప్పులు... కారణమేదయినా పరిష్కరించి రుణమాఫీ జరిగేలా చూడటమే ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రుణమాఫీకి అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదనే స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. కాబట్టి రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు గురికావద్దని రేవంత్ ప్రభుత్వం సూచించింది. 

Latest Videos

click me!