
Tourist Places Near Hyderabad : ఉద్యోగం చేసేవారికి రోజూ ఇళ్ళు, ఆఫీసుతోనే సరిపోతుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి కూడా ఇళ్లు, వ్యాపార కార్యకలాపాలతోనే సరిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసించే చాలామంది పరిస్థితి ఇంతే. ఈ వారంరోజుల కష్టాన్ని మరిచిపోయేందుకు వారికి దొరికిన రోజే ఆదివారం. ఈ రోజు కోసం ప్రతి ఉద్యోగి ఎదురుచూస్తుంటాడు. బిజినెస్ చేసేవారిలో కూడ చాలామంది ఆదివారం అన్ని పనులను పక్కనబెట్టి కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తాయి.
ఇలా ఆదివారం కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలనుకునే హైదరబాదీలు... మీ కోసమే ఈ సమాచారం. కేవలం ఒక్కరోజులో వెళ్లివచ్చే ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతాలు లేదంటే ఆద్యాత్మికత వెల్లివిరిసే ఆలయాలు హైదరాబాద్ చుట్టూ చాలా వున్నాయి. ఉదయం వెళ్లి రోజంతా ఎంజాయ్ చేసి తిరిగా సాయంత్రానికి ఇంటికి చేరుకునేంత దూరంలోనే అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
అనంతగిరి హిల్స్, వికారాబాద్ :
హైదరాబాద్ కు అతి దగ్గరగా ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం వికారాబాద్. ఎటుచూసినా పచ్చగా పరుచుకున్న చెట్లు... కొండకోనలతో వికారాబాద్ అటవీప్రాంతం రమణీయంగా వుంటుంది. వర్షాకాలంలో అయితే సెలయేళ్లు, వాగులువంకలతో మరింత అందాన్ని సంతరించుకుంటుంది వికారాబాద్ ప్రాంతం.
వికారాబాద్ లో తప్పకుండా చూడాల్సింది అనంతగిరి హిల్స్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ ను ఇష్టపడేవారు ఈ ప్రాంతంలో బాగా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ నుండి కేవలం గంట రెండుగంటల్లో వికారాబాద్ కు చేరుకోవచ్చు. రోజంతా ప్రకృతి అందాల మధ్య గడపాలనుకునేవారికి వికారాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్.
యాదగిరిగుట్ట :
హైదరాబాద్ సమీపంలో వున్న ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పునర్నిర్మించింది. యాదగిరిగుట్టపై వెలిసిన నరసింహస్వామిని దర్శించుకుని తరిస్తుంటారు భక్తులు.
ఈ ఆలయం హైదరాబాద్ చాలా దగ్గరగా వుంటుంది. నగరంలోని ఎక్కడినుండయినా ఒక్కరోజులోనే ఈ ఆలయానికి వెళ్లిరావచ్చు. యాదగిరిగుట్ట చుట్టుపక్కల కూడా భువనగిరి కోట, స్వర్ణగిరి ఆలయం వంటి సందర్శనీయ ప్రదేశాలున్నాయి. అలాగే హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వెళ్లే మార్గం కనువిందు చేసేలా వుంటుంది.
సింగూరు డ్యామ్, మెదక్ :
హైదరాబాద్ కు కేవలం 100 కి.మీ లోపే ఈ సింగూరు డ్యామ్ వుంటుంది. మంజీరా నదిపై నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆనకట్ట ఇది. వర్షాకాలంలో నీటితో నిండివుండే ఈ సింగూరు డ్యామ్ పరిసరాలు రమణీయంగా వుంటాయి. ప్రకృతి ప్రేమికులు సింగూరు డ్యామ్ పర్యటనను బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కాలంలో హైదరాబాద్ వాసులు ఎక్కువగా వెళ్ళే ప్రాంతం సింగూరు డ్యామ్.
ఏడుపాయల ఆలయం, మెదక్ :
మెదక్ పట్టణానికి సమీపంలో మంజీరా నది ఒడ్డున గల ఆద్యాత్మిక కేంద్ర ఏడుపాయల వనదుర్గా ఆలయం. మంజీరా నది ఒడ్డున ప్రకృతి అందాల నడుమ వెలిసిన అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే వర్షాకాలంలో మంజీరానది ఉగ్రరూపం దాల్చినపుడు మాత్రం అమ్మవారి ఆలయానికి రాకపోకలు నిలిచిపోతాయి.
హైదరాబాద్ నుండి స్నేహితులతో కలిసి వెళ్లేందుకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏడుపాయల ఆలయం. ప్రకృతి అందాల నడుమ మందు, మాంసంతో పార్టీలు చేసుకునేందుకు చాలామంది ఇక్కడికి వెళుతుంటారు. ఆద్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను కోరుకునేవారికి ఏడుపాయల బాగా నచ్చుతుంది.
నర్పాపూర్ ఫారెస్ట్ :
హైదరాబాద్ కు సమీపంలోని మరో ప్రకృతి కేంద్రం నర్సాపూర్ ఫారెస్ట్. దట్టమైన అడవి, రకరకాల జంతువులు, పక్షులతో రమణీయంగా వుంటుంది. నర్సాపూర్ అడవి అందాలను మధ్యలోవుండే సరస్సు మరింత పెంచుతుంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ చేయవచ్చు.
చిలుకూరు ఆలయం :
హైదరాబాద్ శివారుప్రాంతంలోని చిల్కూరులో పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం వుంది. ఈ స్వామిని వీసా దేవుడిగా కొలుస్తుంటారు... విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో వున్నవారు స్వామివారిని దర్శించుకుంటే ఈజీగా వీసా వస్తుందని నమ్ముతుంటారు. సెలవు రోజులు, ఆదివారం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది.
ఇలా హైదరాబాద్ చుట్టూ కేవలం 100 కి.మీ దూరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. కేవలం ఒక్కరోజులు ఆ ప్రాంతాలను సందర్శించి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. మర్నాడు యదావిధిగా బిజీ లైఫ్ లో మునిగిపోవచ్చు.