హైదరాబాద్ డాక్టర్లూ ... మీరు సూపర్ గురూ..: ప్రాణాలు కాపాడేందుకు చార్టర్డ్ ప్లైట్ వాడారా..!

First Published | Aug 28, 2024, 5:53 PM IST

ఓ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ డాక్టర్లు సరికొత్త ప్రయత్నం చేసారు. బాలుడిని వందల కిలోమీటర్ల దూరంనుండి హైదరాబాద్ కు తరలించడానికి డాక్టర్లు ఏం చేసారో తెలుసా? .  

Hyderabad doctor

హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్నవారిని కుటుంబసభ్యులు ఏ బైక్ పైనో లేదంటే కారులోనో హాస్పిటల్ కు తరలించడం చూసుంటారు. పరిస్థితి సీరియస్  గా వుంటే అంబులెన్స్ లో తీసుకెళ్ళడం చూసుంటారు. కానీ ఎయిర్ అంబులెన్స్ గురించి విన్నారా? ఎప్పుడైనా పేషెంట్ ను హాస్పిటల్ సిబ్బందే చార్టర్డ్ ప్లైట్ లో  తరలించడం చూసారా? హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఈ పని చేసింది. ప్రాణాపాయ స్థితిలో వున్న ఓ బాలుడిని వందల కిలోమీటర్లు విమానంలో తరలించి ప్రాణాలు కాపాడారు హైదరాబాద్ వైద్యులు. ఇలా వైద్యో నారాయణో హరి (వైద్యులు దేవుళ్లతో సమానం) అనే సామెతను నిజం చేసారు డాక్టర్లు. 

Hyderabad Doctor

వివరాల్లోకి వెళితే...  చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడేవాడు. రికెట్షియ‌ల్‌ ఇన్ఫెక్ష‌న్ బారినపడ్డ బాలుడి ఆరోగ్య పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. మొదట జ్వరం ప్రారంభమై అది మరింత తీవ్రంగా మారి పిట్స్ కు దారితీసింది. ఆ తర్వాత మెదడులో సమస్య తలెత్తి చివరకు తల్లిదండ్రులను కూడా మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రాణాపాయ స్థితిలో వున్న బాలుడు రాయ్ పూర్ లోని ఓ హాస్పిటల్లో చేరాడు.  
 


air ambulance

అయితే ఆ బాలుడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో రాయ్ పూర్ లోని హాస్పిటల్స్, డాక్టర్లు చేతులెత్తేసాయి. కానీ ఓ హాస్పిటల్ వైద్యులు హైదరాబాద్ కు తీసుకెళితే బాలుడి ప్రాణాలు కాపాడవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో అక్కడి డాక్టర్ల సాయంతో బాలుడి పేరెంట్స్ సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ హాస్పిటల్ ను సంప్రదించారు. బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యులు ఎలాగైన కాపాడాలని నిర్ణయించుకున్నారు. 

air ambulance

రాయ్ పూర్ నుండి బాలుడిని హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో తరలించేందుకు చాలా సమయం పడుతుంది... అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి అంత సమయం ప్రయాణానికి కేటాయించలేమని డాక్టర్లు తేల్చారు. దీంతో వెంటనే ఓ చార్టర్డ్ ప్లైట్ తీసుకుని రాయ్ పూర్ వెళ్లారు. బాలుడికి వెంటిలేటర్ అమర్చి అదే ప్లైట్ లో  హైదరాబాద్ కు తీసుకువచ్చి కొండాపూర్ కిమ్స్ లో చేర్చారు.

Hyderabad

బిపి తగ్గిపోయి, ఊపిరి సరిగ్గా అందక, మాటిమాటికి పిడ్స్ వస్తూ... బాలుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. దీంతో కిమ్స్ కడల్స్ వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అందించడం ప్రారంభించారు.  తొమ్మిదిరోజుల పాటు హైదరాబాద్ లో వైద్యం అందుకున్న బాలుడు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారాడు. ఇక్కడికి తీసుకువచ్చిన రోజునుండే వైద్యం అందించడంతో ఐదు రోజుల్లోనే అతడు కోలుకున్నాడని... ప్రాణాపాయం నుండి తప్పడంతో వెంటిలేటర్ తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. తొమ్మిదిరోజుల్లో పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు కిమ్స్ కడల్స్ డాక్టర్ పరాగ్ డెకాటే వెల్లడించారు. 

Hyderabad

ఇలా తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ ను ఉపయోగించడం వల్లే తొందరగా హైదరాబాద్ కు తరలించి చికిత్స ప్రారంభించామని... అందువల్లే బాలుడి ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్లు తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మే.. కానీ ప్రాణాల‌కంటే ఏదీ ఎక్కువ కాదు కదా అంటున్నారు. సరైన వైద్య  సదుపాయం కోసం కొంత ఎక్కువ ఖర్చయినా సరే... ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని కిమ్స్ కడల్స్ డాక్టర్లు అంటున్నారు. ఇలా బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 

Latest Videos

click me!