Weather : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకేరోజు విపరీతమైన చలి, మండుటెండలు ఉంటున్నాయి. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంటే మద్యాహ్నం మండుటెండలు కాస్తున్నాయి. ఇలా వేరువేరు వాతావరణ పరిస్థితులతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పాడేరు లో 13, మినుములూరు 11, అరకు 13, చింతపల్లి 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రుళ్లు ఇలా పొగమంచుతో చల్లని వాతావరణ ఉంటోంది... పగటిపూట మాత్రం ఎండలు ఎక్కువగానే ఉంటున్నారు.
ఏపీలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది... రాత్రుళ్లు చలి ఎక్కువగా ఉంటోంది, పగలు ఎండ మండిపోతోంది. రాయలసీమ జిల్లాల్లో అయితే ఇప్పుడే నడి వేసవిలో ఉన్నట్లు ఎండలు కాస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి వెళ్లేందుకు జనం జంకుతున్నాయి. ఏవయినా పనులుంటే ఉదయం లేదా సాయంత్రం చూసుకుంటున్నారు.
ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది... చలి, వేడి వాతావరణం ఉంది. తెల్లవారుజామున పల్లెప్రాంతాల్లో ఇంకా పొగమంచు కురుస్తోంది... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అయితే దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీన్నిబట్టే తెలంగాణలో ఉదయం, రాత్రి వాతావరణం ఎలా ఉంటుందో అర్థమవుతోంది.
మద్యాహ్నం సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఎండలు మాడు పగిలేలా కాస్తున్నాయి. మార్చి, ఎప్రిల్ లో ఉండాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అయితే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.