KTR : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని పదేళ్లలో అప్పులరాష్ట్రంగా మార్చారంటూ మాజీ సీఎం కేసీఆర్, గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదికూడా కాలేదు... అప్పుడే వేలకోట్ల అప్పులు చేసిందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్షాలు ఎవరికి తోచిన అప్పుల లెక్కలు వారు చెబుతున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో పాలనను అప్పగించిందని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే... మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం మంచి ఆదాయంతో అప్పగించామని అంటున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి అంటే 2023 చివరినాటికి తెలంగాణ రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉందన్నారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు అవుతోందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.