Telangana Police : ఒకేసారి ఎస్సై ఆత్మహత్య... మహిళా కానిస్టేబుల్ హత్య : అసలేం జరుగుతోంది?

First Published | Dec 2, 2024, 2:24 PM IST

ఒకేరోజు ఇద్దరు పోలీసుల మృతి తెలంగాణలో సంచలనంగా మారింది. పోలీస్ శాఖలో ఈ మరణాలు విషాదాన్ని నింపడమే కాదు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. 

Telangana Police

Telangana Police : తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేగింది. ఒకే రోజు ఓ ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఒకరిది ఆత్మహత్య కాగా మరొకరిది హత్య. ఇద్దరు పోలీసుల మృతి వేరువేరు ఘటనలే అయినా ప్రజలను రక్షించాల్సిన ఖాకీలు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు తెలంగాణ హోంశాఖలో ఏం జరుగుతోంది? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

నిన్న(ఆదివారం) ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉదయ విధులకు వెళుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను నడి రోడ్డుపై నరికిచంపారకు. సొంత సోదరుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇలా ఒకేరోజు ఇద్దరు పోలీసులు మృతిచెందిన ఘటనలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. 
 

ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై హరీష్ సూసైడ్ : 

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోతతో మారుమోగింది.  గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు... మృతులంతా మావోయిస్టులే. ఈ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే అదే ములుగు జిల్లాలో ఎస్సై హరీష్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 

ఆదివారం ఉదయం ఎన్కౌంటర్ వార్త బయటకువచ్చిన తర్వాత వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న రుద్రారపు హరీష్ విధులకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. పోలీస్ స్టేషన్ కు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆయన నేరుగా పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్ కు వెళ్ళాడు. అక్కడ ఓ రూం తీసుకున్నాడు.

ఆదివారం ఉదయం రూంలోకి వెళ్లిన ఎస్సై ఇవాళ ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన రిసార్ట్ సిబ్బంది వెళ్లిచూడగా ఆయన విగతజీవిగా రక్తపుమడుగులో పడివున్నాడు. వెంటనే రిసార్ట్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. రాత్రే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. హరీష్ మృతివార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే ఎన్కౌంటర్ జరిగిన రోజే ఎస్సై సూసైడ్ పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ ఏమైనా ఎస్సై ఆత్మహత్యకు కారణమా అన్న అనుమానం కలుగుతోంది. పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలతోనే హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్దారించారు. ప్రస్తుతం ఎస్సై సూసైడ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 

Latest Videos


women police

హైదరాబాద్ లో మహిళా కానిస్టేబుల్ హత్య : 

వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య బైటపడ్డ ఇదేరోజు మరో మహిళా కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయింది. సొంత తమ్ముడే అక్కను అతి దారుణంగా హతమార్చాడు. ఇది పరువుహత్యగా తెలుస్తోంది. 

హైదరాబాద్ పరధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో నాగమణి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. రోజువారి విధుల్లో భాగంగా ఇవాళ(సోమవారం) ఉదయం ఇంట్లోంచి టూవీలర్ పై పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది. అయితే ఆమెకోసం మార్గమధ్య ఎండ్లగూడ రహదారిపై కాపుకాసిన సోదరుడు పరమేశ్ కారుతో వేగంగా దూసుకొచ్చి టూవీలర్ ను ఢీకొట్టాడు. దీంతో నాగమణి ఎగిరి రోడ్డుపై పడిపోగా గాయపడివున్న ఆమెపై ఆ  కసాయి సోదరుడు ఏమాత్రం కనికరం చూపలేదు. అమెను కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 

నాగమణి హత్యకు కులాంతర వివాహమే కారణంగా తెలుస్తోంది. 15 రోజులక్రితమే ఈమె ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోయినా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న తమ్ముడు పరమేశ్ ఇవాళ దారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో వున్నాడు.అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 
 

Telangana Police

తెలంగాణ పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? 

ఒకేరోజు ఇద్దరు పోలీసుల మృతితో తెలంగాణ హోంశాఖలో కలకలం రేగింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా ప్రాణాలు కోల్పోతుంటే ఎలాగని సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్సై ఆత్మహత్యకు గల కారణమేంటో తెలియజేయాలని...కానిస్టేబుల్ ను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుంగా హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

click me!