లాక్‌డౌన్ సమయంలో మూగజీవాల బాధ వర్ణనాతీతం. మనిషి నాలుగు గోడలకే పరిమితం కావడంతో వీటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ స్నేహలత మూగ జీవాల ఆకలి తీర్చారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద కుమార్తెతో కలిసి మూగజీవాలకు పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్ధాలను అందించారు.
ఈ సందర్భంగా స్నేహలత మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలకు ఆకలి తీర్చడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుందని అన్నారు.
అలాగే లాక్ డౌన్ లో ఆలయాలను మూసివేయడంతో కొండగట్టు క్షేత్రం లో కోతులకు ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో మూగజీవాలకు పండ్లు, ఆహారపదార్థాలను అందిస్తూ కొంతమేరకు ఆకలి తీర్చుతున్నామని చెప్పారు.