హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో పక్కరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే ఇక్కడ కూడా వైన్ షాపుల వద్ద మందుబాబులు హంగామా మొదలయ్యింది. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా మద్యం ప్రియులు పెద్దపెద్ద క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండానే మద్యంకోసం ఎగబడుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండాఇండ్లనుండి బయటకు వచ్చి మందుబాబులు చేస్తున్న హంగామా ఆందోళన కలిగిస్తోంది.
అయితే కొన్నిచోట్లమాత్రం మందుబాబులు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. వైన్ షాప్స్ యాజమాన్యం గీసిన సర్కిల్లలోనే నిలబడి మద్యాన్ని కొనుగోలుచేస్తున్నారు. ఇలా సంయమనం పాటించి మద్యాన్ని కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మద్యం కోసం మహిళలు కూడా వైన్ షాప్స్ వద్ద బారులు తీరారు. మరీముఖ్యంగా రాజధానిహైదరాబాద్ లో చాలామంది మహిళలు మద్యం దుకాణాల వద్ద మందుకోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
పక్కరాష్ట్రాల్లో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మద్యం దుకాణాల వద్ద కేవలం ఎక్సైజ్ పోలీసులే కాదు సాధారణ పోలీసులను కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మందుబాబులను కంట్రోల్ చేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నారు.
భారీ క్యూలైన్లలో నిలబడి మందును కొనుగోలు చేసినవారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మద్యం బాటిల్స్ ను చేతపట్టుకుని ఆప్యాయంగా దాన్ని ముద్దాడటం, చిందులు వేయడం చేస్తున్నారు. క్రీడాకారులు ట్రోఫీని ప్రదర్శించినట్లుగా తాము కొనుగోలు చేసిన మందు బాటిల్ ను గర్వంగాచూపిస్తున్నారు.
కొన్ని వైన్ షాప్స్ వద్ద మందుబాబులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.ఎండలో భారీ క్యూలైన్లలో నిలబడటానికి బదులు తమ చెప్పులను క్యూలో పెట్టి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఎండనుండి తప్పించుకోవడమే కాదు బౌతికదూరాన్ని కూడా పాటిస్తున్నారు.
''నో మాస్క్ నో ఆల్కహాల్'' నినాదంతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలను చేపట్టింది. మాస్కులు ధరించకుండా వచ్చేవారికి మద్యం అమ్మకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించారు. దీంతో మందుబాబులు మాస్కులు ధరించి వస్తున్నారు.
ఇంతకాలం ప్రజలెవ్వరూ బయటకు రాకుండా చూసిన పోలీసులు ఇప్పుడు వైన్ షాపుల వద్ద మందుబాబులను అదుపు చేస్తున్నారు. మద్యం మత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడటమే కాదు కరోనా వ్యాప్తి చెందకుండా కాపు కాస్తున్నారు.