Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్దం హద్దులుదాటి ఆందోళనలకు దారితీసింది. తమ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు నిండు సభలో అవమానించారంటూ బిఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం చేపట్టారు బిఆర్ఎస్ నాయకులు. ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు.
Telanana Assembly
నిన్న సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని ... ఆయన క్షమాపణలు చెప్పాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసారు. కేటీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇవాళ(గురువారం) నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు. వారికి కేటాయించిన సీట్లలో కాకుండా నేలపై కూర్చుని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
Telanana Assembly
ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్ ముందు కూర్చుని నిరసన తెలిపారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో మార్షల్స్ వారిని బలవంతంగా అక్కడినుండి తరలించారు. కేటీఆర్ ను కాళ్లు చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్ లో కూర్చోబెట్టారు. మిగతా ఎమ్మెల్యేలను సైతం అలాగే పోలీస్ వ్యాన్ లో ఎక్కించి అసెంబ్లీ నుండి తరలించారు. ఇలా ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలంటూ చేపట్టిన ఆందోళనలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
Telanana Assembly
అసలు సీఎం రేవంత్ ఏమన్నారు..:
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్, మంత్రుల మధ్య వాడివేడి వాగ్వాదం జరుగుతోంది. నిన్న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కామెంట్స్ చేసారు. 'వెనకాల కూర్చున్న అక్కలు ఇక్కడ ముంచినాకే అక్కడ తేలారు.ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది'' అంటూ కేటీఆర్ ను సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలను నమ్మొద్దు అంటూ సీఎం సూచించారు. ఈ వ్యాఖ్యలే దుమారానికి కారణం అయ్యాయి.
Telanana Assembly
అయితే సీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వారిగురించి కామెంట్ చేసారు. కష్టకాలంలో వుండగా కాంగ్రెస్ కు అండగా వుండాల్సింది పోయి పార్టీ మారి పరువు తీసారంటూ సబిత,సునీత లక్ష్మారెడ్డిలపై మండిపడ్డారు. ఏం మొఖం పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఘాటుగానే విమర్శించారు.
Telanana Assembly
ఇలా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిల గురించి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వెంటనే వీరు తమ మహిళా ఎమ్మెల్యులకు క్షమాపణలు చెప్పాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కానీ సీఎం రేవంత్ తన మాటలకు వివరణ ఇచ్చుకుంటున్నారే తప్ప క్షమాపణలు చెప్పడానికి సిద్దంగా లేరు. దీంతో గందరగోళం కొనసాగుతోంది.
Telanana Assembly
అక్కలను ఎందుకలా అన్నానంటే... రేవంత్ వివరణ :
తనను కాంగ్రెస్ లోకి రావాలని కోరిందే సబితా ఇంద్రారెడ్డి... అక్కలా భావించే ఆమె మాటలను తాను గౌరవించానని సీఎం రేవంత్ తెలిపారు. ఇలా ఆమె ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరితే... ఆమె మాత్రం బిఆర్ఎస్ లో చేరిపోయారని రేవంత్ పేర్కొన్నారు. తనకు అండగా ఉండానని చెప్పిన అక్క పార్టీ మారడం మోసం కాదా... ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పిన అక్క వ్యతిరేకంగా ప్రచారం చేయడం మోసం కాదా..? అంటూ సీఎం రేవంత్ అన్నారు.
Telanana Assembly
ఇక 2018 లో మరో అక్క సునితా లక్ష్మారెడ్డి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని... అప్పుడు తనపై కౌడిపల్లి, నర్సాపూర్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టించిందని రేవంత్ గుర్తుచేసారు. ఆ తర్వాత సనీతక్క అధికార పార్టీలోకి పోయారు... అప్పుడయినా ఆమెకోసం ప్రచారానికి వెళ్లిన తమ్ముడిపై కేసులనయినా తియించాలా వద్దా? అని నిలదీసారు. ఆమె మాత్రం హ్యాపీగా మహిళా కమీషన్ పోస్టు తీసుకున్నారు... తనపై కేసులేమో అలాగే వున్నాయన్నారు.
Telanana Assembly
ఇలా ఇద్దరు అక్కలను నమ్మి గతంలో తాను మోసపోయానని... ఇప్పుడు ఆ ఇద్దరక్కలు బిఆర్ఎస్ లో వున్నారని మాత్రమే తాను గుర్తుచేసానని రేవంత్ అన్నారు. ఆ అక్కలను నమ్మి మోసపోవద్దని మాత్రమే కేటీఆర్ కు సూచించాను... ఇందులో తప్పు ఏముందున్నారు. సభలో వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించలేదు... వాళ్ల గురించి అన్ పార్లమెంటరీగా ఏం మాట్లాడలేదన్నారు.
Telanana Assembly
తాను మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిల గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు... వాళ్లు నన్ను మోసం చేసారని అని మాత్రమే అన్నానని రేవంత్ వివరించారు. ఒక అక్క తనను నడి బజారులో వదిలేనా ఏం అనలేదు...మరో అక్కకోసం కేసులో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగినా ఏం అనలేదన్నారు. అయితే తనను నమ్ముకున్న అక్కలు ఇప్పుడు మంత్రులయ్యాయి.... కానీ ఆ తమ్ముడు(కేటీఆర్) ను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా వుందో అందరూ చూస్తున్నారంటూ రేవంత్ ఎద్దేవా చేసారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తీహార్ జైల్లో వుంది... మీ పరిస్థితి ఇలా వుంది... అంటూ కేటీఆర్ పై కూడా సెటైర్లు వేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.