
Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమను గెలిపించి అధికారాన్ని అప్పగిస్తే ఏమేం చేస్తారో హామిలిచ్చారు... ఇందులో కీలకమైనది రైతు రుణమాఫీ. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని... ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే రైతు రుణమాఫీని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
మూడు విడతల్లో రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయడానికి సిద్దమైన రేవంత్ సర్కార్ ఇప్పటికే రెండు విడతలను పూర్తిచేసింది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు...రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసారు. ఇలా రెండు విడతల్లో 17 లక్షల 75 వేల మంది రైతుల రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం రూ.12,224 కోట్లను రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమచేసింది.
ప్రభుత్వ చొరవతో చాలామంది రైతులకు రుణ విముక్తి జరిగింది. అయితే కొందరు రైతులు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం రుణమాఫీకి అర్హులైనా వారి ఖాతాల్లో డబ్బులు పడలేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ వివిధ కారణాలతో వీరు లబ్ది పొందలేకపోయారు. తమకు రుణాలు మాఫీ కాకపోవడానికి కారణం తెలుసుకుని పరిష్కరించుకుంటే ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి.
చాలామంది రైతులకు బ్యాంకులు, అకౌంట్ సమస్యల కారణంగానే రుణమాఫీ పొందలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఇలా రైతులకు రుణమాఫీ జరక్కపోవడానికి గల నాలుగైదు కారణాలను అధికారులు తెలిపారు. అవేంటో చూద్దాం.
రుణమాఫీ జరక్కపోడానికి కారణాలు :
బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ లేకపోవడం వల్ల చాలామంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారట. గతంలో చాలాసార్లు అకౌంట్స్ కు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించామని...అయినా కొందరు రైతుల అవగాహనలోపంతో ఈ పని చేయలేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇలా రుణమాఫీకి అర్హులై వుండి ఆధార్ అనుసంధానం లేని రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడలేవు.
ఇక కొందరు రైతుల బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ను లింక్ వున్నా రుణమాఫీ కాలేదు. ఇలా బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఆధార్ కార్డు డిటెయిల్స్ సరిపోకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇలా ఆధార్ కార్డు సమస్య కారణంగా రుణమాఫీ పొందలేకపోయిన రైతులను ఇప్పటికే గుర్తించిన అధికారులు సమస్యను పరిష్కరించే పనిలో వున్నారు.
వ్యవసాయం మాత్రమే కాదు ఇతర ఆదాయ మార్గాలు కలిగి ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. అయితే ఈ విషయం తెలియని రైతులు రుణమాఫీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు రుణమాఫీ కాలేదని అధికారులను సంప్రదిస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కూడా చాలా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరికొందరు రైతులు రుణాలను తిరిగి చెల్లించి ఆ బ్యాంక్ అకౌంట్ ను క్లోజ్ చేసుకున్నారు. ఇలాంటివారు కూడా తమకు రుణమాఫీ రాలేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరు రుణమాఫీ పొందాలంటే బ్యాంక్ అధికారులను సంప్రదించాల్సిందే.
ఇలా అన్ని అర్హతలు కలిగివుండి రుణమాఫీ కాలేదంటే ఇందుకు సాంకేతిక కారణాలే ఎక్కువగా వున్నాయి.కాబట్టి రైతులు రుణం పొందిన బ్యాంక్ ను లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే మంచిది. రుణమాఫీ కాకపోడానికి కారణాలు వారికి తెలుస్తాయి... కాబట్టి పరిష్కార మార్గాలను సూచించి రుణమాఫీ జరిగేలా సహకరిస్తారు.