
Telangana Cabinet Meeting : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరికొన్ని గుడ్ న్యూస్ లు చెప్పింది. ఇప్పటికే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా మరికొన్ని హామీల అమలుకు సిద్దమయ్యింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలివే :
1. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పదేళ్ళ పాలనలో కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులను జారీ చేయలేదని... దీంతో ప్రస్తుతం చాలా కుటుంబాలకు రేషన్ కార్డు లేకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ లో చర్చించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని కూడా నెరవేర్చుందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యంది. ఈ జాబ్ క్యాలెండర్ గురించికూడా మంత్రివర్గం చర్చించింది. రేపు అంటే శుక్రవారం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయనున్నారు.
3. హైదరాబాద్ నగరం రోజురోజుకు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిని కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ గ్రామాలను జిహెచ్ఎంసిలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు.
4. తెలంగాణ క్రీడాకారులు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ లకు ప్రభుత్వ ఉద్యోగంతతో పాటు హైదరాబాద్ లో ఇంటిస్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వీరికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, 600 గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నారు.
5. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనా కేబినెట్ లో చర్చించారు. మళ్లీ గవర్నర్ కు కోదండరాం, అమీర్ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
6. మల్లన్నసాగర్ నుండి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటీ అవసరాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. గోదావరి నీటితో హైదరాబాద్ సమీపంలోని జంట జలాశయాలను నింపి...వాటినుండి నగరవాసులకు నీటిని అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇవాళ కేబినెట్ లో చర్చించారు.
7. తాజాగా కేరళలోని వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విపత్తుపై కేబినెట్ విచారం వ్యక్తం చేసింది.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం, గాయపడిన వారికి వైద్యసాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు బాధితులకు ఎలాంటి సాయం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది...ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
8. విధినిర్వహణలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ డిజి రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమీషనర్ ఉద్యోగం, అడిషనల్ డిజి మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
9. దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని గౌరెల్లి ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లను విడుదల చేయాలని కెబినెట్ నిర్ణయించింది.
10.మూసీ ప్రక్షాళన, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరపైనా కేబినెట్ లో చర్చించారు. చిత్తశుద్దితో ఈ పనులు కూడా పూర్తి చేయాలని రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.