Telangana Assembly Elections 2023
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్దమయ్యింది. ఇప్పటికే ఇతర పార్టీలతో పొత్తులు, మరికొన్నింటి మద్దతు, అభ్యర్థుల ఎంపిక తదితర వ్యవహారాలను చక్కబెట్టుకున్న కాంగ్రెస్ ఇక ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తెలంగాణపైనే కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గెలిచి తీరాలని భావిస్తున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను రంగంలోకి దింపుతోంది.
Rahul Gandhi
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు ఎన్నికల కార్యక్రమాల్లో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్, ప్రజల్లో పార్టీ బలం తెలుసుకున్న వీళ్లు కొద్దిగా కష్టపడితే విజయం ఖాయమని అభిప్రాయానికి వచ్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో దగ్గరుండి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టేందుకు రాహుల్, ప్రియాంక సిద్దమైనట్లు తెలుస్తోంది.
Revanth Reddy
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది... అయినా కాంగ్రెస్ కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇవాళో రేపో పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని కీలక నాయకులంతా ప్రజల్లోనే వుండాలని అదిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా తెలంగాణలోనే తిష్టవేసి ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నారు.
Rahul- Priyanka
నవంబర్ 15 నుండి 28 వరకు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణలోనే వుండేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందట. దాదాపు 14 రోజులపాటు ఈ ఇద్దరూ రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వీరి పర్యటన వుండేలా తెలంగాణ కాంగ్రెస్ చూస్తోంది. ఇలా కేసీఆర్ కు ధీటుగా రాహుల్, ప్రియాంక లతో ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
Revanth Reddy
ఇక టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా వున్న స్థానాల్లో ప్రచార బాధ్యతలు అభ్యర్ధులకే అప్పగించి బలహీనంగా వున్నచోట్ల తాను ప్రచారం చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ ప్రచారానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్దమవుతోందని తెలుస్తోంది.
Revanth Reddy
ఇదిలావుంటే ఏ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తీసుకోన్నారట. ఇలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ల తమతమ జిల్లాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఇలా బిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రచార జోరును పెంచాలని చూస్తోంది.