Sigachi Industries : ప్రేమకు ఊపిరి పోసిన కంపెనీయే ప్రాణాలు తీసింది... సిగాచి ప్రమాదం రాసిన కన్నీటి కథ

Published : Jul 02, 2025, 10:50 AM ISTUpdated : Jul 02, 2025, 11:41 AM IST

వారి ప్రేమకు ఊపిరిపోసిన కంపెనీయే చివరకు ఊపిరి తీసింది. సిగాచి కంపెనీ ప్రమాదంలో మరికొద్దిరోజుల్లో పెళ్ళికి సిద్దమైన ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. వీరి కన్నీటి కథ అందరితో కంటతడి పెట్టిస్తోంది. 

PREV
15
యువ జంటను చిదిమేసిన సిగాచి ప్రమాదం

Sigachi Industries :హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలామంది ప్రాణాలను బలితీసుకుంది. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు... ఈ దుర్ఘటనలో ఇప్పటికే 45 మంది మృతిచెందినట్లు గుర్తించారు. అయితే మరికొందరు ఆఛూకీ ఇంకా తెలియడంలేదు... దీంతో శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉంది... దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ సిగాచి ప్రమాదంలో ఓ యువ ప్రేమజంట కూడా ప్రాణాలు కోల్పోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య. కానీ వారిద్దరూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జీవితాంతం కలిసి బ్రతకాలని భావించిన ఈ జంట చివరకు కలిసి ప్రాణాలు కోల్పోయారు.

25
నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ప్రేమ ప్రయాణం

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి ఎమ్మెస్సి పూర్తిచేసాడు. ఎన్టిఆర్ జిల్లా తిరువూరుకు చెందిన శ్రీరమ్య కూడా ఎమ్మెస్సీ చదివింది. ఈ ఇద్దరు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు...  సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సిగాచి కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు.

సాధారణ రైతు కుటుంబాల నుండి వచ్చిన ఈ ఇద్దరినీ ఈ సిగాచి కంపెనీయే కలిపింది. ఒకేదగ్గర పనిచేసే నిఖిల్, శ్రీరమ్య మధ్య కొంతకాలానికే స్నేహం పెరిగింది... ఇదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు కలవడంతో కొంతకాలం ప్రేమ ప్రయాణం కొనసాగింది... ఎలాగూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యారు కాబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ దిశగా అడుగులు వేశారు. 

35
యువజంట పెళ్లి

నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య పెళ్లికి మొదట్లో పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు... హైదరాబాద్ లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇద్దరూ ఒకేదగ్గర పనిచేసేవారు... కాబట్టి కలిసే వెళ్ళివచ్చేవారు. ఇలా వారి కొత్త జీవితం సాఫీగా సాగింది.. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

వీరిద్దరి మధ్య ప్రేమను చూసి తల్లిదండ్రుల మనసులు కూడా కరిగాయి. మొదట నిఖిల్, శ్రీరమ్య పెళ్లికి అంగీకరించనివారే... ఇటీవలే పిల్లలిద్దరి పెళ్లికి అంగీకరించారు. ఆషాడం మాసం ముగిసాక ఘనంగా బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా మరోసారి వివాహ వేడుకలు జరపాలని నిర్ణయించారు... ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇంతలోని సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగింది... ఇందులో ఈ యువజంట ప్రాణాలు కోల్పోయింది. దీంతో శుభకార్యం జరిగి ఆనందంగా ఉండాల్సిన ఇంట చావుబాజా మోగి విషాదం నిండిపోయింది. 

45
నిఖిల్, శ్రీరమ్య ప్రేమ, పెళ్లి గురించి ఎమ్మెల్యే కొలికపూడి

తన నియోజకవర్గానికి చెందిన సాధారణ రైతుకూలీ బిడ్డ శ్రీరమ్య మృతిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. నిఖిల్ రెడ్డితో ఆమె ప్రేమ గురించి ప్రస్తావించిన ఆయన వీరి పెళ్లికోసం తాను చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకున్నారు. సిగాచి పరిశ్రమలో పనిచేసే ఈ ఇద్దరూ చనిపోవడం బాధాకరం అంటూ ఆయన సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఆయన పోస్ట్ చదివేవారి మనసులను కలచివేస్తోంది. 

నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య మృతి నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫేస్ బుక్ పోస్ట్ యధావిధిగా...

ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి..... ఎమ్మెస్సీ చదువుకొని పటాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీ రమ్య.... తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకుంది.

పిల్లలు ఇద్దరు అత్యంత సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి స్నేహితులుగా మారిన వాళ్లు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత..... వారి కుటుంబాలకు తెలియజేశారు. వారి ప్రేమ వివాహానికి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డాయి.  కొన్ని నెలలపాటు తీవ్ర మనోవేదన అనుభవించిన ఆ యువ జంట..... సహాయం కోసం నాతో మాట్లాడారు.

నేను వెంటనే నిఖిల్ రెడ్డి అమ్మగారితో మాట్లాడాను...ఆమె చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు... శ్రీనివాస్ అన్న.... నాకు ఇద్దరు మగ పిల్లలు.... ఇప్పుడు నా పెద్ద కొడుకు నిఖిల్ ఇష్టపడి రమ్యని కోడలుగా మా ఇంటికి తీసుకు వస్తే... ఆ పాపని మా సొంత కూతురులాగా చూసుకుంటాం. వాళ్ల పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.... అని ఆ తల్లి చెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత రమ్య కుటుంబ సభ్యులకు నేనే ధైర్యం చెప్పి రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు మొదలుపెట్టాం.

ఆ తర్వాత నిఖిల్ రెడ్డి కుటుంబం జమ్మలమడుగు నుంచి పుట్రెల వచ్చి రమ్య తల్లిదండ్రులతో మాట్లాడారు. కొద్దిరోజుల తర్వాత రమ్య కుటుంబం జమ్మలమడుగు వెళ్లి నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుని, ఆషాడ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్ళి చేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఇది జరిగిన తర్వాత పిల్లలిద్దరిని హైదరాబాదులో మా ఇంటికి పిలిచి... ధైర్యం చెప్పి.... బట్టలు పెట్టి పంపించడం జరిగింది.

నాలుగు రోజుల క్రితం రమ్య కుటుంబ సభ్యుల నుండి త్వరలో నిశ్చితార్థం పెట్టుకుంటాము.... మీరు తప్పనిసరిగా రావాలి అని ఆహ్వానం అందింది. నేను కూడా వస్తాను అని చెప్పాను.

55
ప్రేమజంట మృతిపై ఎమ్మెల్యే కొలికపూడి విచారం

సోమవారం ఉదయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో నా కార్యక్రమాలలో బిజీగా ఉన్న నాకు పటాన్చెరువులోని ఫార్మా కంపెనీలో పేలుడు గురించి, భారీ ప్రాణ నష్టం గురించి తెలియగానే.... ఈ పిల్లలు పనిచేస్తున్న కంపెనీ పేరు తెలుసుకోవటానికి... ముందుగా నేను నిఖిల్ రెడ్డికి ఫోన్ చేశాను.... స్పందన లేదు. ఆ తర్వాత రమ్య కి ఫోన్ చేశాను.... స్పందన లేదు. ఆ తర్వాత రమ్య అక్కకు ఫోన్ చేశాను..... స్పందన లేదు.

మధ్యాహ్నం తర్వాత.... కొన్ని టీవీ చానల్స్ లో పేలుడులో మరణించిన వారి గురించి..... ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు స్క్రోలింగ్ మొదలైంది. అది చూసి హైదరాబాద్ బయలుదేరిన నేను సాయంత్రం 6 గంటల సమయానికి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీకి చేరుకునే సమయానికి.... రమ్య అక్క జ్యోత్స్న.... ఆమె స్నేహితులు మరో ముగ్గురు తీవ్ర విషాదంలో అక్కడే ఉన్నారు.

ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిన తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి రమ్య అక్కకు కంపెనీ వారి నుండి ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు తెలిసింది. నేను వెళ్ళిన తర్వాత... అక్కడున్న కలెక్టర్ తో పోలీస్ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎవరు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అప్పటికే.... గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలను/గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న మూడు నాలుగు ఆసుపత్రులకు తరలించారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆయా ఆసుపత్రులకు వెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి తమ బంధువుల ఆచూకీ తెలుసుకోమని చెప్పారు.

ఉదయం నుంచి వర్షం లోనే తడుస్తూ.... కంపెనీ దగ్గరే ఉన్న రమ్య అక్కను... ఆమె స్నేహితులను వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసి, నేను రాత్రి 9 తర్వాత మా ఇంటికి చేరుకున్నాను. ఉదయాన్నే బయలుదేరి మళ్లీ కంపెనీ దగ్గరికి వెళ్లాలని రాత్రి అనుకున్నాము.

అయితే తెల్లవారే సమయానికి...... నిఖిల్ రెడ్డి పాత రూమ్ మెట్ ఫోన్ చేసి... వాళ్ళిద్దరూ మనకు లేరు సార్ అని చెప్పాడు. మరి కాసేపటికి ..... ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు.....పటాన్చెరు ఆసుపత్రి నుండి రమ్య అక్కకు సమాచారం అందింది. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు....

మా నాన్న 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు..... మా నాన్నకు ఏదైనా సహాయం చేయండి సార్ అని..... మొన్న రమ్య మా ఇంటికి వచ్చినప్పుడు అడిగింది. గత సంవత్సర కాలంలో ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు నన్ను కలిశారు. మరి కొద్ది రోజుల్లో జరగబోయే పెళ్లి సందర్భంగా... వాళ్ళింటికి వస్తానని చెప్పాను.

ఇంతలోనే...... ఒక కన్నీటి ఉప్పెన..... ఆ పిల్లల స్వప్నాలను తుడిపేసింది. ఆ తల్లిదండ్రుల గుండెలకు చికిత్స లేని గాయం చేసింది.

ఎంత కంట్రోల్ చేసుకున్న.... ఆగని కన్నీళ్ళతో.....

కొలికపూడి శ్రీనివాసరావు

Read more Photos on
click me!

Recommended Stories