
Holidays : సెలవుల కోసం స్కూల్ విద్యార్థులే కాదు కాలేజీ యువత కూడా ఎదురుచూస్తుంటారు. ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవేదైనా వచ్చిందో సంబరపడిపోతుంటారు. ఇలా ఒక్కరోజు సెలవు వస్తేనే విద్యార్థులు, ఉద్యోగులు సంబరపడిపోతుంటారు... మరి వరుసగా రెండుమూడు రోజులు సెలవు వస్తే ఎగిరిగంతేస్తారు.
తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం అంటే ఫిబ్రవరి 14,15, 16 మూడురోజులు సెలవులు వుండే అవకాశం వుంది. లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం విద్యార్థులు, ఉద్యోగులు పండగ చేసుకుంటారు.
ఫిబ్రవరి 14 (శుక్రవారం) సెలవు :
తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే వుంటుంది... అందువల్లే వారి పండగలకు ప్రభుత్వం సెలవు ఇస్తుంది. రంజాన్ వంటి పెద్ద పండగలకు పూర్తిస్థాయిలో అన్నిస్కూళ్లకు హాలిడే వుంటుంది... ఇక కొన్ని ముస్లిం పర్వదినాలకు ఆప్షనల్ సెలవు ప్రకటిస్తారు. ఇలా ఫిబ్రవరి 14న కూడా షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది.
ఈరోజు ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వనున్నారు. అలాగే ముస్లిం విద్యార్థులు ఎక్కువగా వుండే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించే అవకాశం వుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలకు ఫిబ్రవరి 14న తప్పకుండా సెలవు వుండనుంది.
ఇక ముస్లిం ఉద్యోగులు కూడా ఫిబ్రవరి 14న సెలవు తీసుకునే అవకాశం వుంటుంది. ముఖ్యంగా మైనారిటీ శాఖ అధికారికంగా సెలవు ప్రకటించే అవకాశం వుంది...ఇక మిగతా శాఖల ఉద్యోగులు ఈ ఆప్షనల్ హాలిడేను వాడుకోవచ్చు. ముస్లిం యాజమాన్యల ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కూడా ఉద్యోగులకు షబ్-ఎ-బరాత్ సందర్భంగా సెలవు వుండవచ్చు.
ఈ ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే అంటే ప్రేమికులు దినోత్సవం. ఆరోజు ఆప్షనల్ హాలిడే వుండటం కాలేజీ యువతకు కలిసిరానుంది. ఎలాగూ హాలిడేనే కాబట్టి తమ మనసుకు నచ్చినవారితో హాయిగా బయటకు వెళ్లవచ్చు... ఇలా యువతీయువకులకు ప్రేమికుల రోజున సరదాగా గడిపే అవకాశం ఈ సెలవు ద్వారా వస్తుంది.
ఫిబ్రవరి 15 (శనివారం) సెలవు :
ఇక ఫిబ్రవరి 15న బంజారాలు ఆరాధ్యదైవంగా కొలిచే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి. తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే వున్నారు... వారంతా ఫిబ్రవరి 15న అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఇదే రేవంత్ సర్కార్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఇప్పుడు కూడా అలాగే సెలవు ఇవ్వాలనే డిమాండ్ బంజారా వర్గాల నుండి వస్తోంది.
విద్యాసంస్థలతో పాటు బంజారా ఉద్యోగులకు కూడా సెలవు ఇవ్వాలని తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. సేవాలాల్ జయంతిని ప్రతి బంజారా గ్రామం, తండాలో ఘనంగా జరుపుకుంటారు. ఆరోజు మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.. ఇందులో బంజారాలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఫిబ్రవరి 15న సెలవు ఇవ్వాలని బంజారా ఉద్యోగ సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ ప్రభుత్వాన్ని కోరారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సేవాలాల్ జయంతికి ఆప్షనల్ హాలిడే ప్రకటించే అవకాశం వుంది. గిరిజన విద్యార్థులు మరీముఖ్యంగా బంజారాలు ఎక్కువగా చదువుకునే విద్యాసంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం వుంది. అలాగే బంజారా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా ఆప్షనల్ హాలిడే వర్తించనుంది. అయితే ఈసారి సేవాలాల్ జయంతికి అంటే ఫిబ్రవరి 15న ఆప్షనల్ హాలిడేపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
ఫిబ్రవరి 16 సెలవు :
ఫిబ్రవరి 16న ఆదివారం కాబట్టి ఎలాగూ విద్యాసంస్థలకు, ఉద్యోగులకు సెలవు వుంటుంది. దీనికి మరో రెండు సెలవులు కలిసి వస్తున్నాయి. ఈ లాంగ్ వీకెండ్ ను మంచి హాలిడే ట్రిప్ గా మార్చుకోవచ్చు.
ఈ మూడురోజులు అందరికీ సెలవు వుండకపోవచ్చు...కానీ ఉన్నవారు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మరీముఖ్యంగా యువతీయువకలు ప్రేమికుల రోజున హాలిడే సందర్భంగా సరదాగా గడపవచ్చు. ఈ సెలవు వర్తించే ఉద్యోగులు కుటుంబంతో కలిసి మూడురోజులు సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఇక ఫిబ్రవరి 26, 27 న మరో రెండు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వుంది. కాబట్టి ఆరోజు కూడా సెలవు వుండనుంది. ఇలా ఈ నెలలో అనుకోకుండా వరుస సెలవులు వస్తునే వున్నాయి.