Rythu Bharosa
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కోటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్ తో పాటు రైతు రుణమాఫీ అమలు చేసారు. ఇక రైతు భరోసా అమలుకు కూడా ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ పథకం కోసం తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే దసరా కానుకగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని... పండగ రోజే అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ప్రచారం జోరుగా సాగుతోంది.
కానీ తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రైతు భరోసా ఆలస్యం అయ్యేలా వుందనేలా వ్యవసాయ మంత్రి కామెంట్స్ వున్నాయి. దీంతో రైతు భరోసా ఆశలు పెట్టుకున్న అన్నదాతలు నిరాశకు గురవుతున్నాయి.
Tummala Nageshwar Rao
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారంటే :
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో తెలంగాణ రుణ మాఫీ గురించి ప్రస్తావించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీని మరిచిపోయిందని... ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని అన్నారు. దీంతో ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రైతుల రుణాలను మాఫీ చేసామని... ఇప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అన్నారు. ప్రధాని మోదీకి ఇది కనిపించనట్లుంది.... అందువల్లే రుణమాఫీ జరగలేదని మాట్లాడారంటూ తుమ్మల ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రభుత్వం 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రధాని చెప్పినట్లు రైతులకు రుణమాఫీ జరగకుంటే ప్రభుత్వంపై అసంతృప్తి మొదలయ్యేది... కానీ ఎక్కడా అది కనిపించడంలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా నిత్యం ప్రజల్లోనే వుంటున్నారు... ఏ ఒక్కరికీ రైతుల నిరసన సెగ తాకలేదని అన్నారు. కానీ అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్, అధికారంకోసం తహతహలాడుతున్న బిజెపికి రైతులే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తుమ్మల రైతు భరోసాపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ప్రస్తుతం రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని... ఇది పూర్తికాగానే రైతు భరోసా ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి ఈ దసరాకు రైతు భరోసా వుండదనే అనుమానాలు మొదలయ్యాయి.
Rythu Bharosa
రైతు భరోసా అనుమానాలెన్నో :
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా ఒకటి. అప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ఏడాదికి ప్రతి ఎకరాలు రూ.10 వేల ఆర్థిక సాయం చేసేది... ఇలా రెండు విడతల్లో ఐదువేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించేంది. ఈ సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్.
గత ప్రభుత్వం మాదిరిగా వ్యవసాయేతర, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములు, కొండలు గుట్టలకు కాకుండా వ్యవసాయం చేసే రైతులకే పెట్టబడిసాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతు భరోసా విధివిధానాల రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ వ్యవసాయ నిపుణులు, రైతులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది.
ఇలా తీవ్ర కసరత్తు తర్వాత రైతు భరోసా విధివిధానాలను కేబినెట్ సబ్ కమిటీ రూపొందించినట్లు సమాచారం. కేవలం 10 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి... అదీ సాగులో వుంటేనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలనే ప్రతిపాదనను కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ముందు వుంచినట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయేతర భూములకు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు కూడా రైతు భరోసా వర్తించకుండా చూడాలని..కేవలం పెట్టుబడి సాయం అవసరం ఉన్న రైతులకే డబ్బులు ఇవ్వాలని ఈ మంత్రివర్గ ఉపసంఘం సూచించనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధివిధానాలను ఇప్పటికే రూపొందిచినా ప్రభుత్వ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ప్రభుత్వ ఇంకా రైతు భరోసా అమలుపై క్లారిటీ ఇవ్వడంలేదు. దసరాకు ఇంకా ఐదురోజుల సమయం మాత్రమే వుంది... కాబట్టి దీని అమలుపై అనుమానాలు మొదలయ్యాయి. దసరా తర్వాత రైతు భరోసా ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Rythu Bharosa
రైతు బంధు వర్సెస్ రైతు భరోసా :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో వుంది. ఈ సమయంలోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొదటిసారి రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేసే పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు అప్పుల ఊభిలో చిక్కుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇలా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తూ రైతు బంధు ప్రకటించారు. ఒక్కో విడతలో రూ.5 వేల చొప్పున రెండు విడతల్లో రూ.10 వేలను నేరుగా రైతుల ఖాతాలో వేసేవారు.
అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు సాయాన్ని పెంచుతామని ప్రకటించారు. రైతు భరోసా పేరిట ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ప్రతి విడతలో ఎకరాకు రూ.7500 చొప్పున రెండు విడతల్లో రూ.15 వేలను నేరుగా రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతు భరోసా అమలుకు సిద్దమయ్యింది. కానీ గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు సాయం కాకుండా కేవలం చిన్న సన్నకారు రైతులకే సాయం చేయనున్నట్లు చెబుతోంది.