ఈ ఒక్క కార్డు వుంటే చాలు ... మీరు ఏ ప్రభుత్వ పథకానికైనా అర్హులే : ఎలా పొందాలో తెలుసా?

First Published Oct 4, 2024, 6:02 PM IST

తెలంగాణ ప్రజలకు మరింత ఈజీగా సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇక అన్ని పథకాలు, ప్రభుత్వ సేవలకు ఉపయోగపడేలా ఓ కార్డును అందించాలని నిర్ణయించాారు. ఇంతకూ ఏమిటా కార్డు... ఎలా పొందాలో తెలుసుకుందాం. 

Family Digital Card

Family Digital Card : తెలంగాణ ప్రజలు ఇక ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేదా నివాస, ఆదాయ దృవపత్రాలు వంటివాటి అవసరమే లేకుండా కేవలం ఒక్క కార్డుతో సంక్షేమ పథకాలను పొందవచ్చు. ప్రభుత్వం అందించే ఏ సాయానికైనా,  ఏ సంక్షేమ పథకానికైనా ఈ కార్డే ఆదారం. ఇలా రేవంత్ సర్కార్ ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ పాలన అందించేందుకు తీసుకువస్తున్నదే ఫ్యామిలీ డిజటల్ కార్డ్. 

Family Digital Card

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగాలు : 

ఇంతకాలం రేషన్ కార్డు వుంటే ప్రభుత్వం బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించేది. ఆరోగ్య శ్రీ కార్డు వుంటే వైద్యంకోసం ప్రభుత్వం సాయం చేసేది. ఇక రైతు భీమా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి ప్రభుత్వ పథకాలు పొందాలంటే అనేక పత్రాలు అవసరమయ్యేవి. ఈ పద్దతిని మార్చి అటు ప్రజలు, ఇటు పాలకులకు సౌకర్యవంతంగా వుండే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తోంది. 

ప్రభుత్వం ఒక్కటే, కుటుంబమూ ఒక్కటే ... కానీ వేరువేరు శాఖలు వివిధ పథకాల కోసం సమాచారం సేకరించేవి. ఇప్పుడలా కాదు...  ప్రభుత్వం ఒకేసారి ఆ కుటుంబం వివరాలను సేకరిస్తుంది. అన్ని వివరాలతో కూడిన ఓ డిజిటల్ కార్డును కేటాయిస్తుంది. తద్వారా ఒక్క క్లిక్ తో ఆ కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం...లేదంటే ప్రతిసారి అధికారులు ప్రజలవద్దకు వెళ్లి వివరాలు సేకరించే బాధ తప్పుతుంది.  

ఈ ప్యామిలీ డిజిటల్ కార్డు వివరాలు అన్ని ప్రభుత్వ శాఖలకు అందుబాటులో వుంటాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అందించే దాదాపు 30 రకాల పథకాలు, సేవలకు ఈ డిజిటల్ కార్డు కీలకం కానుంది. ఇలా వన్ నేషన్ వన్ రేషన్ మాదిరిగానే 'వన్ స్టేట్ వన్ కార్డు' విధానాన్ని తీసుకువస్తోంది రేవంత్ ప్రభుత్వం.  

ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డే ఇక రేషన్, పెన్షన్, రైతు భరోసా, రైతు భీమా కార్డు... ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రియింబర్స్ మెంట్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళల ఉచిత ప్రయాణం , 500 రూపాయల సిలిండర్ల వంటి పథకాలకు ఇదే అర్హత. ఇప్పుడు సేకరించే సమాచారం ప్రతి ప్రభుత్వ శాఖకు అందుబాటులో వుంటుంది...తద్వారా ఏ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్నది ఈజీగా గుర్తించవచ్చు. 

ఇంట్లో పెళ్లయి కొత్త కోడలు వచ్చినా లేదా  అమ్మాయి మరో ఇంటికి వెళ్లినా ఆ వివరాలను వెంటనే కంప్యూటరైజ్ చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో నమోదు చేస్తారు.    అలాగే కుటుంబంలో పెద్దవాళ్లు చనిపోయినా ఆ వివరాలను ఫ్యామిలీ కార్డులో నమోదవుతాయి. కాబట్టి ఇప్పుడున్న రేషన్ కార్డులా ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వివరాలు సవరించుకోవాల్సిన అవసరం వుండదు.  

Latest Videos


Family Digital Card

ఇదే ఫ్యామిలి డిజిటల్ కార్డుతో వైద్యం : 

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డును అప్ డేట్ చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డుగా మారుస్తోంది. ఇదే కార్డును హెల్త్ కార్డుగా కూడా ఉపయోగించవచ్చు. అంటే ఈ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను కూడా పొందుపరుస్తారు. తద్వారా ఏదయినా చికిత్స కోసం హాస్పిటల్ కు వెళితే డాక్టర్లు ఆ డిజిటల్ కార్డు సాయంతో గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు? ఎలాంటి వైద్యం పొందారు? అనేది ఈజీగా తెలుస్తుంది. దీంతో ఎలాంటి వైద్యం అందించాలో వైద్యులకు ఈజీగా తెలిసిపోతుంది. 

చాలామంది ఏదయినా ఆరోగ్య సమస్య వచ్చినపుడు వైద్య పరీక్షలు చేసుకుంటారు. చాలా డబ్బులు ఖర్చుచేసి అవసరమైన టెస్టులు చేసుకుంటారు. కానీ ఆరోగ్యం కుదుటపడ్డాక ఆ టెస్ట్ రిపోర్ట్స్ తో పనిలేదని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒక్కోసారి వరదల వంటి ప్రమాదాల సమయంలో ఆ టెస్టు రిపోర్ట్స్ మిస్ అవుతుంటాయి. దీంతో మళ్లీ అనారోగ్యానికి గురయితే మరోసారి ఆ టెస్టులన్ని చేయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అవసరం లేకుండా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్ని ఈ కార్డులో పొందుపరుస్తారు. దీంతో వైద్య ఖర్చు చాలా తగ్గుతుంది. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ , సీఎం రిలీఫ్ పండ్ ద్వారా వైద్య సాయం పొందాలంటే ఈ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది చాలా దేశాలు ఉపయోగిస్తున్న హెల్త్ కార్డుల మాదిరిగా కూడా పనిచేస్తాయన్నమాట. 

Family Digital Card

ఫ్యామిలి డిజిటల్ కార్డుతో మరెన్నో సేవలు : 

చాలామంది నిరుపేదలు, కార్మిక కుటుంబాలు ఉపాధి కోసం స్వగ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళుతుంటారు. అలాగే చిన్నాచితక ఉద్యోగాలు చేసేవారు కూడా అద్దె ఇళ్లలో ఇంటూ తరచూ ఇళ్లు మారతుంటారు. అలాంటివారు రేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇళ్లు మారినప్పుడల్లా వారు ఇబ్బంది పడకుండా ఈ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈజీగా రేషన్ పొందవచ్చు.  

ఇక ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం పొందాలంటే చాలా పత్రాలు అవసరం అవుతాయి. ఇకపై వీటిని కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తారట. కాబట్టి అమ్మాయిల పేరెంట్ ఈజీగా ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. 

Family Digital Card

ఫ్యామిలి డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ : 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్డుకు సంబంధించిన వివరాలు తెలిపిన ఆయన రాష్ట్రంల్లోని 119 నియోజకవర్గాల్లో  ఈ సర్వేను ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాలు లేదా పట్టణాల్లోని వార్డులను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ప్రజల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు... ఇలా 239 ప్రాంతాల్లో సర్వే ప్రారంభమయ్యింది.

ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును కుటుంబంలోని మహిళల పేరిట కేటాయించనున్నారు. కుటుంబంలోని అందరి వివరాలను తెలుసుకుంటున్నారు... ఆ కుటుంబానికి ఇప్పటివరకు ఏఏ ప్రభుత్వ పథకాలు అందాయి... ఇంకా ఏ పథకానికైనా అర్హతలు కలిగివున్నారా అన్నది ఈ వివరాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అడిగి నిజానిజాలను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఈ సర్వే ఈ నెల ఏడో తేదీతో ముగుస్తుంది. 
 
మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఒక్క క్లిక్ తో సమస్త సమాచారం అందుబాటులో వుండేలా చూస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే కార్డులు తెలంగాణ కుటుంబాలకు సంపూర్ణ రక్షణ అందిస్తాయన్నారు. పేదలను ఆదుకునేందుకే ఈ విధానం తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 
 

click me!