నాలుగు ముక్కలుగా హైదరాబాద్? : అసలు రేవంత్ రెడ్డి ఏం చేద్దామనుకుంటున్నారు?

First Published | Oct 4, 2024, 11:07 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను నాలుగు ముక్కలుగా చేసి పాలించే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నట్లు అర్థమవుతోంది. ఇలా జిహెచ్ఎంసి విభజన వెనక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ దాగివుందని అంటున్నారు. అందేంటో తెలుసా?  

Revanth Reddy

Hyderabad : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఇప్పటికే రాజకీయాలు హీటెక్కాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు మూసీ నది ప్రక్షాళన రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వీటిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య మాటలయుద్దం సాగుతోంది. నగర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్కసీటు కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడించినందుకే ఈ హైడ్రా, మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపుకు దిగిందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో రాజకీయ దుమారానికి తెరలేపారు. 

Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే : 

హైదరాబాద్ లో ఇవాళ (శుక్రవారం) అసోచామ్ (The Associated Chambers of Commerce & Industry of India) ఆధ్వర్యంలో 'అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్పు' జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా మల్టీనేషనల్ కంపనీలు ఈ నగరంలోనే కొలువై వున్నాయని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ ప్రజలే కాదు దేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ ఆశ్రయం కల్పిస్తోందని... దీంతో నగర జనాభా 1.5 కోట్లకు చేరుకుందని అన్నారు. 

ఇలా హైదారాబాద్ అభివృద్దిలో దూసుకుపోతూ రోజురోజుకు మరింత విస్తరిస్తోందని మంత్రి అన్నారు. కాబట్టి నగరంలో పాలనను కూడా విస్తరించాల్సిన అవసరం వుందనేలా కోమటిరెడ్డి కామెంట్స్ చేసారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను విభజించే ఆలోచనలో వున్నట్లు మంత్రి తెలిపారు. జిహెచ్ఎంసిని నాలుగు కార్పోరేషన్లుగా విభజించి నలుగురు మేయర్లకు పాలనా బాధ్యతలు అప్పగించాలంటూ  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు.


GHMC

హైదరాబాద్ విభజన వెనక ప్లాన్ ఏంటి? 

హైదరాబాద్ నగరం రింగ్ రోడ్డును దాటి విస్తరిస్తోంది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నారు. ఐటీ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. గత పదేళ్లలో ఎవ్వరూ ఊహించని విధంగా నగర అభివృద్ది సాగింది. దీంతో బిఆర్ఎస్ పై హైదరాబాద్ ఓటర్లు బాగా నమ్మకం పెంచుకున్నారు... దాని ఫలితమే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ చతికిలపడ్డా హైదరాబాద్ లో మాత్రం బిఆర్ఎస్ ఆదిపత్యం కొనసాగింది. బిఆర్ఎస్ గెలుచుకున్న సీట్లలో అత్యధికం హైదరాబాద్ పరిధిలోనే వున్నాయి. 

ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను భయపెడుతోంది. మరో ఏడాదిలో అంటే 2026 జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులోనూ ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితమే పునరావృతం అవుతుందనే భయం కాంగ్రెస్ నాయకుల్లో వున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను విభజించి లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందేమోనని కోమటిరెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందనేది రాజకీయ విశ్లేషకుల అనుమానం. 

జిహెచ్ఎంసి విభజన అంశం పరిశీలనలో వుందని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అంటే ఇప్పటికే దీనిపై ప్రభుత్వ కసరత్తు ప్రారంభమైందన్న మాట. అంటే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను ముగించే నాలుగు కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించే ప్లాన్ లో ప్రభుత్వం వుందని అర్థమవుతుంది. ఇదే జరిగితే శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా వుంది కాబట్టి ఎక్కువ కార్పోరేషన్లు గెలుచుకునే అవకాశం వుంది. కాంగ్రెస్ ప్లాన్ కూడా ఇదే అయివుంటుంది. 

GHMC

హైదరాబాద్ లో ఏ పార్టీ బలమెంత... 

హైదరాబాద్ కాస్మో పాలిటిన్ సిటీ... ఎన్నో మతాలు, మరెన్నో ప్రాంతాలు, ఇంకెన్నో బాషల ప్రజలు నివాసం వుంటున్నారు. కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ ప్రభావం ఇక్కడ వుంటుంది. అయితే తెలంగాణ రాజకీయాలు ప్రభావం కాస్త ఎక్కువగా వుంటుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 

దేశంలో ప్రస్తుతం బిజెపి హవా సాగుతోంది... మరీ ముఖ్యంగా ఉత్తరాదిన ఈ పార్టీ బలంగా వుంది. కాబట్టి హైదరాబాద్ లో నివాసముండే ఉత్తరాది ప్రజలు బిజెపికి మద్దతుగా నిలుస్తున్నారు. ఉత్తరాది వ్యాపారులు ఎక్కువగా వుండే గోషామహల్, కార్మికులు ఎక్కువగా వుండే మల్కాజ్ గిరి వంటి ప్రాంతాల్లో బిజెపి విజయాలే ఇందుకు ఉదాహరణ. సహజంగానే అర్బన్ ఓటర్లు బిజెపి వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు... ఇది కూడా హైదరాబాద్ లో బిజెపి బలంగా వుండటానికి మరో కారణం. 

ఇక గత పదేళ్ల నగర అభివృద్ది హైదరాబాద్ ప్రజలను బిఆర్ఎస్ పార్టీకి దగ్గర చేసింది. ఆ పార్టీతోనే నగర అభివృద్ది సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం కూడా గత అసెంబ్లీ ఎన్నికల పలితాలను బట్టి అర్థమవుతోంది. 

చివరకు ఎంఐఎం పార్టీ పాతబస్తీతో పాటు ముస్లింలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో బలంగా వుంది. ఆ పార్టీని కాదని మరో పార్టీకి ముస్లిం ఓటర్లు షిప్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి హైదరాబాద్ లో ఎంఐఎం కూడా బలమైన పార్టీయే. 

ఇలా హైదరాబాద్ లో అన్ని పార్టీలు చాలా బలంగా కనిపిస్తున్నాయి... ఒక్క కాంగ్రెస్ తప్పు. గత జిహెచ్ఎంసి, ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలించినా కాంగ్రెస్ కు హైదరాబాద్ లో బలం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లే నగరంలో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుని బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

cm revanth reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలు సీఎం రేవంత్ రెడ్డివేనా? 

హైదరాబాద్ లో పార్టీ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నయా రాజకీయాలను ప్రారంభించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందువల్లే ఇలా విభజించి పాలించు రాజకీయాలు చేస్తుందేమో అంటున్నారు. హైదరాబాద్ ను నాలుగు కార్పోరేషన్లుగా విభజించి తద్వారా పార్టీ బలాన్ని పెంచుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.  

అయితే జిహెచ్ఎంసి విభజన మాటలు మంత్రి కోమటిరెడ్డివే అయినా ఈ ఆలోచన  మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే అయివుంటుంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వంలో చర్చ కూడా జరిగివుంటుంది. దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా దీన్ని బయటపెట్టి వుంటారని  రాజకీయ నిపుణులు అభిప్రాయం. 

ఏదేమయినా హైదరాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు వెళుతోందనేది స్పష్టంగా అర్థమవుతోంది. నగర ప్రజల మెప్పుకోసమే హైడ్రా అయినా, మూసీ ప్రక్షాళన అయినా, ఇప్పుడు జిహెచ్ఎంసి విభజన అయినా. జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను హైదరాబాద్ లో తిరుగులేని శక్తిగా నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 
 

Latest Videos

click me!