హిమాన్షుపై రేవంత్ రెడ్డి కామెంట్స్.. ఆయన సూచన పాటిస్తాం అంటూ హామీ...

First Published | Jul 14, 2023, 10:31 AM IST

హిమాన్షు చేసిన సూచనను తప్పకుండా తీసుకుంటామని.. మరోసారి కేసీఆర్ అధికారంలోకి రాకుండా చూసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. 

హైదరాబాద్ : తెలంగాణలోని పాఠశాలల పరిస్థితి మీద హిమాన్షు చేసిన వ్యాఖ్యలను టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. హిమాన్షు బాగా చెప్పారని ప్రశంసించారు. కాంగ్రెస్ తప్పకుండా హిమాన్షు సూచనను తీసుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి. కేసిఆర్,  కేటీఆర్ లను మరోసారి అధికారంలోకి రాకుండా చూసుకుంటామంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమాగా  చెప్పుకొచ్చారు.  

తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి మీద హిమాన్షు చెప్పిన దాన్ని కాంగ్రెస్ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ స్కూల్లో కనీస సౌకర్యాలు మెరుగుపడలేదని..ఈ విషయాన్ని హిమాన్షు  బయటపెట్టారని.. సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. హిమాన్షు చేసిన వ్యాఖ్యలు  తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నకేసీఆర్ పరువును గోదాట్లో కలిపేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంది. ఈ సమయంలో హిమాన్షు ఇలా మాట్లాడడం తాతకు, తండ్రికి నెగటివ్ అవుతుందని విమర్శకులు అంటున్నారు. చాలా ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని, ఆడపిల్లలు టాయిలెట్లకు వెళ్లాలన్నా జంకుతున్నారని… ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ మనవడు స్కూల్ ప్రారంభం చేయడం…తన మాటల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్కు లాభం చేకూర్చేలా ఉందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ హిమాన్షు ఏం చేశాడంటే...

ఇటీవల హిమాన్షు గౌలిదొడ్డిలోని కేశవ నగర్ ప్రభుత్వ పాఠశాలకు సుమారు కోటి రూపాయలు ఖర్చుపెట్టాడు. ఆ స్కూల్ కి మరమ్మత్తులు చేయించి ప్రశంసలు అందుకున్నాడు. దీనికోసం తనతోపాటు స్కూల్లో చదువుకుంటున్న మిత్రుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలతోనే స్కూలును బాగు చేయించారు. ప్రారంభోత్సవం చేశారు. 

దీనిమీద అందరూ ప్రశంసలు కురిపించినప్పటికీ.. ఈ సందర్భంగా హిమాన్షు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. ఓవైపు హిమాన్షు అద్భుతంగా మాట్లాడాడు అంటూ, తాత తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడు అంటూ పొగడ్తలు వస్తుండగా.. మరోవైపు అతని ప్రసంగం బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసేలా ఉంది అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతిపక్షాలు హిమాన్షు ప్రసంగాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. 

ఆయన  ఏం మాట్లాడారంటే…
‘ఈ స్కూల్ ను నేను మొదటిసారిగా చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆడపిల్లలు వెళ్లడానికి సరైన బాత్రూంలో కూడా లేవు.  స్కూల్లో పిల్లలతో పాటు పందులు కూడా తిరుగుతున్నాయి. పైన తరగతి గదులకు వెళ్లడానికి మెట్లు కూడా సరిగా లేవు.  అది చూసి నేను తట్టుకోలేక పోయాను. నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదు. అందుకే ఏదైనా చేయాలనుకున్నాను. అయితే ఏది చేసినా చిన్నగా చేసే అలవాటు ఎప్పుడూ లేదు. చేస్తే గొప్పగా చేయాలన్నదే నా ఆలోచన. 

అందుకే నా స్కూలు మిత్రులతో కలిసి నిధులు సేకరించాను. వాళ్లకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నాను, ఈ స్కూలుకు మంచి చేయడానికి మా తాత కేసిఆర్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. నేను తలపెట్టిన పనికి నా కుటుంబం, స్నేహితులు ఎంతో సహకరించారు.  వారి వల్లే ఇది సాధ్యమైంది’ అని మాట్లాడారు. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది. కానీ.. ఆయన మాట్లాడే దాంట్లో అంతర్లీనంగా తెలంగాణలోని స్కూల్లో పరిస్థితిని చెబుతున్నాయంటూ మరికొందరు విమర్శలు, తిట్ల వర్షం కురిపిస్తున్నారు, బంగారు తెలంగాణ అంటూ తాత ఊదరగొడుతుంటే.. స్కూల్లో పరిస్థితి ఇంత అద్వాన్నంగా ఉందంటూ మనవడు బయటపెట్టాడంటూ మరికొందరు మండిపడుతున్నారు. 
 

Latest Videos

click me!