కుతుబ్ షాహీ సమాధులు :
హైదరబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ వంశీయులు సమాధులు ఇప్పుడు సందర్శనీయ ప్రదేశాలుగా మారాయి. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ఈ సమాధులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. 16వ శతాబ్దానికి చెందిన చారిత్రక సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి.
హైదరాబాద్ ను పాలించిన కుతుబ్ షాహీ సుల్తానుల సమాధులన్ని ఇలా ఒకేచోట వున్నాయి. కుతుబ్ షాహీలు సమాధులను ఎంతో పవిత్రమైనవిగా భావించేవారట...అందువల్లే అత్యంత సుందరంగా వారి పూర్వికుల సమాధులను తీర్చిదిద్దారు. ఇలా ప్రతిఒక్కరు తమకంటే ముందు పాలించిన సుల్తానుల సమాధులను నిర్మించి పరిరక్షించారు. అందువల్లే ఇప్పటికీ ఈ సమాధులు చెక్కుచెదరకుండా నిలిచాయి.
ఈ సమాధులు గోల్కొండ కోటకు ఉత్తరాన కిలోమీటర్ దూరంలో ఇబ్రహీ బాగ్ లో వున్నాయి. ఒకప్పుడు ఈ సమాధులపై ఖరీదైన కార్పెట్లు,వెల్వెట్ తెరలు, షాండ్లియర్లు, వెండి అలంకరణ సామాగ్రి వుండేవి. అలాగే అందమైన పూదోటలు వుండేవి. కాలక్రమేనా ఇవన్నీ కనుమరుగయ్యాయి. కానీ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సమాధులను హైదరాబాదీలు,తెలుగు ప్రజలే కాదు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు.