తెలంగాణలో నీలివిప్లవం... మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత కేసీఆర్‌ దే: మంత్రి హరీష్

First Published Sep 8, 2021, 2:35 PM IST

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడిచిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాయశయాలు,  చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇదే సరయిన సమయంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడిచిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌ దే అని అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు నింపారని అన్నారు. 

''ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది  సిద్దిపేట జిల్లాలో రూ.4 కోట్ల 87 లక్షల రూపాయలతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నాం'' అని తెలిపారు. 
 

''సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుంది. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా , ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోంది. తెలంగాణలో ఎక్కడ చూసినా ధాన్యపుసిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుంది. మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయం తో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుంది'' అన్నారు. 

''చేపలంటే కోస్తా ప్రాంతం దిగుమతి చేసుకుంటారు అనే భావన ఉండేది. సీఎం ప్రత్యేక చొరవతో ఏడేళ్లకు ముందు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం'' అన్నారు.
 

''గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉంది.  ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలి. మత్స్యకారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండగ వాతావరణంలో ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల చేయాలి'' అని సూచించారు. 

''చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలి. జలవనరులలో క్వాలిటీ చేప పిల్లలను అధికారులు విడుదల చేయాలి. కౌంటింగ్ లో రాజీ పడొద్దు. విడుదల ప్రక్రియ అద్యంతం వీడియోగ్రఫి చేయాలి'' అని మంత్రి ఆదేశించారు. 

''మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు'' అని మంత్రి హరీష్ పేర్కొన్నారు. 

మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

click me!