LPG: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఈ కేవైసీ ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అక్రమ కనెక్షన్లను గుర్తించడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోంది.
ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆధార్ లింక్ చేసి, నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేస్తోంది. గత ఏడాది నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ ఇంకా అనేక మంది వినియోగదారులు పూర్తి చేయలేదు. దీంతో జూన్ 30ను తుది గడువుగా నిర్ణయించారు.
25
ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?
వినియోగదారులు మూడు విధాలుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక యాప్‌లలో స్వయంగా ఈ-కేవైసీ చేయవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది సహాయంతో పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. అవసరమైతే నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవచ్చు.
35
ముఖ గుర్తింపు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్
ఈ-కేవైసీ కోసం ఆధార్ ధృవీకరణను అత్యాధునిక విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ గుర్తింపు (Face Authentication), వేలిముద్రలు (Fingerprint), ఐరిస్ స్కాన్ (Iris Scan) ద్వారా వినియోగదారుల వివరాలను నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్యాస్ కనెక్షన్ వివరాలు అధికారికంగా అప్‌డేట్ అవుతాయి.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందిన కుటుంబాలకు ఈ-కేవైసీ మరింత కీలకంగా మారింది. ఈ పథకం లబ్ధిదారులు ప్రతి ఏడాది తప్పనిసరిగా తమ వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అర్హులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఈ విధానం అమలు చేస్తున్నారు.
55
ఈ-కేవైసీ చేయకపోయినా బుకింగ్ ఆపొద్దు
కొన్ని ప్రాంతాల్లో ఈ-కేవైసీ పూర్తికాలేదనే కారణంతో సిలిండర్ బుకింగ్‌లను నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనిపై పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారుల సిలిండర్ బుకింగ్‌లను తిరస్కరించరాదని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించి, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించింది.