రేవంత్ రెడ్డి సీఎం పదవికే ఎసరు ...ఈ ఐదు అంశాలే కారణమా? : మరి నెక్ట్స్ సీఎం ఎవరు?

First Published | Nov 2, 2024, 11:21 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి దూరం కానున్నాడంటూ బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇంతకీ సీఎం మార్పుపై వచ్చిన సంకేతాలేమిటి? రేవంత్ ను తప్పిస్తే నెక్ట్స్ సీఎం ఎవరు? 

Anumula Revanth Reddy

హైదరాబాద్ : తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? రేవంత్ రెడ్డికి పదవీ గండం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. త్వరలోనే తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ పొలిటికల్ బాంబు పేల్చారు బిజెఎల్పి నేత. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి... నిజంగానే రేవంత్ రెడ్డి సీఎం పదవిని కోల్పోనున్నారా? లేక రాజకీయాల కోసమే మహేశ్వర్ రెడ్డి ఇలా మాట్లాడారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది. 

అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కోల్పోతాడని నోటికొచ్చినట్లు చెప్పడంలేదని...అందుకు తగిన సంకేతాలు వస్తున్నాయనే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆ సంకేతాలేమిటో కూడా ఆయన వివరించారు. వీటిని చూస్తే నిజంగానే రేవంత్ రెడ్డి పదవికి గండం వుందేమో అనుమానం అందరికీ కలుగుతోంది. మహేశ్వర్ రెడ్డి కొత్త సీఎం కామెంట్స్ ను పరిశీలిద్దాం. 
 

Revanth Reddy

రేవంత్ ను రాహుల్ ఎందుకు కలవడం లేదు?   

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో వున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే రాహుల్ ను కలిసేందుకు రేవంత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్ మెంట్ మాత్రం లభించచడంలేదని ... ఇటీవల ఏడుసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్ ను కలవకుండానే తిరిగివచ్చారని తెలిపారు. దీన్నిబట్టి రేవంత్ ను రాహుల్ దూరం పెట్టారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

ఇక రాహుల్ కలవకపోతేనేం... ఆయన సోదరి ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకోడానికి రేవంత్ ప్రయత్నించాడని బిజెఎల్పి నేత పేర్కొన్నారు. ప్రస్తుతం వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రియాంకను కలిసేందుకు రేవంత్ ప్రయత్నించాడని తెలిపారు. ఇందుకోసం రేవంత్ వయనాడ్ వెళ్లినా ప్రియాంక కూడా కలవలేదట. ఇలా  గాంధీ ఫ్యామిలీ నమ్మకాన్ని రేవంత్ కోల్పోయాడని ... ఇది ఆయన సీఎం పదవి కోల్పోతాడని అనడానికి సంకేతంగా మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. 
 


Telangana Congress

కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ :   

కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది గ్రూప్ పాలిటిక్స్. ఆ పార్టీలో వ్యక్తిగత స్వాతంత్రం చాలా ఎక్కువ... ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి వుంది. కాంగ్రెస్ లో ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువ కాదు... అదిష్టానం ఆశిస్సులుంటే ఎవరు ఏ పదవైనా పొందవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తరచూ ముఖ్యమంత్రులు మారడం తరచూ చూస్తుంటాం. 

ఇదే ఇప్పుడు తెలంగాణలోనూ జరగబోతోందని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికే రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చాలా గ్రూపులు వున్నాయి... వారంతా అవకాశం కోసం ఇంతకాలం ఎదురుచూసారని అన్నారు. ఇటీవల రేవంత్ నిర్ణయాలు, వ్యవహారతీరుతో ఇదే సరైన సమయంగా భావించిన ఈ గ్రూప్స్ అదిష్టానం వద్దకు పంచాయితీకి వెళ్లారు. సీఎం ఏకపక్ష ధోరణిపైనే కాదు ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ సహచర మంత్రుల ఆద్వర్యంలోనే ఈ గ్రూప్ పాలిటిక్స్ సాగుతున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

గత పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తమను సీఎం రేవంత్ పక్కనబెట్టడంతో కొందరు నేతలు గుర్రుగా వున్నారు. వారంతా ముఖ్యమంత్రి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ... పార్టీ కోసం కష్టపడ్డ తమకు ఏమీ దొరక్కుండా చేస్తున్నాడని ఇప్పటికే అదిష్టానానికి ఫిర్యాదు చేసారట. ఇప్పటికే రేవంత్ తీరుపై అసంతృప్తిగా వున్న అదిష్టానం ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చిందని బిజెపి నేత అంటున్నారు. 
 

Hyderabad

హైడ్రా, మూసీ ప్రక్షాళన కూడా రేవంత్ ను ముంచాయా? 

హైడ్రా ... హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సంస్థ. ఆరంభంలో ప్రజల్లోనే కాదు పార్టీలోనూ హైడ్రా చర్యలపై ప్రశంసలు దక్కాయి. కానీ రానురాను ఈ హైడ్రా కేవలం పేదలనే టార్గెట్ చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది... దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి.  రేవంత్ సెల్ప్ ఎజెండాలో భాగమే హైడ్రా అని... దీని పేరు చెప్పుకుని ఆయన వర్గం రియల్టర్లు, బిల్డర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. 

ఇలా హైడ్రా తీరువల్ల కాంగ్రెస్ పై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కొందరు కాంగ్రెస్ నాయకులు అదిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. అలాగే హైడ్రాను అడ్డు పెట్టుకుని సీఎం వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులు చేస్తున్నారట.  

ఇక మూసీ ప్రక్షాళన విషయంలోనూ రేవంత్ ఒంటెద్దు పోకడలు ఆయన కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నచ్చడం లేదట. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో పేదలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే భావన ప్రజల్లో ఏర్పడింది...  ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలను ఖాళీ చేయించడం మరింత డ్యామేజ్ చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం బయటకు చెప్పకపోయినా అదిష్టానం వద్ద నోరు విప్పుతున్నారట. ఇలా రేవంత్ పై ఫిర్యాదులు అందుతుండటంతో అదిష్టానం కూడా ఆలోచనలో పడిందనేది మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ సారాంశం. 

అసలు ఎన్నికల హామీలను పక్కనబెట్టి రేవంత్ హైడ్రా, మూసీ ప్రక్షాళన వెనక ఎందుకు పడ్డాడు? దీనివల్ల పార్టీకి ఏమైనా లాభం వుందా? లేదంటే రేవంత్ స్వలాభం చూసుకుంటున్నారా? అనే అనుమానాలు కాంగ్రెస్ అదిష్టానానికి కలిగాయట. ఆలోచిస్తే రేవంత్ చర్యలు ఆయనకే లాభం చేసేలా, పార్టీకి నష్టం చేసేలా వున్నాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నార. దీంతో ఇక ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావిస్తున్న అదిష్టానం వెంటనే రేవంత్ ను తప్పించేందుకు సిద్దమైనట్లు బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. 

Komatireddy Rajagopal Reddy

కోమటిరెడ్డి కామెంట్స్ కూడా :  

కోమట్టిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ రాజకీయాలపై మంచి పట్టుంది. అందువల్లే కోమట్టిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుదక్కగా...గతంలో పార్టీని వీడి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగా పార్టీలోకి రాగానే ఎమ్మెల్యే సీటిచ్చారు. దీన్నిబట్టే కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ లో ఎంత పలుకుబడి వుందో అర్థమవుతుంది. 

ఇలా కాంగ్రెస్ లో కీలక నేతగా వున్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల తెలంగాణ సీఎం పదవిపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేసారు. అంటే అదిష్టానం నుండి సీఎం మార్పుపై ఆయనకు ఏవయినా సంకేతాలు అందివుంటాయి...అందువల్లే ఇలా కామెంట్స్ చేసారని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఇలా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డిని సీఎం పదవినుండి తొలగించే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 

మంత్రివర్గ విస్తరణ ఆలస్యం : 

 ఎప్పటినుండో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకు పలుమార్లు డిల్లీకి వెళ్లిన సీఎం అదిష్టానంతో చర్చించారు. దసరా తర్వాత,దీపావళి తర్వాత అంటున్నా ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ జరిగింది లేదు. అధిష్టానం కావాలనే మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ఆలస్యం వెనక సీఎంను మార్చే ఆలోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. 

ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే రేవంత్ తన వర్గానికి పెద్దపీట వేస్తారు...తద్వారా కాంగ్రెస్ వర్గాల్లో అలజడి మొదలవడం ఖాయం. అందువల్లే అదిష్టానం కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే రేవంత్ మీద గుర్రుగా వున్న కాంగ్రెస్ సీనియర్లు కేబినెట్ విస్తరణలో అన్యాయం జరిగితే ఊరికే వుండరు... కాబట్టి కాస్త ఆలస్యమైనా పరవాలేదు కానీ పార్టీకి నష్టం జరగకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే వెంటనే కాకున్నా కొంత ఆలస్యమైన రేవంత్ కు, ఆయన వర్గానికి షాక్ తప్పదని అర్థమవుతోందని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. 

Revanth Reddy

రేవంత్ ను తప్పిస్తే నెక్ట్స్ సీఎం ఎవరు? 

రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పిస్తే నెక్ట్స్ సీఎం ఎవరు? ఈ ప్రశ్నకు రెండుమూడు పేర్లు సమాధానంగా వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవికోసం రేవంత్ తో పోటీపడ్డ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు ఎక్కువ అవకాశాలుంటాయి. వారిలో ఎవరో ఒకరికి సీఎం పదవి దక్కవచ్చు. అయితే సీనియర్లలో ఎవరికి సీఎం పదవి ఇచ్చినా పెద్దగా వ్యతిరేకత వుండకపోవచ్చు. 

కాంగ్రెస్ లో అప్పుడప్పుడు అనూహ్య నిర్ణయాలుంటాయి. గతంలో ఎవరూ ఊహించని కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంతి అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు వున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి చెప్పిందే నిజమై రేవంత్ సీఎం పదవిని కోల్పోయినా నెక్ట్స్ సీఎం ఎవరనేది ఖచ్చితంగా చెప్పలేం. 

Latest Videos

click me!