ఈ ఆడబిడ్డది అదృష్టమే... ఆర్టిసి బస్సులో పుడితే ఇంతటి బంపరాఫర్ వుంటుందా..?

First Published | Aug 20, 2024, 11:50 PM IST

ఆర్టిసి బస్సులో పుట్టిన బిడ్డకు తెలంగాణ ఆర్టిసి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ బిడ్డకు జీవితాంతం గుర్తిండిపోయే బహుమతి ఇచ్చారు ఆర్టిసి ఎండి సజ్జనార్.  

TSRTC

నడి రోడ్డుపై ఆగిన ఆర్టిసి బస్సులో నిండు గర్భిణి పురిటినొప్పులు మొదలయ్యాయి... దగ్గర్లో ఎలాంటి హాస్పిటల్స్ అందుబాటులో లేవు. కానీ ఆ తల్లీబిడ్డను కాపాడేందుకేనేమో ఆ దేవుడు ఆ బస్సులో మహిళా కండక్టర్ కు డ్యూటీ వేసాడు... ఓ నర్సును ప్రయాణించేలా చేసాడు. వీరిద్దరి సాయంతో ఎలాంటి వైద్య సదుపాయం అందుబాటులో లేకున్నా ఆ బస్సులోని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఆర్టిసి బస్సులో పుట్టిన ఆ ఆడబిడ్డ అద్భుతమైన  ఆఫర్ కొట్టేసింది. 
 

TSRTC

వివరాల్లోకి వెళితే... గద్వాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు నిన్న (సోమవారం) వనపర్తి రూట్ లో వెళుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు సంధ్య అనే నిండు గర్భిణి వనపర్తి వెళుతోంది. అయితే బస్సులో వుండగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేకపోవడంతో ఆ బస్సును రోడ్డుపక్కన నిలిపి అందులోని కాన్పు చేసారు. 


TSRTC

ఆ బస్సు కండక్టర్ భారతి, ప్రయాణికుల్లో  ఒకరైన నర్సు అలివేలు మంగమ్మ కలిసి సంధ్యకు కాన్పు చేసారు. ఇలా బస్సులోని సంధ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా సమయస్పూర్తితో వ్యవహరించి రెండు ప్రాణాలను కాపాడిన కండక్టర్, నర్సును ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు. 

ఇలా ఆర్టిసి బస్సులో మహిళ పండంటి బిడ్డనుకన్న విషయం సోషల్ మీడియా ద్వారా ఆర్టిసి ఎండి సజ్జనార్ వరకు చేరింది. దీంతో ఆయన ఆ బిడ్డతో కండక్టర్ భారతి, నర్సు అలివేలుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బస్సులో పుట్టిన ఆ ఆడబిడ్డకు జీవితాంతం ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కండక్టర్, నర్సు కూడా ఓ సంవత్సరంపాటు తెలంగాణకు చెందిన డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన బస్ పాసులను భారతి, అలివేలుకు అందించారు ఆర్టిసి ఎండీ. 
 

TSRTC

ఆర్టిసి బస్సుతో పాటు బస్టాండుల్లో జన్మించే ఏ పిల్లలకైనా జీవితకాలపు ఉచిత బస్ పాస్ అందించాలని ఆర్టిసి సంస్థ నిర్ణయించినట్లు సజ్జనార్ గుర్తుచేసారు. కాబట్టి గద్వాల బస్సులో పుట్టిన బిడ్డకు ఈ అరుదైన అవకాశం కల్పించినట్లు తెలిపారు.  అలాగే సమయస్పూర్తితో వ్యవహరించిన తమ సిబ్బందికి సంస్థ తరపున బహుమతి అందించినట్లు తెలిపారు.  

TSRTC

ఇవాళ బస్సు డ్రైవర్ అంజి, కండక్టర్ భారతితో పాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ కు పిలిపించుకుని సన్మానించారు సజ్జనార్. బస్ భవన్ లో టీఎస్ ఆర్టిసి ఉన్నతాధికారుల మధ్య ఈ సన్మానం చేపట్టారు. ఆర్టిసి డ్రైవర్, కండక్టర్ కు నగదు బహుమతి అందించిన ఎండీ... పాప, నర్సుకు చెందిన ఉచిత ప్రయాణ పాసులను గద్వాల ఆర్టిసి డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందించారు.
 

Latest Videos

click me!