
భారతదేశ హైస్పీడ్ రైలు మ్యాప్‌లో శంషాబాద్ పేరు కీలకంగా మారబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే నగరాలను కలిపే బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్‌ను అభివృద్ధి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికతో ఈ ప్రాంత భవితవ్యం పూర్తిగా మారనుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో గుర్తింపు పొందిన శంషాబాద్ ఇప్పుడు దేశంలోనే తొలి బుల్లెట్ రైలు కేంద్రంగా మారే దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ప్రభావం రవాణాకే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లనుంది.
ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే దిశగా హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు నడవనున్నాయి. ఈ కారిడార్ల ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు 2 గంటలు, చెన్నైకి దాదాపు 2 గంటలు, పుణేకు గంటన్నరలో చేరే అవకాశం ఉంటుంది. పుణే నుంచి ముంబైకి కూడా మరో గంటలో ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ స్థాయి కనెక్టివిటీ శంషాబాద్‌ను దక్షిణ భారతదేశ రవాణా గుండెగా మార్చనుంది. ఐటీ ఉద్యోగులు, బిజినెస్ ట్రావెలర్లు, ఇండస్ట్రీ లీడర్లు రోజువారీ ప్రయాణాలకే బుల్లెట్ రైళ్లను ఉపయోగించే పరిస్థితి వస్తుంది. దీని వల్ల శంషాబాద్ చుట్టుపక్కల నివాస అవసరాలు భారీగా పెరగడం ఖాయం.
శంషాబాద్‌లో ప్రతిపాదిత త్రీ-వే బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ నిర్మాణం ఈ ప్రాంతాన్ని మెగా కమర్షియల్ జోన్‌గా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే ప్రాంతం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి ప్రధాన నగరాలకు నేరుగా బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉండటం దేశంలో ఇదే మొదటిసారి. ఈ టెర్మినల్ పరిసరాల్లో ఐటీ పార్కులు, కార్పొరేట్ ఆఫీసులు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు వేగంగా ఏర్పడతాయి. ఎయిర్‌పోర్ట్ తో పాటు బుల్లెట్ ట్రైన్ కలయికతో శంషాబాద్ అంతర్జాతీయ బిజినెస్ గేట్‌వేలా రూపాంతరం చెందుతుంది. దీని ప్రభావంతో కమర్షియల్ ల్యాండ్ ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
బుల్లెట్ ట్రైన్ హబ్ ప్రభావం మొదట కనిపించేది నివాస రంగంలోనే. ప్రస్తుతం శంషాబాద్, మమిడిపల్లి, ఆదిభట్ల, కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులపై డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కనెక్టివీ పెరగడంతో శంషాబాద్ చుట్టూ నివాసం కోరేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో భూమి ధరలు రెట్టింపు కావడం అనివార్యం అవుతుంది. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో శంషాబాద్ ప్రాంతం హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ జోన్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బుల్లెట్ ట్రైన్ మార్గాలను పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల భూసేకరణ సమస్యలు తగ్గడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరోవైపు ఈ ఎలివేటెడ్ ట్రాక్‌ల కింద ప్రాంతాలు భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారతాయి. హైస్పీడ్ రైలు ట్రాక్‌లకు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఆటోమేటిక్‌గా ప్రైమ్ లొకేషన్లుగా మారతాయి. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి అవుతాయి. ఈ మౌలిక వసతుల అప్‌గ్రేడ్ వల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు శంషాబాద్ ఒక సేఫ్ బెట్‌గా మారుతోంది.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2027-2028 నాటికి పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు అమలుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు పెట్టుబడి పెట్టిన వారికి అత్యధిక లాభాలు వచ్చే అవకాశం ఉందన్నది రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా. ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్ హబ్ అన్నీ ఒకే ప్రాంతంలో ఉండటం దేశంలో మరెక్కడా లేదు. అందుకే శంషాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ గోల్డ్‌మైన్‌గా మారుతుందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.