Huzurabad Bypoll: స్పీడ్ పెంచిన టీఆర్ఎస్... ఇంటింటి ప్రచారానికి మంత్రి కొప్పుల శ్రీకారం

First Published Sep 15, 2021, 4:01 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో ఎన్నికలు లేవని తెలిసినా ప్రచారాన్ని మాత్రం ఆపడంలేదు. తాజాగా జమ్మికుంటలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు మంత్రి కొప్పుల. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు భారీ బహిరంగసభలు, కుల సంఘాలో మీటింగ్ లు, బైక్ ర్యాలీలతో హోరెత్తించిన టీఆర్ఎస్ తాజాగా ఇంటింటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణం 16, 26, 29 వార్డుల్లో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఉపఎన్నికలో టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎమ్మెల్యే చేయాలని మంత్రి కోరారు. 

ఈ ఇంటింటికి (గడపగడప)కు బొట్టు కార్యక్రమంలో మంత్రి కొప్పుల వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు టంగుటూరి రాజ్ కుమార్, తుమ్మేటి సమ్మిరెడ్డి, పొనగంటి మల్లయ్య, ముద్దసాని కశ్యప్ రెడ్డి, కౌన్సిలర్లు,  స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆత్మీయంగా పకలరించారు మంత్రి. ఇంట్లోని మహిళలకు టీఆర్ఎస్ మహిళా నాయకులు బొట్టు పెట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెల్లు శ్రీనివాస్ ను ఆశీర్వదించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓటేయాలని మంత్రి సూచించారు. 
 

ఇంటింటి ప్రచారానికి ముందు మంత్రి కొప్పుల జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొప్పుల అన్నారు. 
 

ఈ కార్యక్రమంతో ఆర్థిక మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

click me!