Huzurabad Bypoll:ఎవ్వరూ తప్పించుకోలేరు... తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటల వార్నింగ్

First Published Sep 14, 2021, 4:37 PM IST

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలంలో జరిగిన బిజేపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

హుజురాబాద్: ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అని అన్నారు మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్. మన స్వాతంత్ర్య దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుకోని ఏకైక ప్రాంతం మనదేనని గతంలో తాను అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా మాట్లాడానని ఈటల గుర్తుచేశారు. అయితే ఆనాడు ఈ విషయంలో కేసీఆర్ కూడా గళమెత్తారని... ఇప్పుడు ఎందుకు నోరుమూసుకున్నాడో తెలంగాణ జాతి ఆలోచించాలని ఈటల సూచించారు. 

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలంలో జరిగిన బిజేపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటల పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి తీరతామని స్పష్టం చేశారు.

''పదవుల కోసం పెదవుల మూసే దద్దమ్మల్లారా... అని ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏం ఆశించి, ఎవరికి భయపడి మన స్వాతంత్ర్య దినం జరపడం లేదు? ఆనాడు నైజాం నుంచి విముక్తి సాధించిన హైదరాబాద్ లో భాగాలుగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో విలీనమైన ప్రాంతాల్లో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నాయి. మనం మాత్రం జరపుకోకపోవడం అవమానకరం, బాధాకరం. మనకు విముక్తి కల్పించిన ఆ రోజును మనం గుర్తు చేసుకోవాల్సిందే'' అని ఈటల స్ఫష్టం చేశారు. 

''గత ప్రభుత్వాలు జరపకపోయినా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసేది. తెలంగాణ భవన్ మీద నాయిని నరసింహ రెడ్డి జెండా ఎగురవేసేవారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తరపున మనం కూడా వాడవాడనా సెప్టెంబరు 17న విముక్తి వేడుకలు నిర్వహించాలి'' అని ఈటల పిలుపునిచ్చారు. 

''మంతరిచ్చి, మాయ చేసే సంస్కృతి మనది కాదు. కేవలం బరిగీసి కొట్లాడే సంస్కృతి మనది. మాకు స్ఫూర్తి ప్రదాతలు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ తెలంగాణ. వందేమాతర, గ్రంథాలయ ఉద్యమాలు కావచ్చు, సాయుధ పోరాటాలు కావచ్చు.. ఏ పార్టీ ఆధ్వర్యంలో జరిగినా అణచివేతకు, దోపిడికి, అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినవే. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో రాజ్యం అనేక అకృత్యాలకు పాల్పడింది. అందరి మీద రాజ్యం అప్పుడు దుర్మార్గాలకు పాల్పడి, ఎందరినో చంపింది, మరెందరినో జైళ్లపాలు చేసింది'' అని గుర్తుచేశారు. 
 

''మొత్తం తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే పోరాడేవాడికి, దుర్మార్గాలను ఎదిరించిన వాళ్లకే ఈ ప్రాంతం అండగా ఉంది. ఇప్పటికీ తెలంగాణ సమాజం ఈ తత్వాన్ని వదిలిపెట్టలేదు. ఏ రూపంలో ఉన్నా... ఇక్కడ అమరత్వం, చైతన్యం దాగి ఉంది. ఇప్పుడు రాజ్యం మళ్లీ ప్రజలను భయపెట్టి, అణచివేసే ప్రయత్నం చేస్తోంది. అనేక రకాలుగా ప్రలోభపెడుతోంది. ఇలాంటి వాటి మధ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెనుగులాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు సైలెంట్ గా గమనిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో అలాంటి ప్రతికారం తీర్చుకుంటారు'' అని ఈటల పేర్కొన్నారు. 

''తెలంగాణ ఉద్యమంలోనూ ఎవరూ చెప్పకపోయినా కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములయ్యారు. ఒక్క పార్టీ మాత్రమే ఉద్యమం చేస్తే ఇంతమంది కదిలేవారా? అది సకల జనుల ఉద్యమం, సకల పార్టీల ఉద్యమం. త్యాగమంటే చావుమాత్రమే కాదు.. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటంలో పాల్గొనేవారికి అండగా ఉన్న ప్రజలు కూడా త్యాగధనులే. కేంద్రం రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిందంటే అందుకు ప్రజల చైతన్యమే కారణం. గత చరిత్ర నుంచి గుణపాఠాలు తీసుకోనివారు, అవగాహన చేసుకోనివారే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతారు. ఈ దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు ఇక్కడ చెల్లవని హుజురాబాద్ ప్రజలు చాటిచెప్పబోతున్నారు. మీ అక్రమాలు తెలంగాణలో  చెల్లవు'' అని టీఆర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు. 

''రెండు రకాల వ్యక్తులను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. మనం చరిత్ర హీనులు, చరిత్ర వీరులు ఇద్దరినీ గుర్తు పెట్టుకుంటాం. ఐలమ్మ సిఎం కాదు.. కానీ ప్రజలకోసం ప్రాణం అర్పించారు కాబట్టి చరిత్ర గుర్తు చేసుకుంటుంది. హిట్లర్ చరిత్ర హీనుడు అయితే మన శ్రీకాంత చారి చరిత్ర వీరుడు. హుజూరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎవరు నోరు విప్పడం లేదు.  ఎందుకు అంటే మాట్లాడిన మనుషులను బెదిరిస్తున్నారు. వీళ్ళంతా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత గళం విప్పుతారు. టిఆర్ఎస్ వాళ్ళు కులాన్ని రెచ్చగొడుతున్నారు.. ఎన్ని చేసినా 2006 ఎన్నిక అనుభవం పునరావృతం కాబోతుంది'' అన్నారు. 

''కరీంనగర్ లో ఎన్ని కుల సంఘాలకు భూములు ఇచ్చినా.... ఎంత ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. 303 ఎంపీలు, 18 రాష్ట్రాలలో పరిపాలన చేస్తున్న బిజేపి మీద ఇంత ధౌర్జన్యం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకొక తప్పదు. ఇక్కడ అక్రమాలు చేస్తున్న వారు ఎవరు తప్పించుకోలేరు. ప్రజల చేత శిక్ష తప్పదు. అర్జునుడు బాణం ఎత్తినప్పుడు కన్ను కనిపించినట్టు.. బూత్ ఓటర్ మాత్రమే మీకు కనిపించాలి. అహంకారానికి కారణం అయిన పదవిని దింపడమే నిజమైన ప్రతీకారం. అందుకు హుజూరాబాద్ నాంది కాబోతుంది. సెప్టెంబర్ 17 న నిర్మల్ లో జరిగే అమిత్ షా సభకు పెద్దఎత్తున హాజరుకావాలి'' అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. 

click me!