
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదు. దీంతో అక్టోబర్ చివర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.అయితే ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు బరిలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ నుండి అభ్యర్ధి ఎవరనే విషయమై ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో అన్వేషిస్తోంది
ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తేటతెల్లమైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అభ్యర్ధి ఎంపికకు కాంగ్రెస్ కు సమయం కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం ఇటీవల హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత అభ్యర్ధి ఎంపికపై ఎఐసీసీకి నివేదికను పంపాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు నిర్ణయం తీసుకొన్నారు.
మరోవైపు ఈ నెల 10వ తేదీ లోపుగా ఈ స్థానం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్దుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించారు.
అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికలు ఆలస్యంగా జరగడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు.
అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు పోలింగ్ జరిగే వరకు ఓటర్లను తమ వైపునే ఉండేలా చేయడం అంత ఆషామాషీ వ్యవహరం కాదు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించాలని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి ఉప ఎన్నిక వాయిదా పడినా, ఇప్పటికిప్పుడే నిర్వహించినా పెద్దగా నష్టం ఉండదని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మాత్రం ఉప ఎన్నికలు ఆలస్యంగా జరగడం కొంత ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయాలను ఖర్చు పెడుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి. ఈటల రాజేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గడియారాలు,కుంకుమ భరిణలతో పాటు ఇతర వస్తువులను పంపిణీ చేశారని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.ఈ విమర్శలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. హరీషఁ్ రావు ఆరోపణలను కొట్టిపారేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ లు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రచారంలో ఎక్కడా కన్పించడం లేదు.
ఈ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఈ దఫా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని వెతుక్కుంటుంది. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.