జాతీయ కార్యవర్గం ఎంపికలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యామ్నాయంగా మారే విధంగా జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టినట్లు కనిపిస్తోంది.
దక్షిణ తెలంగాణకు చెందిన డీకె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి, టీఆర్ఎస్ ను ఢీకొనడానికి ఆ పనిచేసినట్లు కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అరుణకు కీలకమైన పదవి అప్పజెప్పడం ద్వారా పార్టీని క్రియాశీలకంగా మార్చాలని భావించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు నుంచి బిజెపిలో చేరిన డీకె అరుణ గత ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ కార్యకలాపాలకు హాజరైన దాఖలాలు లేవు. దక్షిణ తెలంగాణలో డికె అరుణ బలమైన నాయకురాలనే విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఎదుర్కునే విషయంలో ఆమె ఏ మాత్రం వెనకంజ వేయరనే విషయం తెలిసిందే. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేసినట్లు కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఆమె శాయశక్తులా కృషి చేస్తారనే విషయం తెలిసిందే.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో బిజెపికి తగిన కార్యకర్తల సంపద ఉంది. బండి సంజయ్ ని పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఉత్తర తెలంగాణ చెక్కు చెదరకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఓ వైపు బీసీలను తమ వైపు తిప్పుకుంటూ మరోవైపు రెడ్డి సామాజిక వర్గం తమ వైపు తిరిగే విధంగా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. జి. కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరో వైపు డికె అరుణ జాతీయ స్థాయి పార్టీ నాయకత్వంలో ఉన్నారు. దానివల్ల కేసీఆర్ ను బలహీనపరచవచ్చునని బిజెపి భావిస్తూ ఉంది.
ఇక, కాంగ్రెసును వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహరచన చేస్తూ కేసీఆర్ కు తగిన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి తగిన విధంగా జాతీయ నాయకత్వం జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసులో నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే అభిప్రాయం ఉంది. వారిలో వారికే పడదు. ఒకరినొకరు కిందికి లాక్కోవడానికే వారికి సమయం సరిపోవడం లేదనే అభిప్రాయం ఉంది.
ఈ పరిస్థితుల్లో రేవంత్ కి లైన్ క్లియర్ అని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ లోని కురువృద్ధులందరిని తప్పించడంతో.... రాష్ట్రంలో కూడా పక్కకుపెట్టినట్టే అని అంటున్నారు. దీనితో రేవంత్ రెడ్డే ఇప్పుడు ఈ పదవికి ఫ్రంట్ రన్నర్ గా కనబడుతున్నారు.