ఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డితో.. కవిత, కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం..!!..

First Published | Jun 2, 2023, 9:18 AM IST

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగించినట్టుగా సమాచారం. ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఊహాగానాలు వెలువడుతునాయి. 

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గురువారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.  

ఈ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్రను ఈడీ ఇటీవల దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లోకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని స్వయంగా కేజ్రీవాలే ఆహ్వానించినట్లు ఈడి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కీలక నిందితుడైన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. మరోసారి వీరిద్దరి చుట్టూ పుచ్చుబిగుస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 


సెల్ ఫోన్లు,  డిజిటల్ ఆధారాలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బలమైన సాక్షాదారాలుగా ఉన్నాయని.. వాటిని  నిందితులు ధ్వంసం చేశారని సిబిఐ ఈడీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి ఇచ్చే వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. శరత్ చంద్రారెడ్డిని దర్యాప్తు సంస్థలు శల్య పరీక్షలు నిర్వహించాయి. ఆ తర్వాతే ఆయనను అప్రూవర్ గా మారెందుకు అంగీకరించినట్లుగా సమాచారం. 

ముఖ్యంగా సిబిఐ,ఈడి తమ ఛార్జ్ షీట్ లలో పంజాబ్ ఎన్నికల్లో ఈ కుంభకోణం నుంచి వచ్చిన లాభాల డబ్బులనే వెచ్చించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డికి చెందిన జెట్ సెట్ గో అనే సంస్థకు చెందిన విమానాల ద్వారానే గోవా, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు నగదును తరలించడానికి సంబంధించిన సమాచారాన్ని శరత్ చంద్రారెడ్డి  ఇవ్వనున్నాడని, దీనికి ఆయన అంగీకరించాడని విశ్వసనీయ వర్గాల బోగట్టా.  

అరుణ్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అనే విషయంలోనూ శరత్ చంద్రారెడ్డి కీలక అంశాలను వివరించారట. దీంతో ఈడి ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలను సిద్ధం చేసుకున్నట్లుగా  తెలుస్తోంది. ఇప్పటికే..ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు.. కవిత కోరిక మేరకే తాను ఢిల్లీ మద్యం కుంభకోణం ఉన్నట్లు.. కవిత తరపున అక్రమ రిటైల్ జోన్లను నిర్వహించానని, ముడుపులు ఆమె తరపున బదిలీ చేశానని చెప్పాడట. 

దీంతో ఈ స్కామ్ లో కవితకు సంబంధించిన కీలక సమాచారాన్ని మొత్తం ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా సేకరించిన ఈడి ఇప్పుడు అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఇచ్చే వివరాలతో..ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగించి.. అరెస్టుకు రంగం సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ వర్గాల సమాచారం. అయితే  శరత్ చంద్రారెడ్డి  అప్రూవర్ గా మారడం వెనక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కీలక నిందితుడు శరత్ చంద్రారెడ్డి.. నెలరోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యాడు. 

కాగా, అతనిని అప్రూవల్ గా మార్చేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా  ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే  కొంతమంది ద్వారా మధ్యవర్తిత్వం జరిపారట. వాళ్లలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర అని తెలుస్తోంది. శరత్ చంద్రారెడ్డి  విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఇటీవల చర్చలు జరిపారని సమాచారం. 

వీరిద్దరి భేటీ తర్వాతే దర్యాప్తు సంస్థలకు కొన్ని కీలక ఆదేశాలు అందాయని అంటున్నారు. వైయస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా అమిత్ షా జగన్ ల భేటీలో చర్చకు వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చెప్పిందానికి జగన్ ఒప్పుకున్నాడని విశ్వసనీయ సమాచారం.

ఈ క్రమంలో అమిత్ షా, జగన్ కు అనేక కండిషన్లు పెట్టినట్లుగా సమాచారం. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం వల్ల  దక్షిణాదిలో పట్టు కోసం బిజెపి ప్రయత్నిస్తోంది. దీనికోసం జగన్ తాము చెప్పినట్లుగా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ఎమ్మెల్సీ కవిత విషయంలో వెంటనే చర్యలు ఉంటాయా లేదా అనేది తెలియదు కానీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాళ్ళ విషయంలో మాత్రం కేంద్రం  వెంట వెంటనే చర్యలు తీసుకుంటుందని ఇంకా ఆయన గత ముగిసినట్లేనని దర్యాప్తు సంస్థలోని కొన్ని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

Latest Videos

click me!