Published : May 22, 2026, 03:15 PM ISTUpdated : May 22, 2026, 03:17 PM IST
Beer: ఇటీవల బీర్ బాటిళ్లకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో బీర్ బాటిల్లో చేపపిల్ల కనిపించిందని ప్రచారం జరగగా, మరో ఘటనలో సీల్ చేసిన బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్లోని ఓ వైన్స్ షాపులో బీర్ బాటిల్లో చేపపిల్ల ఈదుతున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో బీర్ బాటిల్లో చేపపిల్ల ఈదుతున్నట్లు కనిపించింది. దీంతో అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన యునైటెడ్ బ్రూవరీస్, ఆ వీడియోలోని సమాచారం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో, తమ తయారీ యూనిట్లలో కఠిన నాణ్యతా ప్రమాణాలు అమల్లో ఉన్నాయని తెలిపింది. పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలో, నియంత్రిత వాతావరణంలో బాట్లింగ్ ప్రక్రియ జరుగుతుందని వివరించింది. ఈ కారణంగా తయారీ దశలో బాటిల్‌లో చేపపిల్ల వంటి జీవులు చేరడం అసాధ్యమని స్పష్టం చేసింది.
25
సిద్ధిపేటలో కలకలం రేపిన కండోమ్ ప్యాకెట్ ఘటన
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో వెలుగుచూసిన మరో ఘటన మరింత చర్చనీయాంశమైంది. అక్బర్‌పేట భూంపల్లిలోని ఒక వైన్ షాప్ నుంచి కొనుగోలు చేసిన లైట్ బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ కనిపించిందని ఓ వినియోగదారుడు ఆరోపించాడు. సీల్ తీయని బాటిల్‌లో ఈ వస్తువు కనిపించడంతో అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం వైన్ షాప్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన స్పందన లభించలేదని ఆరోపిస్తూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
35
బీర్ బాటిళ్లలో ఇలాంటి వస్తువులు ఎందుకు కనిపిస్తున్నాయి.?
బీర్ బాటిళ్లలో పురుగులు, బొద్దింకలు, బల్లులు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించాయనే ఫిర్యాదులు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నమోదయ్యాయి. అయితే ప్రతి ఘటన వెనుక ఒకే కారణం ఉంటుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. తయారీ ప్రక్రియలో సాంకేతిక లోపాలు, నిల్వ సమయంలో జరిగిన సమస్యలు, సరఫరా గొలుసులో జరిగిన జోక్యం లేదా బాటిల్ సీలింగ్‌కు ముందు లేదా తర్వాత జరిగిన మానవ తప్పిదాలు వంటి అనేక కోణాల్లో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వీడియోలు లేదా చిత్రాల ప్రామాణికత కూడా విచారణ ద్వారా మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది. అందువల్ల ఏ ఘటన జరిగినా సంబంధిత అధికారులు, తయారీ సంస్థలు సాంకేతిక పరిశీలన అనంతరం మాత్రమే అసలు కారణాలను వెల్లడిస్తుంటాయి.
సిద్ధిపేట ఘటనపై కూడా యునైటెడ్ బ్రూవరీస్ స్పందించింది. వినియోగదారుడి ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తామని పేర్కొంది. తమ సంస్థ ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తోందని వెల్లడించింది. ఉత్పత్తి ప్రక్రియ మొత్తం నియంత్రిత వాతావరణంలో జరుగుతుందని, ప్రతి దశలో నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపింది. ఇలాంటి కఠిన ప్రమాణాల నేపథ్యంలో బాటిల్‌లో అనుమానాస్పద వస్తువు ఉండటం అసాధ్యమని సంస్థ అభిప్రాయపడింది.
55
విచారణ కొనసాగుతోంది..
ఈ ఘటనలపై సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బాటిల్‌లో కనిపించిన వస్తువులు తయారీ సమయంలో చేరాయా? లేక ఇతర కారణాల వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందా? అనే అంశాలపై పరిశీలన జరుగుతోంది. ఇక యునైటెడ్ బ్రూవరీస్ కూడా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.