Smart Door Lock : ఇదేం టెక్నాలజీరా నాయనా.. చేయి ఊపితే చాలు ఇంటి తలుపు తెరుచుకుంటుందా..!

Published : Nov 24, 2026, 04:23 PM IST

చేయి ఊపితే చాలు… మీ ఇంటి తలుపు తెరుచుకునేలా షియోమీ స్మార్ట్ లాక్ ను అందిస్తోంది. 3D ఫేస్ రికగ్నిషన్, 2K కెమెరా, 13 అన్‌లాక్ ఫీచర్లతో రిలీజైన Xiaomi Smart Door Lock 5 ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

PREV
15
చేయి ఊపితే చాలు లాక్ ఓపెన్

స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా హోమ్ అప్లయెన్సెస్‌లోనూ ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తోంది చైనీస్ కంపెనీ షియోమీ (Xiaomi). ఇలా ఇంటి భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లేలా కొత్త స్మార్ట్ డోర్ లాక్ (Smart Door Lock 5 Face Recognition Edition) డివైజ్‌ను సొంత దేశం చైనాలో లాంచ్ చేసింది.

తాళం చెవి మాత్రమే కాదు వేలిముద్రతు కూడా అవసరం లేదు… కేవలం ముఖం చూపించినా లేదా దూరం నుంచి అరచేయి ఊపినా తలుపు తెరుచుకునే మోడ్రన్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ లాక్ తయారుచేశారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన Smart Door Lock 5, 5C మోడల్స్ తర్వాత, 13 రకాల అన్‌లాక్ ఫీచర్లతో ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది.

25
క్షణాల్లో అన్‌లాక్ చేసే 3D ఫేస్ రికగ్నిషన్

మనిషి కళ్లలా పనిచేసే డ్యూయల్-లెన్స్ (Dual-lens) 3D ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఈ స్మార్ట్ లాక్‌లో ఇచ్చారు. గుమ్మం ముందు నిలబడిన ఒక్క క్షణంలోనే ఓనర్ ముఖాన్ని ఇది కచ్చితంగా గుర్తుపట్టి తలుపు తెరుస్తుంది. 1.2 మీటర్ల ఎత్తున్న పిల్లల నుంచి 2 మీటర్ల ఎత్తున్న పెద్దల వరకు ఎవరైనా సరే 0.4 నుంచి 0.8 మీటర్ల దూరం నుంచే ఇది ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఫోటో లేదా వీడియో చూపించి మోసం చేయాలని చూస్తే, ఇందులో ఉన్న 3D Liveness Detection టెక్నాలజీ దాన్ని వెంటనే పసిగట్టి అడ్డుకుంటుంది. చీకట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయడం దీని స్పెషాలిటీ.

35
టచ్ చేయకుండానే తెరుచుకునే స్కానర్

వేలిముద్రలు అరిగిపోయిన వృద్ధులు, చేతులు తడిగా లేదా మురికిగా ఉన్నవారు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల కోసమే ఇందులో Contactless Palm Vein ఫీచర్ ఇచ్చారు. సెన్సార్‌కు 12 సెం.మీ నుంచి 20 సెం.మీ దూరంలో అరచేతిని చూపిస్తే చాలు, ఇన్‌ఫ్రారెడ్ కిరణాల (Near-infrared light) ద్వారా చర్మం కింద ఉన్న రక్త నాళాల అమరికను స్కాన్ చేసి క్షణాల్లో తలుపు తెరుస్తుంది.

45
13 అన్‌లాక్ ఫీచర్లు, 2K కెమెరా, సెక్యూరిటీ

ఫేస్ రికగ్నిషన్, పామ్ స్కానర్‌తో పాటు రెగ్యులర్ ఫింగర్‌ప్రింట్, పర్మనెంట్, టెంపరరీ పాస్‌వర్డ్‌లు, బ్లూటూత్, మొబైల్ యాప్ ద్వారా దూరం నుంచే తెరిచే ఫీచర్, ఎమర్జెన్సీ కోసం నార్మల్ కీ.. ఇలా ఇందులో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా షియోమీ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్యాండ్, NFC కార్డ్ ద్వారా కూడా తలుపు తెరవొచ్చు.

తలుపు బయట ఎవరు ఉన్నారో క్లియర్‌గా చూసేందుకు 160 డిగ్రీల యాంగిల్‌లో కవర్ చేసే 3MP 2K కెమెరాను ఇందులో ఫిట్ చేశారు. గుమ్మం దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే, ఇందులో ఉన్న రాడార్ సెన్సార్ ఆటోమేటిక్‌గా వీడియో రికార్డ్ చేసి ఓనర్ ఫోన్‌కు అలర్ట్ పంపుతుంది. తలుపు లోపలి వైపు 3.97 అంగుళాల స్క్రీన్ ఇచ్చారు. బయట నుంచి ఎవరైనా డోర్‌బెల్ నొక్కితే, లోపల ఉన్న స్క్రీన్‌పై వాళ్ల ముఖం కనిపిస్తుంది.

ఇంట్లో లేని టైమ్‌లో కూడా మొబైల్ ద్వారానే వీడియో కాల్‌లో మాట్లాడి తలుపు తెరవొచ్చు. తలుపు సరిగ్గా లాక్ చేయకపోయినా లేదా ఎవరైనా లాక్ పగలగొట్టడానికి ట్రై చేసినా వెంటనే అలారం మోగే సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

55
బ్యాటరీ లైఫ్, ధర వివరాలు

ఈ షియోమీ స్మార్ట్ డోర్ లాక్ లోని 5,000mAh లిథియం బ్యాటరీ సుమారు 4 నెలల పాటు పనిచేస్తుంది. ఈ ఛార్జింగ్ అయిపోగానే లోపల ఉన్న 4 AA బ్యాటరీలు ఆటోమేటిక్‌గా పవర్ తీసుకుని మరో 6 నెలల పాటు లాక్‌ని పనిచేసేలా చేస్తాయి. ఒకవేళ బ్యాటరీ పూర్తిగా అయిపోతే, బయట ఉన్న USB-C పోర్ట్ ద్వారా పవర్ బ్యాంక్‌ని కనెక్ట్ చేసి తలుపు తెరవొచ్చు.

ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్‌కి వచ్చిన ఈ స్మార్ట్ డోర్ లాక్ ధర 2,116 యువాన్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.25,000) నిర్ణయించారు. ప్రభుత్వ సబ్సిడీతో ఇది 1,799 యువాన్లకు (సుమారు రూ.21,500) లభిస్తుంది. ఇతర దేశాల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories