
స్మార్ట్‌వాచ్‌లలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ (SpO2), ఈసీజీ (ECG) నుంచి స్లీప్, స్ట్రెస్, బ్లడ్ ప్రెజర్, కిందపడితే గుర్తించే (Fall Detection) వరకు ఎన్నో రకాల ఫీచర్లు ఉంటున్నాయి.
స్మార్ట్‌వాచ్ కొనడం పైకి చాలా సింపుల్‌గా అనిపించినా, నిజానికి అది అంత సులభం కాదు. ప్రస్తుత మార్కెట్లో ప్రాథమిక ఆరోగ్య సూచికల కంటే ఎక్కువే ట్రాక్ చేస్తున్నామని చెప్పే మోడల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మోడ్రన్ స్మార్ట్‌వాచ్‌లలో నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ (SpO2), ఈసీజీ టెస్టింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, నిద్ర నాణ్యతపై విశ్లేషణ లాంటి ఎన్నో హెల్త్ ఫీచర్లు వస్తున్నాయి.
అయితే, వీటిలో అన్ని ఫీచర్లు ఒకేలా ఉపయోగపడవు. అందుకే, డబ్బులు ఖర్చు చేసే ముందు ఏ సెన్సార్ నిజానికి దేన్ని కొలుస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం.
మీరు స్మార్ట్‌వాచ్ కొనాలని ప్లాన్ చేస్తే, దాని డిస్ప్లే (Display), బ్యాటరీ లైఫ్, డిజైన్‌ను మించి చూడటం అవసరం. అందులో ఏయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, రోజువారీ ఆరోగ్యానికి అవి అర్థవంతమైన సమాచారాన్ని ఇస్తున్నాయా అనేది కూడా గమనించాలి.
కొన్ని ఫీచర్లు వ్యాయామం, శరీర రికవరీని ట్రాక్ చేయడంలో సహాయపడేలా డిజైన్ చేసి ఉంటాయి. మరికొన్ని ఫీచర్లు వైద్య సాయం అవసరమైన కొన్ని అసాధారణ మార్పులను మీకు ముందుగానే హెచ్చరించగలవు. వీటితో పాటు కచ్చితత్వం, సెన్సార్ క్వాలిటీ, మీ స్మార్ట్‌ఫోన్‌తో అది కనెక్ట్ అయ్యి పనిచేసే తీరు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు.
ఇందులోని హార్ట్ రేట్ సెన్సార్, రోజంతా, వ్యాయామం చేసేటప్పుడు మీ నాడిని ట్రాక్ చేస్తుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో మీ హార్ట్ రేట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, వర్కవుట్ ఇంటెన్సిటీని ట్రాక్ చేయడానికి, హార్ట్ రేట్లో అసాధారణ మార్పులను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
బ్లడ్ ఆక్సిజన్ (SpO2) మానిటరింగ్
మీ రక్తంలో కలిసిన ఆక్సిజన్ శాతాన్ని SpO2 మానిటరింగ్ అంచనా వేస్తుంది. నిద్రపోయేటప్పుడు సహా ఇతర సమయాల్లో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్‌లో వచ్చే మార్పులను గమనించడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
ఈసీజీ (Electrocardiogram - ECG) మానిటరింగ్
ఈసీజీ ఫీచర్ ఉన్న స్మార్ట్‌వాచ్, మీ గుండె విద్యుత్ కార్యకలాపాలను రికార్డ్ చేసి, 'కర్ణిక ప్రకంపనలు' (AFib) లాంటి హార్ట్ రేట్ అసాధారణతల లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. తమ హార్ట్ రేట్ సక్రమంగా ఉందో లేదో గమనించుకోవాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
అడ్వాన్స్డ్ స్లీప్ ట్రాకింగ్
సాధారణ స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ మీరు ఎంతసేపు నిద్రపోయారో మాత్రమే చెబుతుంది. కానీ, అడ్వాన్స్డ్ ట్రాకింగ్ ఫీచర్ తేలికపాటి నిద్ర (Light), గాఢ నిద్ర (Deep), కలల దశ నిద్ర (REM sleep) లాంటి వివిధ నిద్ర దశలను కచ్చితంగా అంచనా వేసి చూపుతుంది.
కొన్ని స్మార్ట్‌వాచ్‌లు స్ట్రెస్, శరీర రికవరీ పద్ధతులను అంచనా వేయడానికి 'హార్ట్ రేట్ వేరియబిలిటీ' (HRV)ని ఉపయోగిస్తాయి. ఒక హార్ట్ బీట్‌కి, మరో హార్ట్ బీట్‌కి మధ్య ఉన్న టైమ్ వేరియేషన్‌ను HRV కొలుస్తుంది. వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, రోజువారీ స్ట్రెస్‌కి మన శరీరం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్
ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్‌వాచ్‌లలో బ్లడ్ ప్రెజర్‌ను ట్రాక్ చేసే ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లడ్ ప్రెజర్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడానికి యూజర్లకు ఈ ఫీచర్ సహాయపడుతుంది.
ఫాల్ డిటెక్షన్ & అవసరాల SOS
మోషన్ సెన్సార్లు, అల్గారిథమ్‌లను ఉపయోగించి, ఎవరైనా బలంగా కిందపడటాన్ని ఈ ఫీచర్ గుర్తిస్తుంది. కిందపడిన తర్వాత వాచ్ పెట్టుకున్న వ్యక్తి నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే, ఈ స్మార్ట్‌వాచ్‌లు వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు సమాచారం పంపగలవు లేదా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేయగలవు. వృద్ధులు, ఒంటరిగా నివసించే వారికి ఇది ఎంతో భద్రతను, ప్రయోజనాన్ని ఇస్తుంది.