
Keyboard Tips : టాప్ సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి స్కూల్, కాలేజీ విద్యార్థుల వరకు చాలామంది కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ వాడుతుంటారు. ఈ కాలంలో కంప్యూటర్ లేకుండా డేటా స్టోరేజ్ అసాధ్యమనే చెప్పాలి... అందుకే ప్రతి ఆఫీసులో పక్కా ఉండాల్సిందే. ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, ఆటోమొబైల్ షోరూంలు, హోటళ్లు, రెస్టారెంట్స్... అక్కడ, ఇక్కడని కాదు ఎక్కడ చూసినా కంప్యూటర్లు లేదా ల్యాప్ టాప్ లు కనిపిస్తాయి. దానిముందు కూర్చుని టకటక కీబోర్డును వాయిస్తూ టైప్ చేసేవారికి చూస్తుంటాం.
ఇలా ఆఫీసులు, పని ప్రదేశాల్లో చాలామంది గంటల తరబడి టైప్ చేస్తుంటారు, విద్యార్థులు ఇంట్లో లేదా కాలేజీల్లో ల్యాప్ టాప్ లో నిత్యం ఏదోఒకటి సెర్చ్ చేస్తుంటారు, మెయిల్స్ పంపిస్తుంటారు… కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో ఏం చేయాలన్నా పక్కా కీబోర్డ్ వాడాల్సిందే. ఇలా మన జీవితంలో కీబోర్డ్ వాడకం ఒక భాగమైపోయింది. అయితే రోజూ వాడే కీబోర్డ్‌లో మనం పెద్దగా పట్టించుకోని ఒక చిన్న విషయం ఉంటుంది. అదే F, J కీస్‌పై కనిపించే చిన్న ఉబ్బెత్తు గీతలు.
కీబోర్డ్‌లోని మిగతా కీస్‌తో పోలిస్తే F, J కీస్‌పై ఈ చిన్న గీతలు లేదా బార్ ఎందుకు ఉంటాయనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఇది కేవలం కీబోర్డ్‌కు మంచి లుక్ ఇవ్వడానికి పెట్టిన డిజైన్ కాదు. కీబోర్డ్ వైపు చూడకుండా టైప్ చేయడానికి, వేళ్లను సరైన స్థానంలో ఉంచుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న టైపింగ్ గైడ్. టచ్ టైపింగ్‌లో ఈ చిన్న గుర్తుకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.
చాలా QWERTY కీబోర్డుల్లో F, J కీస్‌పై చిన్నగా ఉబ్బెత్తుగా ఉండే గీతలు కనిపిస్తాయి. దీన్ని సాధారణంగా Tactile Bar లేదా Tactile Marker అని అంటారు. వేళ్లతో తాకినప్పుడు స్పష్టంగా అనిపించేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
దీని ప్రధాన ఉద్దేశం.. కీబోర్డ్‌ను చూడకుండానే చేతులు సరైన స్థానంలో ఉన్నాయో తెలుసుకోవడం. ముఖ్యంగా టచ్ టైపింగ్ చేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కళ్లను స్క్రీన్‌పైనే ఉంచి టైప్ చేస్తున్న సమయంలో చేతులు కాస్త పక్కకు జరిగిపోయినా, F లేదా J కీపై ఉన్న గీతను తాకడం ద్వారా వేళ్ల పొజిషన్‌ను మళ్లీ సరిచేసుకోవచ్చు.
QWERTY కీబోర్డ్‌లో అక్షరాలు మూడు ప్రధాన వరుసల్లో ఉంటాయి... వాటిలో మధ్య వరుసను అంటే ASDFG అక్షరాలు గలదాన్ని Home Row అంటారు. టైప్ చేసేటప్పుడు ఎడమ చేతి చూపుడు వేలు సాధారణంగా ఈ వరుసలోని F కీపై, కుడి చేతి చూపుడు వేలు J కీపై ఉంచుతారు. అంటే F, J కీస్ రెండు చేతులకు మధ్యలో ఉండే ముఖ్యమైన రిఫరెన్స్ పాయింట్లుగా పనిచేస్తాయి.
చూపుడు వేళ్లను ఈ రెండు కీస్‌పై ఉంచిన తర్వాత మిగతా వేళ్లను వాటి చుట్టూ సహజంగా అమర్చుకోవచ్చు. అందుకే ఈ రెండు కీస్‌పై స్పర్శ ద్వారా గుర్తించే చిన్న గుర్తును ఏర్పాటు చేశారు. కీబోర్డ్‌ను కళ్లతో చూడాల్సిన అవసరం లేకుండా చేతుల స్థానాన్ని గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
Touch Typing అంటే కీబోర్డ్‌ను చూస్తూ ఒక్కో అక్షరాన్ని వెతుక్కుంటూ టైప్ చేయకుండా, వేళ్లకు అలవాటైన స్థానాల ఆధారంగా టైప్ చేయడం. ఈ పద్ధతిలో ప్రతి కీ ఎక్కడ ఉందో కళ్లతో వెతకాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు మీరు టైప్ చేస్తూ ఉండగా చేతులు కొద్దిగా ఎడమవైపు లేదా కుడివైపు జరిగిపోయాయని అనుకుందాం. అప్పుడు వెంటనే కీబోర్డ్ వైపు చూడాల్సిన పనిలేదు. చూపుడు వేలితో F లేదా J కీని తాకితే చాలు. ఆ కీపై ఉన్న చిన్న గీత తగలగానే చేతులు సరైన స్థానంలో ఉన్నాయా లేదా అనే విషయం అర్థమవుతుంది. అలా F, J కీస్ మన వేళ్లకు ఒక రకమైన స్టార్టింగ్ పాయింట్‌లా పనిచేస్తాయి.
ఫాస్ట్‌గా టైప్ చేసేవాళ్లను గమనిస్తే, వారు ప్రతిసారీ కీబోర్డ్ వైపు చూడరు. వారి కళ్లంతా స్క్రీన్‌పైనే ఉంటాయి. అయినప్పటికీ వేళ్లు మాత్రం కరెక్ట్ కీస్‌పైనే పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి వేళ్లకు ఏర్పడే మసిల్ మెమరీ. అదే సమయంలో F, J కీస్‌పై ఉన్న చిన్న tactile marker కూడా చేతుల పొజిషన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఒకసారి వేళ్లు F, J కీస్‌ను గుర్తించగలిగితే, వాటిని ఆధారంగా చేసుకుని మిగతా వేళ్లను సరైన స్థానంలోకి తీసుకురావడం సులభమవుతుంది. అందువల్ల టచ్ టైపింగ్ నేర్చుకునే సమయంలో కూడా ఈ రెండు కీస్‌ను రిఫరెన్స్‌గా ఉపయోగిస్తారు.
A : ; కీస్‌పై గీత ఎందుకు ఉండదు?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కీబోర్డ్‌లో A : ; (సెమీకోలన్) వంటి కీస్ కూడా Home Rowలోనే ఉంటాయి. అయినప్పటికీ సాధారణ కీబోర్డుల్లో వాటిపై F, J లాంటి tactile marker ఉండదు. దానికి కారణం F, J కీస్ రెండు చేతుల చూపుడు వేళ్లకు ప్రధాన రిఫరెన్స్ పాయింట్లు కావడమే. A : ; కీస్ చిటికెన వేళ్లకు సంబంధించిన స్థానాలను సూచిస్తాయి. కానీ రెండు చేతుల మొత్తం పొజిషన్‌ను త్వరగా గుర్తించడానికి మధ్యలో ఉన్న F, J కీస్ మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
కీబోర్డ్‌ను చూస్తూ టైప్ చేస్తే మన దృష్టి స్క్రీన్, కీబోర్డ్ మధ్య పదేపదే మారుతుంది. దీనివల్ల టైప్ చేసే వేగం తగ్గడమే కాకుండా, టైపింగ్‌లో అంతరాయం కూడా ఏర్పడుతుంది. F, J కీస్‌ను రిఫరెన్స్‌గా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే కీబోర్డ్ వైపు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. చేతులు తప్పు స్థానానికి వెళ్లినప్పుడు వాటిని త్వరగా సరిచేసుకోవచ్చు. దీంతో టైపింగ్ మరింత సహజంగా మారుతుంది.
అయితే F, J కీస్‌పై ఉన్న గీత ఒక్కటే టైపింగ్ స్పీడ్‌ను పెంచదు. సరైన finger placement, నిరంతర ప్రాక్టీస్, touch typing అలవాటు.. ఇవన్నీ కలిసి టైపింగ్ వేగం, ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
కొత్తగా టైపింగ్ నేర్చుకునేవారికి చాలా ఉపయోగం
టచ్ టైపింగ్ కొత్తగా నేర్చుకునేవాళ్లకు మొదట్లో ప్రతి కీ ఎక్కడుందో గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కీబోర్డ్ వైపు చూడకుండా టైప్ చేయడం ప్రారంభించినప్పుడు చేతులు తమ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో F, J కీస్‌పై ఉన్న చిన్న గీత మంచి రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తుంది. చూపుడు వేళ్లతో ఆ గీతను గుర్తించి, మిగతా వేళ్లను Home Row స్థానంలో అమర్చుకోవచ్చు. అంటే.. కీబోర్డ్‌ను చూడకుండా చేతులకు దారి చూపించే చిన్న గుర్తు అన్నమాట.
చిన్న గీతలు.. పెద్ద ఉపయోగాలు
కీబోర్డ్‌లోని F, J కీస్‌పై ఉండే ఆ చిన్న గీతను ఇప్పటివరకు చాలామంది పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు. కానీ దాని వెనుక ఉన్న ఆలోచన మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. కీబోర్డ్‌ను చూడకుండా టైప్ చేయాలంటే చేతులు ఎక్కడ ఉండాలో ముందుగా తెలుసుకోవాలి. ఆ స్థానాన్ని గుర్తించడానికి F, J కీస్‌పై ఉన్న tactile marker సహాయపడుతుంది. అక్కడి నుంచి వేళ్ల కదలికలు, టైపింగ్ అలవాటు, మసిల్ మెమరీ ద్వారా మిగతా కీస్‌ను గుర్తించడం సులభమవుతుంది.
అందుకే ఇకపై మీరు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తున్నప్పుడు F, J కీస్‌పై ఉన్న ఆ చిన్న గీతను ఒకసారి గమనించండి. చూసేందుకు చిన్నదిగా కనిపించినా.. కీబోర్డ్‌ను చూడకుండా టైప్ చేసే విధానంలో అది ఒక ముఖ్యమైన రిఫరెన్స్ పాయింట్.