Motorola Razr Flex: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, యాపిల్ ఐఫోన్ డుయోకు పోటీగా మోటరోలా తన కొత్త కాంపాక్ట్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫ్లెక్స్ ను మార్కెట్ లోకి తెస్తోంది. 50MP డ్యూయల్ కెమెరాలు, 6.9 అంగుళాల స్క్రీన్‌తో జనవరిలో రానుంది.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడు అసలైన పోటీ మొదలైంది. టెక్ దిగ్గజాలు శాంసంగ్, యాపిల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా సిద్ధమవుతోంది. త్వరలోనే మార్కెట్లోకి ఒక కొత్త కాంపాక్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురావడానికి మోటరోలా ప్లాన్ చేస్తోంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ఫోన్ నేరుగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, యాపిల్ ఐఫోన్ డుయో మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ అప్‌కమింగ్ డివైస్ పేరు రేజర్ ఫ్లెక్స్ అని లీక్స్ పేర్కొంటున్నాయి. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన కొత్త రెండర్ ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోల ద్వారా ఫోన్ డిజైన్, కలర్స్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. మోటరోలా దగ్గర ఇప్పటికే పెద్ద బుక్ స్టైల్ రేజర్ ఫోల్డ్, మరికొన్ని ఫ్లిప్ ఫోన్లు ఉన్నాయి. కానీ మార్కెట్లో నడుస్తున్న కొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ కాంపాక్ట్ మోడల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
26
రెండు ప్రత్యేకమైన రంగులు, ప్రీమియం టెక్స్చర్ ఫినిషింగ్
లీక్ అయిన ఫోటోలలో మోటరోలా రేజర్ ఫ్లెక్స్ రెండు అద్భుతమైన రంగులలో కనిపిస్తోంది. కంపెనీ వీటికి పాంటోన్ డార్క్ బొటానికల్ గ్రీన్, పాంటోన్ కొరియాండర్ అని పేర్లు పెట్టింది. అంటే ఇవి ఆకుపచ్చ, లేత గోధుమ రంగు షేడ్స్ అన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం గ్రీన్ కలర్ మోడల్ వెనుక భాగంలో ఫ్యాబ్రిక్ లాంటి సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది. అదే బేజ్ కలర్ మోడల్‌కు గరుకుగా ఉండే లెదర్ లాంటి టెక్స్చర్ ఇచ్చారు. గత ఐదేళ్లుగా మోటరోలా తన ఫోన్ల ఫినిషింగ్‌పై చాలా ఫోకస్ పెట్టింది. కాబట్టి ఈ కొత్త టెక్స్చర్ డిజైన్ యూజర్లకు తప్పకుండా నచ్చుతుందని టెక్ నిపుణులు అంటున్నారు.
36
శాంసంగ్, యాపిల్ డిజైన్ల మధ్య ఒక కొత్త స్టైల్
ఇంతకుముందు కూడా రెడిట్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక ఫోటో కనిపించింది. ఇప్పుడు వచ్చిన కొత్త లుక్‌తో ఫోన్ డిజైన్ ఎలా ఉండబోతుందో పూర్తిగా అర్థమైంది. డిజైన్ విషయంలో మోటరోలా శాంసంగ్, యాపిల్ ఫోన్లకు మధ్యస్థంగా ఒక కొత్త రూట్ ఎంచుకుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫోన్ సూటిగా, చతురస్రాకారపు అంచులతో ఉంటుంది.
మరోవైపు యాపిల్ ఫోన్లలో అంచులు ఎక్కువగా గుండ్రంగా ఉంటాయి. మోటరోలా ఈ రెండింటినీ కలిపి, చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా, స్మూత్‌గా ఉండే డిజైన్‌ను తయారు చేసింది. ఈ ఫోన్ బయటి స్క్రీన్ నాలుగు వైపులా ఒకేలా సమానంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకత యాపిల్ ఫోన్ కంటే దీనిని భిన్నంగా ఉంచుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే రేజర్ ఫ్లెక్స్ వెనుక భాగంలో రెండు కెమెరాల సెటప్ ఉంది. ఈ రెండు కెమెరా సెన్సార్లు కూడా 50-మెగాపిక్సెల్ సామర్థ్యంతో రానున్నాయని సమాచారం. అంతేకాకుండా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డిస్ప్లే లోపల పంచ్-హోల్ కటౌట్ ఇచ్చారు.
ఇక స్క్రీన్ సైజ్ విషయంలో ఈ ఫోన్ మిగతా ఫోల్డబుల్ ఫోన్ల కంటే కొంచెం చిన్నదిగా, కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇందులో బయటి వైపు సుమారు 5 అంగుళాల కవర్ స్క్రీన్, లోపలి వైపు 6.9 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే ఉండొచ్చు. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌తో పోలిస్తే దీని స్క్రీన్ సైజ్ సుమారు అర అంగుళం చిన్నదిగా ఉంటుంది.
56
ఒక్క చేత్తో వాడటానికి ఎంతో సులభం
రోజువారీ పనుల కోసం 5 అంగుళాల బయటి స్క్రీన్ కొంతమంది యూజర్లకు కొంచెం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉండే 6.9 అంగుళాల డిస్ప్లేను కూడా ఒక్క చేత్తో చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.
సాధారణంగా పెద్ద ఫోల్డబుల్ ఫోన్లను వాడాలంటే రెండు చేతులతో పట్టుకోవాల్సి వస్తుంది. కానీ మోటరోలా తెస్తున్న ఈ చిన్న సైజ్ ఫోన్ జేబులో పెట్టుకోవడానికి, చేతిలో వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఈ మధ్య మార్కెట్లో కాంపాక్ట్ ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
66
తక్కువ ధరలోనే జనవరిలో లాంచ్ అయ్యే ఛాన్స్
ఈ ఫోన్ ధర, లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించి కూడా ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కంటే తక్కువ ధరకే మోటరోలా తన రేజర్ ఫ్లెక్స్ ఫోన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. అమెరికా మార్కెట్లో దీని ధర సుమారు 1,700 డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా.
ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్లో ఇది ఒక బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌గా మారనుంది. రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. సరైన ధర, సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ 2027 సంవత్సరంలో హాట్ టాపిక్ కానుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.