వాట్సాప్ దుర్వినియోగం
వాట్సాప్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేవగానే మొదట, రాత్రి పడుకునే ముందు చివరిగా వాట్సాప్ చూడాల్సిందే. వీడియోలు, మెసేజ్ లు ఇలా రోజంతా వాట్సాప్ ను ఉపయోగిస్తుంటాం. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్న వాట్సాప్ ను దుర్వినియోగం చేస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందని మీకు తెలుసా.?
వాట్సాప్ లో కొన్ని రకాల పనులు చేయడం చట్ట విరుద్దమని మీకు తెలుసా.? అవేంటంటే.. వాట్సాప్ లో అశ్లీ, హింసాత్మక లేదా మతపరంగా అభ్యంతకరమైన కంటెంట్ ను షేర్ చేయడం చట్ట విరుద్ధం. ఐటీ చట్టం 2000 సెక్షన్ 67 ప్రకారం, అలా చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
వాట్సాప్ గ్రూపుల్లో సంచలన వార్తలు, అల్లర్లు రెచ్చగొట్టే మెసేజ్‌లు, వీడియోలు వంటి వాటి షేర్ చేయడం ద్వారా సమాజంలో అశాంతి సృష్టించే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇలాంటి పనులు చేసిన వారిని ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం జైలు శిక్ష విధిస్తారు.
బెదిరింపులు
వాట్సాప్‌లో ఎవరినైనా బెదిరించడం, బెదిరిస్తూ మెసేజ్ లు పంపడం వంటివి చట్ట విరుద్ధం. ఇలాంటి పనులు చేసే వారికి ఐపీసీ సెక్షన్ 503 ప్రకారం తీవ్రమైన నేరం, శిక్షగా పరిగణిస్తారు.
జాతి, మతం లేదా సామాజిక సమరసతను దెబ్బతీసే మెసేజ్‌లు, వీడియోలు పంపడం నేరం. మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయితే వాటిని అడ్డుకోండి, లేకపోతే శిక్ష పడుతుంది. వాట్సాప్ గ్రూప్ లలో ఇలాంటి మెసేజ్ లు షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ ను బాధ్యులుగా పరిగణిస్తారు.
వాట్సాప్‌లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, హింసాత్మక వీడియోలు షేర్ చేయడం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు, చర్చలు, షేరింగ్ చట్టవిరుద్ధం. అలా చేస్తే పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. వాట్సాప్‌లో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా ప్రభుత్వ డాక్యుమెంట్ల నకిలీ కాపీలు అమ్మడాన్ని నేరంగా పరిగణిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వాట్సాప్ ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పైన తెలిపినట్లు మెసేజ్ లు, వీడియోలు షేర్ చేయకూడదు. మీకు వచ్చిన మెసేజ్ లకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఇతరులకు షేర్ చేయాలి. వాట్సాప్ మంచి కమ్యూనికేషన్ మాధ్యమం కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకే బాధ్యాతాయుతంగా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.