Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్ పట్ల నిబద్ధతపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని కోరినా స్పందన రాకపోవడంతో..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్ పట్ల నిబద్ధతపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జైస్వాల్ తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని, అతని పట్ల ఎంసీఏ గుర్రుగా ఉందని సమాచారం. ఇటీవల బీసీసీఐ జాతీయ జట్టు ఆటగాళ్లను దేశీయ క్రికెట్‌లో ఆడాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.
25
యశస్వి జైస్వాల్ సైతం సొంత జట్టు..
బీసీసీఐ ఆదేశాలకు అనుగుణంగానే విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున, రోహిత్ శర్మ ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ సైతం సొంత జట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. హైదరాబాద్‌తో ముగిసిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత పొందింది.
35
జైస్వాల్‌ను ఎంపిక చేయబోమని..
తదుపరి మ్యాచ్ సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సహా వెటరన్ స్టార్ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ కీలక సమయంలో, ఎంసీఏ సెలెక్టర్లు ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్‌ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో జైస్వాల్‌ను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ విషయంపై ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ, "హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాం. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తనకి నచ్చినప్పుడు నచ్చిన మ్యాచ్‌లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. తదుపరి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా లేదా అని అడిగినప్పుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతని పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదని" పేర్కొన్నారు.
55
ఢిల్లీతో మ్యాచ్‌కు..
కాగా, ఢిల్లీతో మ్యాచ్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఎంసీఏతో జైస్వాల్‌కు సమస్యలు వచ్చాయి. అప్పుడు అతను గోవా జట్టుకు వెళ్లాలని భావించాడు కానీ చివరి నిమిషంలో ఆ ప్రణాళికను రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే రకమైన సమస్య ఏదైనా వచ్చిందా అని అభిమానులు అనుకుంటున్నారు.