MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 19వ సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 44 ఏళ్ల వయసులోనూ ధోని నెట్స్‌లో శ్రమిస్తున్న దృశ్యాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ ప్రతిష్టాత్మక లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
25
మైదానంలో చెమటోడుస్తున్న ధోని
44 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో చెమటోడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (జేఎస్సీఏ) అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆయన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
35
ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్
వీడియోలో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, తలా తన సన్నద్ధతను మాత్రం ముందే ప్రారంభించారు. జార్ఖండ్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. "చూడండి ఎవరు తిరిగి వచ్చారో" అని పేర్కొంది. అంతేకాకుండా, వీడియోలో మరో క్యాప్షన్ కూడా ఉంది, అదేమిటంటే "జేఎస్సీఏ గర్వకారణం మహేంద్ర సింగ్ ధోని" అని రాసుకొచ్చింది.
ఈ ప్రాక్టీస్ సెషన్‌కు ముందు ధోని, జేఎస్సీఏ అధికారి, క్రికెటర్ సౌరభ్ తివారీతో మాట్లాడుతుండటం కూడా గమనించవచ్చు. ప్రస్తుతం అన్ని జట్లు ఐపీఎల్ కు ముందు జరగనున్న టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతారు.
55
ధోని తిరిగి మైదానంలోకి..
ఈ క్రమంలో ధోని ప్రాక్టీస్ వీడియో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం, తనదైన శైలిలో ప్రాక్టీస్ ప్రారంభించడం ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా లేదా అనేది ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26న ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ధోని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.