గెట్ ర‌డీ ఫ‌ర్ బిగ్గెస్ట్ వార్‌.. అమ్మాయిలు అద‌ర‌గొడ‌తారా.? భార‌త్‌కు గెలిచే అవ‌కాశాలున్నాయా.?

Published : Nov 02, 2025, 09:33 AM IST

Womens World Cup Final: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో తుది అంకానికి సమయం ఆసన్నమైంది. నెలరోజుల పాటు ఉత్కంఠ రేపిన ఈ టోర్నీ ఆదివారం ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియంలో ఫైనల్‌తో ముగియనుంది. ఈ పోరులో గెలిచేది ఎవరో మ‌రికాసేపట్లో తేల‌నుంది.? 

PREV
15
కొత్త చరిత్రకు వేదికగా ముంబై

ముంబై మైదానం ఈసారి కొత్త చాంపియన్‌ను చూడబోతోంది. మహిళల వన్డే ప్రపంచకప్‌ 13వ ఎడిషన్‌ ఫైనల్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు స్థానమే లేదు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌, ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా ఫైనల్‌ వేదిక చేరాయి. ఇరు జట్లు చరిత్ర సృష్టించాలన్న దృఢసంకల్పంతో ఉన్నాయి. సొంత ప్రేక్షకుల మద్దతు భారత్‌ వైపే ఉండటంతో హర్మన్‌ప్రీత్‌ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

25
మూడో ప్రయత్నంలో ట్రోఫీ కల నెరవేరుతుందా?

భారత మహిళల జట్టుకు ఇది వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో మూడో ప్రవేశం. 2005లో ఆసీస్‌ చేతిలో ఓటమి, 2017లో ఇంగ్లండ్‌పై 9 పరుగుల తేడాతో చేజారిన కప్‌ ఇంకా అభిమానుల మదిలో మిగిలే ఉంది. ఈసారి మాత్రం "ఫైనల్ గెలిచి తీరాలి" అనే తపనతో జట్టు బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌, స్మృతి మందన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, షెఫాలీ వర్మ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌ విభాగం దృఢంగా ఉండటం భారత్‌కు బలం. అయితే బౌలింగ్‌లో కొరత ఆందోళన కలిగిస్తోంది. రేణుకా సింగ్‌ ఆధ్వర్యంలోని పేసర్లు ఫైనల్‌లో సఫారీ బ్యాటర్లను అణచగలిగితే భారత్‌కు ట్రోఫీ అందే అవకాశం మరింత పెరుగుతుంది.

35
దక్షిణాఫ్రికా విష‌యానికొస్తే..

మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు పొందని దక్షిణాఫ్రికా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ వరకు వచ్చింది. టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్‌తో పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత జట్టు అద్భుతంగా పుంజుకుంది. కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ 470 పరుగులతో ఈ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలుస్తూ అద్భుత ఫామ్‌లో ఉంది. మరిజాన్‌ కాప్‌, క్లో ట్రయాన్‌, నదిన్‌ డిక్లెర్క్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌ వంటి ఆల్‌రౌండర్లు దక్షిణాఫ్రికా బలం. వీళ్లు ఏ సమయంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు.

45
పిచ్‌, వాతావరణం – భారీ స్కోర్లకు అవకాశం

డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియం పిచ్‌ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలం. టాప్‌ ఆర్డర్‌ జట్టు కుదురుకుంటే 270–300 పరుగులు సాధ్యమే. ముంబైలో వర్షాలు పడుతున్నా ఫైనల్‌ రోజుకు రిజర్వ్‌ డే ఉండటం ప్లస్‌ పాయింట్‌. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసే జట్టుకే ఆధిక్యం ఉండే అవకాశం ఉంది.

భారత్‌ గెలిచే అవకాశాలు ఎంతవరకు?

టీమిండియా ఈ టోర్నీలో చూపించిన జోరు చూస్తే గెలిచే అవకాశాలు సుమారు 60-65% ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హోం గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌, సీనియర్‌ ప్లేయర్ల అనుభవం భారత్‌ వైపు ఉండగా, సఫారీ జట్టు బ్యాటింగ్‌ లోతు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనతో పోటీ గట్టిదే. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ చేసిన రికార్డు రన్‌ చేజ్‌ జట్టుకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహం ఫైనల్‌లో కొనసాగితే అమ్మాయిలకు తొలి ఐసీసీ ట్రోఫీ దూరంలో లేదని చెప్పాలి.

55
తుది జట్ల అంచనా

భారత్‌: స్మృతి మందన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్‌, అమన్‌జ్యోత్‌ సింగ్‌, రాధా యాదవ్‌/స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడా, శ్రీచరణి, రేణుకా సింగ్‌.

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్‌ (కెప్టెన్‌), తజ్మిన్‌ బ్రిట్స్‌, అనెకె బోష్‌, సున్‌ లుజ్‌, మరిజాన్‌ కాప్‌, సినాలో జఫ్టా, క్లో ట్రయాన్‌, నదిన్‌ డిక్లెర్క్‌, అనెరీ డెర్క్‌సెన్‌, ఖాఖా, ఎంలబా.

ప్రైజ్‌ మనీ వివరాలు

ఐసీసీ ఈసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ప్రైజ్‌ మనీని భారీగా పెంచింది. విజేత జట్టుకు రూ. 40 కోట్లు, రన్నరప్‌ జట్టుకు రూ. 20 కోట్లు అందనున్నాయి. సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు చెరో రూ. 10 కోట్లు బహుమతి అందించ‌నున్నారు. మొత్తం మీద‌.. ఫైనల్‌ ఫలితం ఏదైనా మహిళల క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం రాసే రోజుగా నిలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories