Radhika Yadav: గురుగ్రామ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ను ఆమె తండ్రి ఇంట్లోనే కాల్చిచంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గురుగ్రామ్ సెక్టార్ 57లో గురువారం ఉదయం దారుణ ఘటన జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ను ఇంట్లో ఉన్న సమయంలో తండ్రి కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన సుషాంత్ లోక్-ఫేజ్ 2 ప్రాంతంలోని వారి నివాసంలో ఉదయం 10:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
25
శరీరంలో మూడు బుల్లెట్లు: ప్రాణాలు కోల్పోయిన టెన్నిస్ క్రీడాకారిణి
పోలీసులు తెలిపిన ప్రకారం.. రాధికా తండ్రి తన లైసెన్స్ ఉన్న రివాల్వర్‌తో ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపారు. అయితే, ఆ తర్వాత ఆమెను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
గాయాలు తీవ్రంగా కావడంతో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందారు. గురుగ్రామ్ పోలీసు పబ్లిక్ రిలేషన్స్ అధికారి సందీప్ కుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "మూడుసార్లు కాల్పులు జరిగినట్టు నిర్ధారణ అయింది. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేశాం" అని ఆయన తెలిపారు.
35
నిందితుడి అరెస్ట్.. ఆయుధ స్వాధీనం
పోలీసులు ఘటన అనంతరం రాధికా తండ్రిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే లైసెన్స్ ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలి మామను కూడా విచారణలో భాగంగా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయన ఎలాంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. హత్యకు ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
2000 మార్చి 23న జన్మించిన రాధికా యాదవ్, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITF) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 113వ స్థానంలో నిలిచింది. హర్యానాలో మహిళల డబుల్స్ విభాగంలో 5వ స్థానంలో ఉన్నారు. తన ఆటతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రాధికా తన స్వంత టెన్నిస్ అకాడమీలో యువ క్రీడాకారులను శిక్షణ కూడా ఇస్తున్నారని సమాచారం. ఆమె మృతితో ఆమె కుటుంబం, విద్యార్థులు, క్రీడా సంఘం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
రాధికా మాజీ కోచ్ మనోజ్ భారద్వాజ్ మాట్లాడుతూ, "ఆమె క్రమశిక్షణ గల, ప్రతిభావంతురాలైన ప్లేయర్. ఇది క్రీడా ప్రపంచానికి తీరనిలోటు" అని విచారం వ్యక్తం చేశారు.
55
కాల్పులకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కారణమా?
పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించినప్పుడు, ఈ హత్యకు గల కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక రీల్‌ను పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను చూసి రాధికా తండ్రికి కోపం వచ్చిందనీ, కుటుంబ సభ్యుల మధ్య గొడవ పెరిగిందని సమాచారం.
ఈ వివాదం తీవ్రంగా మారి కాల్పుల వరకు చేరిందనే విషయాలు పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ తర్వాత మరిన్ని వవరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇంటి సభ్యులను, పొరుగు వారిని, బంధువులను ప్రశ్నిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.