WI vs ZIM : బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ నయా హిస్టరీ

Published : Feb 23, 2026, 09:48 PM IST

West Indies vs Zimbabwe : టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్ 8 లో జింబాబ్వేపై వెస్టిండీస్ 254 పరుగుల భారీ స్కోరుతో సరికొత్త రికార్డులు సృష్టించింది. షిమ్రాన్ హెట్మెయర్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు.

PREV
15
వాంఖడేలో వెస్టిండీస్ పరుగుల సునామీ

టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాశారు.

ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు మాత్రమే కాదు, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరుగా నమోదైంది. అంతకుముందు 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260/6 పరుగుల రికార్డు ఇప్పటికీ టాప్ లో ఉంది. జింబాబ్వేపై టీ20ల్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.

25
హెట్మెయర్ అల్ట్రా ఫైర్ ఇన్నింగ్స్

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో తను కొద్దిరోజుల క్రితమే స్కాట్లాండ్‌పై నెలకొల్పిన 22 బంతుల రికార్డును తనే తిరగరాశాడు. హెట్మెయర్ మొత్తం 34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (17) కొట్టిన నికోలస్ పూరన్ రికార్డును కూడా హెట్మెయర్ సమం చేశాడు.

35
పావెల్ - హెట్మెయర్ రికార్డు భాగస్వామ్యం

కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ కూడా హెట్మెయర్‌తో పోటీ పడి పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పావెల్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తం 35 బంతుల్లో 59 పరుగులు సాధించాడు. మొదట నెమ్మదిగా ఆరంభించినా, ఆ తర్వాత వరుస సిక్సర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ముఖ్యంగా 13వ ఓవర్లో బ్రాడ్ ఈవన్స్‌పై పావెల్ వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

45
సిక్సర్ల వర్షం.. ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

ఈ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు బాదారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును (నెదర్లాండ్స్‌తో కలిసి) విండీస్ సమం చేసింది. చివర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసి జట్టు స్కోరును 250 దాటించాడు. జింబాబ్వే ఫీల్డర్ల తప్పిదాలు కూడా వెస్టిండీస్‌కు కలిసొచ్చాయి. ముసెక్వివా రెండు సార్లు హెట్మెయర్ ఇచ్చిన క్యాచ్‌లను జారవిడవడం జింబాబ్వేకు భారీ నష్టాన్ని చేకూర్చింది.

55
జింబాబ్వే బౌలర్ల కష్టాలు

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజారబాని 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా, బ్రాడ్ ఈవన్స్ ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రిచర్డ్ ఎంగర్వ 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. సికిందర్ రజా వేసిన ఓవర్లలో హెట్మెయర్ వరుస సిక్సర్లతో విరుచుకుపడటంతో రజా తన 2 ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్ బ్యాటర్లు స్పిన్, పేస్ అనే తేడా లేకుండా స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు.

Read more Photos on
click me!

Recommended Stories