Vaibhav Suryavanshi : పాకిస్థాన్‌పై మెరుపు దాడి.. వైభవ్ దెబ్బకు గిల్, ఉన్ముక్త్ చంద్ రికార్డులు బ్రేక్

Published : Feb 01, 2026, 04:10 PM IST

Vaibhav Suryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్, ఉన్ముక్త్ చంద్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసులోనే అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు.

PREV
16
క్రికెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న బీహార్ బుల్లోడు.. వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డ్

భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఆదివారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, భారత స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, ఉన్ముక్త్ చంద్‌ల బిగ్ రికార్డులను బద్దలు కొట్టాడు.

26
గిల్, ఉన్ముక్త్ రికార్డులు బ్రేక్ చేసిన వైభవ్

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 136.36గా నమోదైంది. ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే యూత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్.. శుభ్‌మన్ గిల్, ఉన్ముక్త్ చంద్‌లను వెనక్కి నెట్టేశాడు. గిల్, చంద్ ఇద్దరూ తమ యూత్ వన్డే కెరీర్‌లో చెరో 1149 పరుగులు సాధించగా, వైభవ్ ఇప్పుడు ఆ మైలురాయిని దాటి ముందుకు వెళ్లాడు.

36
అద్భుత బ్యాటింగ్ తో వైభవ్ సూర్యవంశీ జోరు

వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 23 యూత్ వన్డే మ్యాచ్‌లు ఆడి 50.82 సగటుతో ఏకంగా 1169 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యూత్ వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 171 పరుగులు. భారత యూత్ వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 బ్యాటర్లలో ఒకడిగా వైభవ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్ జోల్ (1404), యశస్వి జైస్వాల్ (1386), తన్మయ్ శ్రీవాస్తవ (1316) మాత్రమే అతనికంటే ముందున్నారు.

46
ఐపీఎల్‌లో సంచలన సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ కేవలం అండర్-19 స్థాయిలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ అయిన ఐపీఎల్‌లోనూ తన ముద్ర వేశాడు. 2025 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని 1.10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

56
బీహార్ నుంచి భారత జట్టు దాకా వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రయాణం

వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. విశేషమేమిటంటే, భారత్ రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలవడానికి కొన్ని రోజుల ముందే ఇతడు పుట్టాడు. ఇతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా మాజీ క్రికెటరే. వైభవ్ ఎడమచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్. 2024లో కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారాని తన రోల్ మోడల్‌గా భావించే వైభవ్, ఎప్పటికప్పుడు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ దగ్గర సలహాలు తీసుకుంటాడు.

66
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడు?

వైభవ్ ప్రదర్శన చూస్తుంటే అతను టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 14 ఏళ్లకే అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్‌లో ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటం సామాన్యమైన విషయం కాదు. సునామీ బ్యాటింగ్ శైలితో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తుండటం అతనికి పెద్ద ప్లస్ పాయింట్. త్వరలోనే అతను భారత జాతీయ సీనియర్ జట్టులో చేరితే ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more Photos on
click me!

Recommended Stories