T20 World Cup 2026 : పాకిస్థాన్ పనైపోయింది.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

Published : Feb 28, 2026, 11:34 PM IST

T20 World Cup 2026 : శ్రీలంకపై గెలిచినా టీ20 ప్రపంచకప్ 2026 నుండి పాకిస్థాన్ అవుట్ అయింది. మెరుగైన రన్ రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. మార్చి 4న కివీస్, దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి.

PREV
16
గెలిచినా ఓడిన పాకిస్థాన్.. సెమీస్ చేరిన కివీస్

టీ20 వరల్డ్ కప్ 2026లో పెను సంచలనం నమోదైంది. సూపర్-8 దశలో తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ, పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి అవుట్ అయింది. సల్మాన్ అలీ అఘా నేతృత్వంలోని పాక్ జట్టుకు ఈ విజయం కేవలం ఊరటను మాత్రమే మిగిల్చింది. రన్ రేట్ సమీకరణాల నేపథ్యంలో పాకిస్థాన్ సెమీఫైనల్ కల చెదిరిపోగా, అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

26
పాకిస్థాన్ కొంపముంచిన రన్ రేట్

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. అదే సమయంలో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ, ఈ మ్యాచ్‌లో 5 పరుగుల స్వల్ప తేడాతో మాత్రమే పాక్ విజయం సాధించింది. దీనివల్ల పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ను అధిగమించలేకపోయింది. దీంతో పాకిస్థాన్ ఇంటిబాట పట్టగా, కివీస్ జట్టు గర్వంగా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మార్చి 4వ తేదీన కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ పోరు జరగనుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుందని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.

36
షాహీన్ అఫ్రిదిని ఉతికేసిన దసున్ షనక

పాకిస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వీరోచితంగా పోరాడాడు. ఒక దశలో పాకిస్థాన్ విజయం నల్లేరు మీద నడక అనుకున్న తరుణంలో, షనక తన బ్యాటింగ్‌తో దడ పుట్టించాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 28 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో షనక వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది పాక్ క్యాంప్‌లో గుబులు రేపాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అయితే, చివరి రెండు బంతుల్లో పరుగులు రాకపోవడంతో శ్రీలంక ఓటమి పాలైంది. షనక కేవలం 31 బంతుల్లో 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, తన జట్టును గెలిపించలేకపోయాడు.

46
ఫర్హాన్ రికార్డు సెంచరీ.. పాక్ భారీ స్కోరు

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మొదట పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పాక్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ ఆరంభం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 176 పరుగుల రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాహిబ్జాదా ఫర్హాన్ ఈ టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకుని అదరగొట్టాడు. మరోవైపు ఫఖర్ జమాన్ 42 బంతుల్లో 84 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత పాక్ ఇన్నింగ్స్ తడబడింది. మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా 25 పరుగుల మార్కును దాటలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 3 వికెట్లతో రాణించాడు.

56
పోరాడి ఓడిన శ్రీలంక

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. ఓపెనర్లు విఫలమైనా, మధ్యలో దసున్ షనక ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లు చివరి క్షణంలో ఒత్తిడిని జయించి 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. విజయం దక్కినా టోర్నీ నుంచి అవుట్ కావడంతో పాక్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

66
ముగిసిన పాక్ ప్రయాణం.. సెమీస్ లెక్కలివే!

ఈ విజయంతో పాకిస్థాన్ వరల్డ్ కప్ ప్రయాణం ముగిసింది. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలో జట్టు సూపర్-8 వరకు వచ్చినా, కీలక సమయాల్లో తడబడటం దెబ్బతీసింది. ఇప్పుడు అందరి దృష్టి మార్చి 4న జరగబోయే సెమీఫైనల్స్‌పైనే ఉంది. దక్షిణాఫ్రికా జట్టు బలమైన ఫామ్‌లో ఉండగా, న్యూజిలాండ్ మరోసారి ఐసీసీ టోర్నీల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో ఎవరు తలపడతారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories